War Updates: కాల్పుల విరమణ వేళ.. విరుచుకుపడుతున్న రష్యా బలగాలు

8 Mar, 2022 17:19 IST|Sakshi

Live Updates: ఉక్రెయిన్‌ రష్యా మధ్య యుద్ధం 13వ రోజుకి చేరుకుంది. ఉక్రెయిన్‌ నుంచి పౌరులు తరలిపోయేందుకు వీలుగా కొన్ని మార్గాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ పాటిస్తామని రష్యా మరోమారు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే హ్యుమానిటేరియన్‌ కారిడార్ల పేరిట పౌరుల తరలింపునకు రష్యా పేర్కొన్న మార్గాల్లో అత్యధికం రష్యా, బెలారస్‌కు దారితీయడంపై ఉక్రెయిన్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. రష్యా మధ్యయుగాల నాటి తంత్రాలను ప్రయోగిస్తోందని విమర్శించింది. సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్న మారిపోల్‌ తదితర నగరాల్లో ఇంతవరకు ఎలాంటి తరలింపులు నమోదు కాలేదు. ఒకపక్క కొన్నిప్రాంతాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా బలగాలు మిగిలిన ప్రాంతాల్లో యథాతథంగా యుద్ధాన్ని కొనసాగించాయి. 

మైకోలైవ్ పోర్ట్‌లో చిక్కుకుపోయిన 75 మంది భారతీయ నావికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఉక్రెయిన్‌ భారత రాయబార కార్యాలయం తెలదిపింది. ఆదివారంమొత్తం 57 మంది నావికులను బస్సులు ఏర్పాటు చేసి తరలించినట్లు తెలిపింది. నేడు మిగిలిన 23 మంది నావికుల తరలింపును ఏర్పాట్లుఉ జరుగుతున్నాయని తెలిపింది.

మారియుపోల్‌లో రష్యా మూడు లక్షల మంది పౌరులను బందీలుగా ఉంచిందని ఉక్రెయిన్‌ విదేశాంగశాఖ మంత్రి దిమిత్రో కులేబా ఆరోపించారు. ఇంటర్నేషనల్‌ కమిటీ ఆఫ్‌ ది రెడ్‌ క్రాస్‌ మధ్యవర్తిత్వంతో ఒప్పందాలు ఉన్నప్పటికీ.. రష్యా ఈ తరలింపు ప్రక్రియను అడ్డుకుంటోందని తెలిపారు. ఈ మేరకు సోమవారం ట్వీట్‌ చేశారు.

రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఉక్రెయిన్‌కు చెందిన దాదాపు 17 లక్షల మంది దేశం విడిచి వెళ్లిపోయినట్లు ఐరాస పేర్కొంది.. వీరందరూ పొరుగు దేశాల్లో శరణార్థులుగా ఉంటున్నట్లు తెలిపింది.. దాదాపు 10 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులకు పోలాండ్ తమ దేశంలో ఆశ్రయం కల్పించిందని, ఉక్రెయిన్- రష్యా సంక్షోభానికి తక్షణమే తెరపడని పక్షంలో లక్షలాది మంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తంచేసింది.

ఉక్రెయిన్‌లో సుమీలో కాల్పుల విరమణ కొనసాగుతుండటంతో అక్కడి భారతీయ వైద్య విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 600 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారని తెలుస్తోంది. రష్యా వైపు నుంచి నిరంతర కాల్పుల కారణంగా.. వారిని ఇప్పటివరకు ఖాళీ చేయలేకపోయారు.

► రష్యా బలగాలు మరో దారుణానికి ఒడిగట్టాయి. సుమీ ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్‌ భవనాలపై రష్యన్‌ బలగాలు 500 కిలోల బాంబుతో దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు సహా 18 మంది మృతి చెందారని ఉక్రెయిన్‌ సాంస్కృతిక, సమాచార పాలసీ మంత్రిత్వ శాఖ మంగళవారం ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. 

