మసీదులో భారీ పేలుడు.. 20 మంది మృతి!

18 Aug, 2022 08:21 IST|Sakshi

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం సాయంత్రం ప్రార్థనల సందర్భంగా ఈ పేలుడు జరగటంతో భారీ ప్రాణనష్టం సంభవించినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు.. 35 మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని తాలిబన్‌ నిఘా విభాగం అధికారి ఒకరు తెలిపారు. 

ఉత్తర కాబుల్‌, ఖైర్‌ ఖానా ప్రాంతంలోని మసీదులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు కిటికీలు, అద్దాలు పగిలిపోయాయన్నారు. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి. మృతుల్లో మసీదు ఇమామ్‌ సైతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిఘా విభాగం బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టాయి.

ఇదీ చదవండి: పాపం! సహోద్యోగి గట్టిగా కౌగిలించుకున్నాడని కోర్టుకెక్కిన మహిళ.. తీర్పు ఏంటంటే?

మరిన్ని వార్తలు