ఇస్తాంబుల్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. పరుగులు పెట్టిన జనం

13 Nov, 2022 21:53 IST|Sakshi

ఇస్తాంబుల్‌: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఆదివారం సాయంత్రం భారీ పేలుడు కలకలం సృష్టించింది. నిత్యం పర్యాటకులు, స్థానికులతో రద్దీగా ఉండే బెయోగ్లూ జిల్లాలోని  ఇస్తిక్‌లాల్‌ షాపింగ్‌ స్ట్రీట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం 4.00 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పేలుడు జరిగిన క్రమంలో ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో పరుగులు పెడుతున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, ఆరోగ్య విభాగం, ఏఎఫ్‌ఏడీ బృందాలు సంఘటానా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. 

పేలుడు జరిగిన క్రమంలో ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేపట్టారు పోలీసులు. నగరంలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. సైరన్‌ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే, పేలుడుకు గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. రెండో పేలుడు జరుగుతుందనే అనుమానంతో ఆ ప్రాంతాన్ని మూసివేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. మార్కెట్‌ ప్రవేశ మార్గాల్లో భారీగా బలగాలను మోహరించినట్లు వెల్లడించింది. 

‘ఘటనాస్థలానికి నేను 50-55 మీటర్ల దూరంలోనే ఉన్నాను. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వచ్చింది. ముగ్గురు-నలుగురు పడిపోయి కనిపించారు. భయంతో అక్కడి వారంతా పరుగులు పెట్టారు. నల్లటి పొగ కమ్ముకుంది. శబ్దం చెవులు పగిలిపోయేలా భారీగా వచ్చింది’ అని ప్రత్యక్ష సాక్షి, 57 ఏళ్ల కెమాల్‌ డెనిజ్కి తెలిపారు. ఇస్తిక్‌లాల్‌ షాపింగ్‌ వీధిలో ఆదివారం భారీగా జనం ఉంటారు. ఈ క్రమంలో పేలుడు జరగటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2015-2016లో ఇస్తిక్‌లాల్‌ స్ట్రీట్‌లో పేలుడు జరిగి సుమారు 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

విద్రోహ చర్య.. ఖండించిన ప్రెసిడెంట్‌..
రద్దీగా ఉండే ప్రాంతంలో సామాన్యులే లక్ష్యంగా చేసిన దాడిని ఖండించారు టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయీప్‌ ఎర్డోగాన్‌. ఇది ఉగ్రవాదులు చేసిన విద్రోహ చర్యేనని పేర్కొన్నారు. దుండగులను పట్టుకునేందుకు సంబంధిత విభాగాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.

ఇదీ చదవండి: ‘పులిని చూసిన మేకల్లా పారిపోయారు’.. రష్యా సేనలపై ఉక్రెయిన్‌ పౌరుల సెటైర్లు

మరిన్ని వార్తలు