నాటోలో చేరిక.. ఫిన‍్లాండ్‌, స్వీడన్లకు ఊహించని షాక్‌..?

18 May, 2022 17:34 IST|Sakshi

Turkey Blocking Sweden and Finland NATO Bids: ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫిన్లాండ్‌, స్వీడన్‌.. నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. నాటో చేరువద్దంటూ రష్యా అధ‍్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వార్నింగ్‌ ఇచ్చినప్పటికీ ఈ రెండు దేశాలు దరఖాస్తు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. 

ఇదిలా ఉండగా.. ఫిన్లాండ్‌, స్వీడన్‌ దేశాలు నాటో దరఖాస్తు పత్రంపై సంతకాలు చేశాయి. దీన్ని బ్రస్సెల్స్​లోని నాటో ప్రధాన కార్యాలయంలో బుధవారం అందజేయనున్నాయి. ఇక, ఈ రెండు దేశాలకు నాటో సభ్యత్వం దక్కలంటే.. అందులోని 30 సభ్య దేశాల ఆమోదం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఏ ఒక్క దేశం వ్యతిరేకంగా ఉన్నా కొత్త దేశం నాటోలో చేరలేదు. అయితే, ఫిన్లాండ్‌, స్వీడన్‌ దేశాలు నాటో చేరికపై అగ్రరాజ‍్యం అమెరికా సహా మరిన్ని దేశాలు దాదాపు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. కానీ, టర్కీ మాత్రం అడ్డుపుల్ల వేస్తున్నట్టు తెలుస్తోంది.  

ఇటీవల టర్కీ అధ్యక్షుడు రికెప్ తయ్యిప్ ఎర్డోగన్‌.. రష్యా దాడుల భయంతోనే ఫిన్లాండ్, స్వీడన్ నాటోలో చేరేందుకు ముందుకు వచ్చాయని సెటైరికల్‌గా ఆరోపించారు. మరో అడుగు ముందుకేసి ఈ రెండు దేశాలు కుర్దీస్థాన్‌ వర్కర్స్‌ పార్టీ (పీకేకే) మిలిటెంట్లకు ఆశ్రయం కల్పిస్తున్నాయని కామెంట్స్‌ చేశారు. ఆయన వ్యాఖ‍్యలతో ఒక్కసారిగా షాక్‌ తగిలింది. దీంతో టర్కీ అడ్డుపడుతుందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.

మరోవైపు.. నాటోలో చేరేందుకు సిద్ధమైన స్వీడన్, ఫిన్లాండ్‌ దేశాధినేతలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీ కానున్నారు. వైట్‌హౌస్ వేదికగా గురువారం స్వీడన్ ప్రధాని మాగ్డెలినా అండర్సన్,ఫిన్లాండ్‌ అధ్యక్షుడు సౌలి నినిస్టోలతో బైడెన్ సమావేశం కానున్నట్లు వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. దీంతో వీరి మధ్య భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. 

ఇది కూడా చదవండి: అమెరికాలో కరోనా కల్లోలం.. బైడెన్‌ కీలక నిర‍్ణయం
 

మరిన్ని వార్తలు