గ్రీన్‌కారిడార్‌కు మార్గం సుగమం. సుమీ నుంచి పోల్టావాకు బస్సుల్లో పౌరుల తరలింపు.   

కొనసాగుతున్న కాల్పుల విరమణ.. సమస్యాత్మక ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైన్యం నడుమే పౌరుల తలింపు.

►  తూర్పు, మధ్య ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దెబ్బకి రాత్రికి రాత్రే పలు నగరాల్లో బాంబుల వర్షం కురిసింది. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ అధికారులు ధృవీకరించారు.

► ఎక్కడా దాక్కోలేదు.. ఇదే నా లొకేషన్‌

రహస్య ప్రాంతానికి పారిపోయాడంటూ వస్తున్న కథనాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించాడు. తను ఎక్కడ ఉన్నానో తెలియజేసే లొకేషన్ ను ఇన్ స్టా గ్రామ్ పేజీలో జెలెన్ స్కీ షేర్ చేశారు. ‘‘నేను కీవ్ లోని బాంకోవా స్ట్రీట్ లో ఉన్నాను. నేను దాక్కోలేదు. నేను ఎవరికీ భయపడడం లేదు’’అంటూ పోస్ట్ పెట్టారు. మనం ఈ దేశ భక్తి యుద్ధంలో గెలవడానికి ఏదైనా కోల్పోవచ్చని  వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 24న రష్యా యుద్ధం మొదలు పెట్టిన తర్వాత.. రష్యా దళాలు చేసిన మూడు హత్యా ప్రయత్నాల నుంచి జెలెన్ స్కీ తప్పించుకున్నట్టు కథనాలు వస్తుండడం తెలిసిందే. తనను చివరిగా చూడడం ఇదే కావచ్చంటూ కొన్ని రోజుల క్రితం ఆయన నిర్వేద ప్రకటన చేయడం గమనార్హం. 


 

మరికాసేపట్లో రష్యా కాల్పుల విరమణ.. ఉక్రెయిన్‌ పట్టణాల్లో అమలు కానుంది. అయితే మరోవైపు మిగతా ప్రాంతాల్లో రష్యా పెను విధ్వంసానికి పాల్పడుతోంది. పౌరుల భద్రతపై దృష్టి పెడుతున్న ఉక్రెయిన్‌.. యుద్ధంపై సరిగా ఫోకస్‌ చేయలేకపోతోంది. అయినప్పటికీ పౌరులు యుద్ధ రంగంలోకి దిగి.. రష్యా బలగాలను ప్రతిఘటిస్తున్నాయి.

► మరోసారి కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా. ఈసారి ఐదు నగరాల్లో. మానవతా కోణంలో తరలింపునకు అంగీకారం. రాజధాని కీవ్‌ను సైతం చేర్చిన వైనం. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభం కానున్న కాల్పుల విరమణ. 

► కీవ్‌, ఖార్కీవ్‌ నుంచి రష్యా, బెలారస్‌కు పౌరుల తరలింపును రష్యా ప్రొత్సహిస్తోందని, ఇది ఆందోళన కలిగించే అంశమని ఉక్రెయిన్‌ వాదిస్తోంది. అయితే రష్యా ఈ ఆరోపణలను ఖండించింది. ఇందులో వాస్తవం లేదని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. 

► 200 మంది భారతీయులు ప్రత్యేక విమానంలో మంగళవారం ఉదయం ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు. రొమేనియా నుంచి ఈ విమానం చేరుకుంది. 

► ఉక్రెయిన్‌ సంక్షోభ నేపథ్యంలో 723 మిలియన్‌ డాలర్ల గ్రాంట్‌ మంజూరు చేసిన ప్రపంచ బ్యాంక్‌. 

► ఉక్రెయిన్‌ ప్రభుత్వానికి సాయం అందించేందుకు యూఎస్‌ కాంగ్రెస్‌(చట్ట సభ) సూత్రప్రాయంగా అంగీకారం. 

