ప్రచారంలో ట్రంప్‌ దూకుడు

13 Oct, 2020 09:05 IST|Sakshi

వాషింగ్టన్‌ : కోవిడ్‌-19 బారినపడి అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని పదిరోజుల పాటు కోల్పోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన క్యాంపెయిన్‌ను ముమ్మరం చేశారు. తాను పూర్తిగా కోలుకుని శక్తిని కూడగట్టుకున్నానని ఫ్లోరిడా క్యాంపెయిన్‌లో ట్రంప్‌ ఉత్తేజపూరితంగా మాట్లాడారు. తాను కరోనా వైరస్‌కు గురై ఇప్పుడు పూర్తిగా రోగనిరోధకత సాధించానని వైద్యులు చెబుతున్నారని పెద్దసంఖ్యలో చేరుకున్న అభిమానులు,ప్రజలను ఉద్దేశించి ట్రంప్‌ పేర్కొన్నారు. తాను శక్తివంతంగా ఉన్నానని, హుషారుగా నడుస్తానని..ప్రేక్షకులందరినీ ముద్దాడగలను..ఇక్కడ ఉన్న యువతను గాఢంగా హత్తుకుంటానని శ్రోతలను ఉత్సాహపరిచారు.

ఇక ట్రంప్‌ ఫ్లోరిడా పర్యటనకు ముందు ఆయనకు నిర్వహించిన కరోనా టెస్ట్‌లో నెగెటివ్‌ వచ్చిందని అధ్యక్షుడి వైద్య బృందం వెల్లడించింది. నవంబర్‌ 3న జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందు కీలక రాష్ట్రాలను చుట్టిరావాలని ట్రంప్‌ ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారం రోజుల తర్వాత ఫ్లోరిడా క్యాంపెయిన్‌లో ట్రంప్‌ ఏకంగా గంట సేపు మాట్లాడారు. హిల్లరీ క్లింటన్‌పై విమర్శల నుంచి మీడియా అవినీతి ప్రస్తావన, లెఫ్ట్‌కు హెచ్చరికలు, సోషలిస్ట్‌లపై విరుచుకుపడుతూ ట్రంప్‌ తనదైన దూకుడు ప్రదర్శించారు.

స్లీపీ జో’ అంటూ తన ప్రత్యర్ధిపైనా చురకలు వేస్తూ ట్రంప్‌ ప్రసంగం సాగింది. మరో 22 రోజుల్లో ఫ్లోరిడాలో తాము గెలుపొందుతామని, వైట్‌హౌస్‌లో మరో నాలుగేళ్లు కొనసాగుతామని స్పష్టం చేశారు. ‘మరోవైపు కరోనా వైరస్ వెంటాడుతున్నా ట్రంప్‌ భారీ సభలు, మాస్క్‌ లేకుండా కలియతిరగడం వంటి చర్యలతో ప్రచార పర్వం సాగిస్తుంటే జో బిడెన్‌ మాత్రం కోవిడ్‌-19 మార్గదర్శకాలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ ప్రచార ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. చదవండి : అధ్యక్ష అభ్యర్థుల ఖర్చు ఎంతో తెలుసా?

మరిన్ని వార్తలు