రాజపక్స పారిపోతాడనుకోలేదు.. భారత్‌ను ఎంత సాయం అడుగుతాం!

13 Jul, 2022 20:53 IST|Sakshi

కొలంబో: తీవ్ర ప్రజాగ్రహం.. అత్యవసర పరిస్థితి కర్ఫ్యూల విధింపుతో శ్రీలంక రణరంగాన్ని తలపిస్తోంది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వుల నేపథ్యంలో.. హెలికాప్టర్‌ల ద్వారా గస్తీ కాస్తోంది అక్కడి సైన్యం, పోలీసు విభాగాలు. టియర్‌ గ్యాస్‌ ప్రయోగంతో ఓ వ్యక్తి మృతి చెందాడన్న వార్తల నడుమ.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ. 

దీనంతటికి కారణం.. అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోవడం. రాజీనామా డెడ్‌లైన్‌ రోజే ఆయన కనిపించకుండా పోయేసరికి ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. అయితే గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోతారని ఎవరూ ఊహించలేదని లంక మాజీ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య తెలిపారు. శ్రీలంక నిరసనల్లో మొదటి నుంచి పాల్గొంటున్నారు ఆయన. ‘‘ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. రాజీనామా చేసి.. ఇక్కడే ఉంటాడని అనుకున్నాం అంతా. దురదృష్టవశాత్తూ అది జరగలేదు. ఈ ఉదయమే ఆయన మాల్దీవులకు పారిపోయినట్లు తెలిసింది’’ అని జయసూర్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

గత కొన్ని నెలలుగా ప్రజావసర వస్తువులేవీ దొరకడం లేదు. అదనంగా గ్యాస్‌, కరెంట్‌, కనీస ఆరోగ్య అవసరాల కొరతను ఇక్కడి పౌరులు చవిచూస్తున్నారు. వీధుల్లోకి చేరి ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేస్తున్నారు.. అదీ ప్రశాంతంగానే అని పేర్కొన్నారు ఆయన. శ్రీలంకకు అనేక సందర్భాల్లో భారత్ ఎంతో సాయపడిందని, కానీ సాయం చేయాలంటూ భారత్ ను ఎన్నిసార్లు అడగ్గలం? అని వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు సొంతంగా ఏదైనా ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని జయసూర్య అభిప్రాయపడ్డారు. 

ఆ ఇద్దరే కారణం..
ఎంతో అందమైన దేశంగా, పర్యాటకుల పాలిట స్వర్గంలా ఒకప్పుడు గుర్తింపు పొందిన శ్రీలంక ఇప్పుడు కల్లోలభరిత దేశంగా నిరసనలతో హోరెత్తుతోంది. తాజాగా జులై 9 తర్వాత దేశంలో చెలరేగిన ఆందోళనలకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని రణిల్ విక్రమసింఘేలు కారణమని ఆరోపించారు జయసూర్య. పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించి మాట తప్పారని, ఇప్పటికీ పదవులను అంటిపెట్టుకునే ఉన్నారని విమర్శించారు. శ్రీలంక ప్రజలకు వారిద్దరిపై పూర్తిగా నమ్మకం పోయిందని స్పష్టం చేశారు. రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వస్తున్నా వారు ఖాతరు చేయడంలేదని మండిపడ్డారు. దేశంలో చెలరేగుతున్న ఆందోళనలు నిలిచిపోవాలంటే ఏదైనా మార్గం ఉందంటే అది వారి రాజీనామాలే అని జయసూర్య స్పష్టం చేశారు. పనిలో పనిగా తాత్కాలిక అధ్యక్షుడు, ప్రధాని రణిల్‌ విక్రమసింఘేను మిస్టర్‌ బీన్‌ క్యారెక్టర్‌తో పోలుస్తూ.. ఓ వ్యంగ్యమైన ట్వీట్‌ చేశారు జయసూర్య.

నిరసనలు ఇలాగే కొనసాగాలని ఎవరూ కోరుకోవడంలేదని, పరిస్థితులే ప్రజలను ఆ దిశగా పురిగొల్పుతున్నాయి. దీనికి ఎక్కడో ఓ చోట చరమగీతం పాడాలని, వీలైనంత త్వరగా ప్రశాంత జీవనంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నామని సనత్‌ జయసూర్య తెలిపారు. 

మరిన్ని వార్తలు