-

South Korea New Age Counting: రాత్రికి రాత్రే వయసు తగ్గిపోయింది.. జంబలకిడి పంబ మాయేం కాదేది!

30 Jun, 2023 07:26 IST|Sakshi

రాత్రికి రాత్రే వయసు ఏకంగా ఒకటి నుంచి రెండేళ్లు తగ్గిపోయింది. అదీ ఒకరిద్దరికీ కాదు. ఏకంగా 5 కోట్ల మందికి!. ఇదేం జంబలకిడి పంబ మాయ కాదు. కొత్తగా తీసుకొచ్చిన చట్టం మూలంగా అక్కడి ప్రజల వయసు అలా ఆటోమేటిక్‌గా తగ్గిపోవాల్సి వచ్చింది. ఇంతకీ ఏమా చట్టం? ఎవరా ప్రజలు?.. ఎందుకు మార్చాల్సి వచ్చింది తెలియాలంటే.. 

దక్షిణ కొరియా.. జనాభా దాదాపు ఐదున్నర కోట్ల దాకా ఉంటుంది. కానీ, వాళ్లను వయసెంత అని అడిగితే మాత్రం మూడు రకాల సమాధానాలు ఇస్తుంటారు. దాని వల్ల ఆ దేశంలో అన్నింటా గందరగోళమే!. అందుకు కారణం.. మూడు విధాలుగా వాళ్ల వయసును లెక్కించడం. 

సౌత్ కొరియాలో ఇప్పటివరకూ..  సంప్రదాయ పద్దతిలో వయసు లెక్కింపు విధానంతో పాటు కేలండర్ ఏజ్, ఇంటర్నేషనల్ ఏజ్ అనే మూడు రకాల పద్ధతులను వాడుతూ వచ్చారు. కొరియన్‌ సంప్రదాయం ప్రకారం.. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే వయసు లెక్కింపు మొదలవుతుంది. అలాగే.. జనవరి 1వ తేదీ నుంచి(కేలండర్‌ ఏజ్‌) ప్రకారం ఒక వయసు(అంటే ఒకవేళ బిడ్డ డిసెంబర్‌ 31వ తేదీన పుట్టినా కూడా.. ఆ మరుసటి రోజు నుంచి ఆ బిడ్డ వయసును రెండేళ్లుగా గుర్తిస్తారు) ఒక వయసు, ఇక ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌కు తగ్గట్లుగా అంటే అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి వయసు లెక్కింపు(డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ఆధారంగా).. ఇలా మూడు రకాలుగా ఉంటూ వచ్చింది. 

► ఉదాహరణకు ఒక వ్యక్తి 2003 జూన్‌ 30వ తేదీన పుట్టాడనుకోండి.. ఆ వ్యక్తికి 29 జూన్ 2023 నాటికి ఇంటర్నేషనల్‌ ఏజ్‌ బర్త్‌ ప్రకారం 19 ఏళ్లు, అదే కౌంటింగ్ ఏజ్ విధానంలో 20, కొరియన్ ఏజ్ విధానంలో 21 ఏళ్లు ఉండేది. దీనివల్ల చదువు మొదలు ఉద్యోగాల దాకా అన్నింటా చాలా ఏళ్లుగా గందరగోళం ఏర్పడుతూ వస్తోంది.  పైగా ఈ తరహా విధానాల వల్ల ప్రభుత్వాలపై ఆర్థికంగా పెను భారం పడుతూ వచ్చింది ఇంతకాలం.

► దీనికి తెర దించేందుకు.. ఇక నుంచి అంతర్జాతీయ విధానాన్ని.. అంటే అన్ని దేశాల్లో ఎలా అనుసరిస్తారో అలా పుట్టిన తేదీ నుంచి(డేట్‌ ఆఫ్‌ బర్త్‌) విధానాన్ని అనుసరిస్తారు. ఇందుకోసం చేసిన చట్టం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. సో.. ఇప్పటి నుంచి పుట్టిన తేదీ ప్రకారమే అక్కడి ప్రజలు జీవనం కొనసాగించనున్నారు.

► దక్షిణ కొరియాకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక యూన్ సుక్ యోల్ సంస్కరణల వైపుగా అడుగులేయడం మొదలుపెట్టారు. సాంప్రదాయ వయస్సు-గణన పద్ధతులు వల్ల అనవసరమైన సామాజిక, ఆర్థిక వ్యయాలు ఏర్పడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. ఇక నుంచి కొత్త చట్టం అమలు మూలంగా అన్ని జ్యుడీషియల్, అడ్మినిస్ట్రేటివ్ విషయాల్లో అంతర్జాతీయ వయసు లెక్కింపు విధానాన్నే అను సరిస్తారని, దీనివల్ల సామాజిక గందరగోళాలు, వివాదాలు తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

► ఈ చట్టాన్ని పోయిన ఏడాది డిసెంబర్ లోనే పార్లమెంట్ ఆమోదించింది. అలాగే పబ్లిక్‌ ఒపీనియన్‌లో భాగంగా సర్కారు నిర్ణయానికి ఏకంగా 86.2% దేశ ప్రజలు మద్దతు ప్రకటించారు. మిగతా సర్వేల్లోనూ.. ప్రతీ నలుగురిలో ముగ్గురు డేట్‌ ఆఫ్‌ బర్త్‌ వయసు గణన వైపే మొగ్గు చూపించారు. 

గతంలో చాలా దేశాలు సంప్రదాయ వయసు లెక్కింపు విధానాలను పాటించేవి. అందులో తూర్పు ఏషియా దేశాలు ప్రముఖంగా ఉండేవి. అయితే వీటిలో చాలావరకు వాటిని వదిలేసి.. గ్లోబల్‌ స్టాండర్డ్‌ను పాటిస్తూ వస్తున్నాయి. జపాన్‌ 1950లో, ఉత్తర కొరియా 1980 దాకా సంప్రదాయ వయసు లెక్కింపు విధానాలనే పాటిస్తూ ఉండేవి. 

ఇదీ చదవండి: డైనోసార్లు మనకు కాస్త దగ్గరే!

మరిన్ని వార్తలు