‘టిక్‌టాక్‌’ అమ్మకంపై ఉత్కంఠ!

3 Aug, 2020 14:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనాకు చెందిన ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ ‘టిక్‌టాక్‌’ ను అమెరికాకు చెందిన ఏదైనా కంపెనీకి విక్రయించాలని, లేకపోయినట్లయితే ఆ యాప్‌ను తమ దేశంలో నిషేధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన నేపథ్యంలో అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘టిక్‌టాక్‌’ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. ఈ యాప్‌ను భారత దేశం ఇప్పటికే నిషేధించిన విషయం తెల్సిందే. ఈ యాప్‌ను అమెరికా కంపెనీకి విక్రయించేందుకు టిక్‌టాక్‌ యాప్‌ను నిర్వహిస్తున్న చైనా కంపెనీ ‘బైట్‌డాన్స్‌’కు ట్రంప్‌ 45 రోజులపాటు గడువు ఇచ్చిన నేపథ్యంలో ఆ యాప్‌ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ టెక్‌ కంపెనీ ‘మైక్రోసాఫ్ట్‌’ ముందుకు వచ్చింది. ప్రస్తుతం రెండు కంపెనీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.(సెప్టెంబరు 15 నాటికి మైక్రోసాఫ్ట్‌ చేతికి టిక్‌టాక్‌)

అమెరికాతోపాటు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో ఈ యాప్‌ను కొనుగోలు చేస్తామని చైనా కంపెనీకి మైక్రోసాఫ్ట్‌ ప్రతిపాదించింది. అమెరికా ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడంతోపాటు వినియోగదారుల సమాచారం దేశం దాటి వెలుపలికి పోకుండా తగిన చర్యలు తీసుకుంటామని మైక్రోసాఫ్ట్‌ కంపెనీ ఓ ప్రకటనలో అమెరికా ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.అమెరికాలో టిక్‌టాక్‌ అమ్మకం గురించి తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, టిక్‌టాక్‌ వినియోగదారుల సమాచారం చైనా కమ్యూనిస్టు పార్టీకిగానీ, అక్కడి ప్రభుత్వానికిగానీ అందుబాటులో లేదని టిక్‌టాక్‌ సీఈవో కెవిన్‌ మేయర్‌ సోమవారం స్పష్టం చేశారు.

ట్రంప్‌ చేసిన ఆరోపణలు పూర్తిగా రాజకీయపరమైనవని ఆయన అన్నారు.  అమెరికా టిక్‌టాక్‌ వినియోగదారుల సమాచారం చైనా కమ్యూనిస్టు పార్టీతోపాటు ఆ దేశ సైనిక వర్గాలకు చేరుతోందని, అది దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ట్రంప్‌ ఆరోపించిన విషయం తెల్సిందే. టిక్‌టాక్‌ కార్యాలయాన్ని అమెరికా నుంచి బ్రిటన్‌కు మారుస్తున్నట్లు వస్తోన్న వార్తలను టిక్‌టాక్‌ అమెరికా జనరల్‌ మేనేజర్‌ వెనెస్సా పప్పాస్‌ చెప్పారు. అలాగే అమ్మే ఉద్దేశం కూడా ప్రస్తుతానికి లేదని ఆమె చెప్పారు.

మరిన్ని వార్తలు