Afghanistan: తాలిబన్లకు నిరసనల సెగ

19 Aug, 2021 04:27 IST|Sakshi

దేశవ్యాప్తంగా అఫ్గాన్‌ జెండా ఎగరాలని డిమాండ్‌లు

కాల్పుల్లో ముగ్గురు నిరసనకారులు మృతి  

సమాన హక్కుల కోసం రోడ్డెక్కిన మహిళలు  

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సన్నాహాలు చేస్తుంటే వారికి నిరసనల స్వాగతాలు ఎదురవుతున్నాయి. తాలిబన్లకు వ్యతిరేకంగా మహిళలు కూడా రోడ్డెక్కి గట్టిగా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌ స్వాతంత్య్ర దినం (ఆగస్టు 19)కి ఒక్కరోజు ముందు ప్రభుత్వ కార్యాలయాలపై అఫ్గాన్‌ పతాకం ఎగరాలని డిమాండ్లు మిన్నంటాయి. తాలిబన్లపై ప్రజలు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో వారు అత్యంత కఠినంగా నిరసనల్ని అణగదొక్కేస్తున్నారు.

జలాలాబాద్‌లో నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్‌ జెండాకు బదులుగా తిరిగి అఫ్గాన్‌ పతాకాన్ని ఎగురవేయాలన్న డిమాండ్‌తో బుధవారం నిరసన ప్రదర్శనలకు దిగారు. అఫ్గాన్‌ జెండా పట్టుకొని వందలాది మంది నిరసనకారులు నడిచి వెళుతూ ఉంటే, వారిని చెదరగొట్టడానికి తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నిరసనని కవర్‌ చెయ్యడానికి వచ్చిన జర్నలిస్టుల్ని చితక్కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో కాల్పుల శబ్దాలు కూడా స్పష్టంగా వినిపించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారని, డజన్ల మంది గాయపడ్డారని అల్‌జజీరా ఛానెల్‌ వెల్లడించింది.  

మహిళల నుంచే తొలి నిరసనలు  
కాబూల్‌లో మహిళల రూపంలో తొలిసారిగా తాలిబన్లకు నిరసనల సెగ తగిలింది. సమాన హక్కుల్ని డిమాండ్‌ చేస్తూ మహిళలు ప్ల కార్డులు పట్టుకొని కాబూల్‌ వీధుల్లో నిరసనకి దిగారు. వీరి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పక్కనే తాలిబన్లు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నా వారు బెదిరిపోలేదు. తమ హక్కుల్ని కాపాడాలని నినాదాలు చేశారు.

హిజాబ్‌ లేదని మహిళని కాల్చి చంపారు!
పేరుకే శాంతి మంత్రాన్ని వల్లిస్తున్న తాలిబన్లు ఆచరణలో తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారు. టఖార్‌ ప్రావిన్స్‌లో ఒక మహిళ హిజాబ్‌ (తల కనిపించకుండా వస్త్రంతో చుట్టుకోవడం) లేకుండా బయటకు రావడంతో తాలిబన్లు మంగళవారం ఆమెని కాల్చి చంపినట్టుగా  ఫాక్స్‌ న్యూస్‌ వెల్లడించింది. దేశం విడిచి పారిపోవాలని కాబూల్‌ విమానాశ్రయానికి వస్తున్న వారిపై పదునైన ఆయుధాలతో దాడికి దిగుతున్నారు. ఎయిర్‌పోర్టులో జనాల్ని నియంత్రించడానికి గాల్లోకి కాల్పులు జరపడం, మహిళలు, పిల్లలని చూడకుండా కర్రలతో కొట్టడం వంటివి చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.

మరిన్ని వార్తలు