► సుమారు 20 వేల మందిని ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు సురక్షితంగా తరలించినట్లు భారత్‌ ప్రకటన. యూఎన్‌ అంబాసిడర్‌ టీఎస్‌ త్రిమూర్తి.. ఐరాస భద్రతా మండలిలో ప్రకటించారు. 

► ఎవరికీ భయపడను

యుద్ధం నేపథ్యంలో కీవ్‌ నుంచే తాను పని చేస్తున్నానని ప్రకటించుకున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. మనమంతా యుద్ధ క్షేత్రంలోనే ఉన్నాం. కలిసి కట్టుగా పని చేస్తున్నాం అంటూ పౌరులను ఉద్దేశించి ప్రసంగించారాయన. నేనేం దాక్కోను. ఎవరికీ భయపడను అంటూ 9 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో ఆయన పేర్కొన్నాడు.

A post shared by Володимир Зеленський (@zelenskiy_official)

► ఉక్రెయిన్‌ రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్‌లో జరిగిన యుద్ధంలో రష్యా మేజర్‌ జనరల్‌ అండ్రెయ్‌ సుఖోవెట్‌స్కీ చనిపోయినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది.

రష్యా ఆయిల్‌పై నిషేధం దిశగా ఎలాంటి ఆలోచనలు చేయలేదని అమెరికా ప్రకటన.

► రష్యా ఆయిల్‌ మీద నిషేధం విధిస్తే.. ధరలు విపరీతంగా పెరుగుతాయని మాస్కో వర్గాలు హెచ్చరిస్తున్నాయి. 

► ఉక్రెయిన్‌పై సాగిస్తున్న యుద్ధం విషయంలో రష్యా కీలక ప్రకటన చేసింది. మిలటరీ ఆపరేషన్‌ తక్షణమే నిలిపివేసేందుకు తాము సిద్ధమేనని వెల్లడించింది. అయితే, తాము విధిస్తున్న నాలుగు షరతులను ఉక్రెయిన్‌ అంగీకరిస్తేనే అది సాధ్యమవుతుందని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి సోమవారం తేల్చిచెప్పారు. తమ షరతు ల జాబితాను బయటపెట్టారు.

అవి ఏమిటంటే.. 

  • ఉక్రెయిన్‌ సైన్యం వెంటనే వెనక్కి మళ్లాలని రష్యా అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఇరువైపులా కాల్పుల విరమణ పాటిద్దామని చెప్పారు. 
  •  ఉక్రెయిన్‌ తటస్థ దేశంగానే ఉండాలని, ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర దేశాల భూభాగాల్లోకి ఉక్రెయిన్‌ ప్రవేశాన్ని నిరోధించేలా ఈ రాజ్యాంగ సవరణ ఉండాలన్నారు. 
  •   క్రిమియాను రష్యాలో ఒక భాగంగా అధికారికంగా గుర్తించాలని ఉక్రెయిన్‌కు సూచించారు. 
  •   డొనెట్‌స్క్, లుహాన్స్‌క్‌లను సైతం స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తించాలన్నారు. రష్యా విధించిన షరతులపై ఉక్రెయిన్‌ ఇంకా స్పందించలేదు.

యుద్ధం కారణంగా దాదాపు 17 లక్షల మంది ఉక్రేనీయులు శరణార్థులుగా మారినట్లు ఐరాస ప్రకటించింది. రష్యా, ఉక్రెయిన్‌ బృందాలు సోమవారం జరిపిన మూడో విడత చర్చలు ఎలాంటి తుది నిర్ణయాలు తీసుకోకుండానే ముగిశాయి. అయితే, చర్చల్లో పురోగతి కనిపించిందని ఉక్రెయిన్‌ వర్గాలు తెలపగా, రష్యా తోసిపుచ్చింది. గురువారం ఇరుదేశాల విదేశాంగ మంత్రులు టర్కీలో సమావేశం కానున్నారు. యుద్ధం కొనసాగుతుండడంతో పలు నగరాల్లో సైనికులు, పౌరులు కలిసి దిగ్బంధనాలు ఏర్పాటు చేస్తున్నారు. సైనికుల కోసం తాత్కాలిక వంటశాలలు ఏర్పాటు చేసి ఆహారం సరఫరా చేస్తున్నారు.  


