Turkey, Syria Earthquake: ఎంత ఘోరం.. భూకంపం ముందు, తర్వాత శాటిలైట్‌ ఫోటోలు విడుదల

9 Feb, 2023 13:16 IST|Sakshi

టర్కీ, సిరియాలో ఇటీవల సంభవించిన వరుస భూకంపాలు అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. ప్రకృతి విలయానికి ఇరు దేశాలూ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. ఎటుచూసినా కూలిన భవన శిథిలాలు.. వాటి కింద చితికిన బతుకులే దర్శనమిస్తున్నాయి. ఘోర మృత్యుకంపం ధాటికి ఇరు దేశాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

నేలమట్టమైన వేలాది భవనాల శిథిలాల కింద భారీగా శవాలు బయటపడుతున్నాయి. ఇప్పటి దాకా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15,383 వేలకు చేరింది. వేలాది మంది ప్రజలు గాయపడ్డారు. ఒక్క తుర్కియేలోనే దాదాపు 12,391 మంది ప్రాణాలు కోల్పోగా.. సిరియాలో 2,992 మంది మరణించినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.

తుర్కియే, సిరియా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆప్తుల ఆక్రందనలు, మిన్నింటిన రోదనా దృశ్యాలతో భయానంకంగా తయారయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలన్నింటినీ తొలగిస్తే మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. అయితే ఎత్తయిన వేలాది భవనాలు కుప్పకూలడంతో వాటి శిథిలాలను తొలగించడం తలకుమించిన పనిగా మారింది.
చదవండి: తుర్కియే, సిరియాల్లో భూకంపం.. ఆందోళనలో భారత్‌.. ముప్పు ఎంత?

శాటిలైట్‌ దృశ్యాలు విడుదల
రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం దెబ్బకు టర్కీ, సిరియా విలవిల్లాడుతున్నాయి. తాజాగా భూకంపం ముందు, తర్వాత ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన శాటిలైట్‌ విడుదల చేసిన దృశ్యాలు ఉపద్రవం సృష్టించిన వినాశనం కళ్లకు అద్దం పట్టిన్నట్లు చూపిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాలు, స్టేడియాల్లో సహాయక చర్యల కోసం ఏర్పాటు చేసిన అత్యవసర ఆశ్రయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

భారీ భూకంపం కారణంగా ప్రధాన నగరాల్లో ఎత్తైన భవనాలన్నీ నేలమట్టమైన దృశ్యాలు కలవరానికి గురిచేస్తున్నాయి. టర్కీలోని దక్షిణ నగరాలైన అంటాక్యా, కహ్రమన్మరాస్‌, గాజియాంటెప్ భూకంపానికి గురైన అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ కుప్పకూలిన భవనాలు, గుట్టలుగా పేరుకుపోయిన  శిథిలాలు గుండెల్ని పిండేస్తున్నాయి.  ప్రస్తుతం అక్కడ 25వేల మందికి పైగా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. 

2 కోట్ల 30 లక్షల మంది ప్రభావితం
భారీ భూకంపం కారణంగా దాదాపు 2 కోట్ల 30 లక్షల మంది ప్రభావితమైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ప్రభావిత ప్రాంతాల్లో 77 జాతీయ, 13 అంతర్జాతీయ అత్యవసర వైద్య బృందాలను మోహరించినట్లు పేర్కొంది. భారత్‌ సైతం, టర్కీ, సిరియాకు సహాయ సామాగ్రిని అందించింది.

మరిన్ని వార్తలు