వీడియో: తైవాన్‌లో శక్తివంతమైన భూకంపం.. బొమ్మలాగా ఊగిపోయిన రైలు

19 Sep, 2022 07:28 IST|Sakshi

తైపీ/టోక్యో: తైవాన్‌ను శక్తివంతమైన భూకంపనలు కుదిపేశాయి. శనివారం నుంచి సంభవిస్తున్న వరుస భూకంపాల నేపపథ్యంతో అక్కడి యంత్రాంగం అప్రమత్తమైంది. శనివారం సాయంత్రం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.4గా నమోదైంది. ఆదివారం మరోసారి 6.9 తీవ్రతతో భూమి కంపించింది. తీవ్రతకు హువాలియన్‌ నగరం యులి టౌన్‌లోని మూడంతస్తుల భవనం ఒకటి కూలిపోయింది. అందులో చిక్కుకుపోయిన నలుగురిని ఫైర్‌ సిబ్బంది కాపాడారు. ఓ సిమెంట్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో సిబ్బంది ఒకరు చనిపోయారు.

శివారు ప్రాంతంలోని వంతెన కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులతోపాటు రెండు, మూడు వాహనాలు కిందపడిపోయినట్లు సమాచారం. కొండచరియలు విరిగిపడి యులిలోని ప్రముఖ పర్వత ప్రాంతంలో 400 మంది పర్యాటకులు చిక్కుబడిపోయారు. వేర్వేరు ఘటనల్లో 9 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఫులి టౌన్‌లోని డోంగ్లి స్టేషన్‌ సమీపంలోని ట్రాక్‌పైకి శిథిలాలు పడిపోవడంతో ఒక రైలు పట్టాలు తప్పింది. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదని రైల్వే శాఖ తెలిపింది. మరో చోట భూకంప తీవ్రతకు  రైళ్లు బొమ్మలాగా ఊగిపోయిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు ప్రాణాల కోసం బిక్కుబిక్కుమంటూ ఓ మూలన దాక్కున్నారు. ఇక షిసాంగ్‌ పట్టణంలో భూమికి 7 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉందని తైవాన్‌ వాతావరణ శాఖ తెలిపింది. 

తైవాన్‌లో 1999 సెప్టెంబర్‌లో సంభవించిన భూకంపం భారీది. సుమారు 2,400 మందిని బలిగొంది ఆ ప్రకృతి విలయం. 

ఇక జపాన్‌ దక్షిణ తీరాన్ని టైపూన్‌ వణికిస్తోంది. ప్రతికూల ప్రభావాలతో..  జపాన్, తైవాన్‌లకు సునామీ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ అనంతరం వాటిని ఉపసంహరించుకుంది.

సురక్షిత ప్రాంతాలకు వేలాది మంది తరలింపు 
టైఫూన్‌ ‘నన్మదోల్‌’నేపథ్యంలో అధికార యంత్రాంగం కగోషిమాలోని 12 వేల మందిని ప్రత్యేక కేంద్రాలకు తరలించింది. పొరుగునే ఉన్న మియజకి ప్రిఫెక్చర్‌లోని 8 వేల మంది తమ నివాసాలను వీడారు. కుషిమా నగరంలో 15 మంది ప్రజలు తుపాను సంబంధిత ఘటనల్లో గాయపడినట్లు ప్రభుత్వ టీవీ తెలిపింది. ‘నన్మదోల్‌’మరింత తీవ్రమై గంటకు 162 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని జపాన్‌ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సోమవారం సాయంత్రానికల్లా 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.  మంగళవారం నాటికి ‘నన్మదోల్‌’టోక్యోను తాకే అవకాశముందని తెలిపింది.

ఇదీ చదవండి: పుతిన్‌ ‘తప్పు’టడుగులు ఏం చేస్తాయో?

మరిన్ని వార్తలు