► 2 లక్షల మంది ఎదురుచూపులు 
కీలక మారిపోల్‌ నగరంలో దాదాపు 2 లక్షలమంది పౌరులు దేశం విడిచిపోయేందుకు తయారుగా ఉన్నారు. వీరిని తరలించేందుకు అక్కడ రెడ్‌క్రాస్‌ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఆహారం, నీరు తదితర నిత్యావసరాల కొరత ఏర్పడింది. స్థానికులు కనిపించిన షాపులను లూటీ చేస్తున్నారు. తరలింపు కారిడార్‌ ప్రకటన వచ్చేవరకు ప్రజలంతా షెల్టర్లలోనే ఉండాలని పోలీసులు ప్రకటించారు. దక్షిణ ఉక్రెయిన్‌ సహా తీరప్రాంతంలో రష్యా బలగాలు చెప్పుకోదగ్గ పట్టుసాధించాయి. ఇతర ప్రాంతాల్లో మాత్రం రష్యాకు ముమ్మర ప్రతిఘటన ఎదురవుతోంది. మారిపోల్‌ స్వాధీనమైతే రష్యా నుంచి క్రిమియాకు భూమార్గం ఏర్పాటవుతుంది. అందుకే రష్యా సేనలు ఈ ప్రాంతంపై దృష్టి పెట్టాయి. ఇప్పటివరకు యుద్ధం కారణంగా 406  మంది పౌరులు మృతి చెందారని, నిజానికి ఈ సంఖ్య మరింత పెద్దదిగా ఉండొచ్చని ఐరాస మానవహక్కుల కార్యాలయం తెలిపింది.  

► సమ్మతం కాదు 
రష్యా ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణ తమకు ఆమోదయోగ్యం కాదని ఉక్రెయిన్‌ ఉప ప్రధాని ఇరినా వెరెషు్చక్‌ ప్రకటించారు. రష్యా ప్రకటించిన కారిడార్లలో అత్యధికం రష్యాకు, బెలారస్‌కు దారితీస్తున్నాయని, ఇది తాము అంగీకరించమని చెప్పారు. రష్యా సూచించిన ప్రణాళికను ఫ్రాన్స్‌ కూడా తిరస్కరించింది. రష్యాలో ఆశ్రయం పొందాలని ఎంతమంది ఉక్రెయిన్‌ ప్రజలు కోరుకుంటారని, ఇదంతా కేవలం కంటితుడుపు చర్యని ఫ్రాన్స్‌ వ్యాఖ్యానించింది.∙రష్యాతో చర్చలకు ఎప్పుడూ సిద్ధమేనని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ చెప్పారు. రష్యా ఆక్రమణ ఆరంభించినప్పటినుంచి ఆయన పుతిన్‌తో 4సార్లు మాట్లాడారు. సంక్షోభ నివారణకు కృషి చేస్తామని మరోమారు ఆయన వెల్లడించారు. ఫ్రాన్స్‌తో పాటు ఇజ్రాయెల్‌ సైతం మధ్యవర్తిత్వ కృషి చేస్తోంది. రష్యా ప్రతిపాదిత మార్గాల బదులు 8 మార్గాలను ఉక్రెయిన్‌ ప్రతిపాదించింది. కీవ్‌ ప్రాంతంలో రష్యాతో తీవ్రమైన పోరు సాగుతోందని ఉక్రెయిన్‌ వర్గాలు తెలిపాయి. ఇర్పిన్, మైకోలైవ్‌ ప్రాంతాలపై రష్యా విరుచుకుపడుతోందని, ఇక్కడ చాలావరకు రష్యా అధీనంలోకి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు