ప్రేయసితో ‘బాలి’లో యువతి.. చిక్కుల్లో పడేసిన ట్వీట్‌!

20 Jan, 2021 17:14 IST|Sakshi

జకార్తా: స్వలింగ సంపర్క జంటలకు ఇండోనేషియా స్వర్గధామం వంటిదంటూ చేసిన ట్వీట్‌ ఓ యువతిని కష్టాల్లోకి నెట్టింది. తన గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు దేశాన్ని వీడాల్సిందిగా స్థానిక అధికారులు ఆమెను ఆదేశించారు. వీరి వ్యవహారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. అమెరికాకు చెందిన క్రిస్టిన్‌ గ్రే అనే యువతి తన ప్రేయసి సాండ్రాతో కలిసి కొన్ని నెలల క్రితం బాలికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే నివాసం ఏర్పరచుకున్న ఈ జంట.. ఆదాయ మార్గాలను అన్వేషించింది. ఈ నేపథ్యంలో బాలిలో తమ జీవన విధానం, అక్కడ నివసించేందుకు అవుతున్న ఖర్చు, పొందుతున్న సౌకర్యాలు తదితర అంశాల గురించి అవర్‌ బాలి లైఫ్‌ ఈజ్‌ యువర్స్‌ పేరిట పుస్తకం రాశారు. గ్రాఫిక్‌ డిజైనర్‌ అయిన క్రిస్టిన్‌ ఈ ఇ-పుస్తకాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అయితే ఇందులో వారు పంచుకున్న అనుభవాలు వివాదానికి దారి తీశాయి. (చదవండి: ఇక్కడ ఒక్క రాత్రికి రూ. 58 లక్షలు)

‘‘కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో మేం వేసుకున్న ప్రణాళికలు చెల్లాచెదురైపోయాయి. అందుకే లాస్‌ ఏంజెల్స్‌లో ఉండే మేం బాలికి మకాం మర్చాం. అతి తక్కువ ధరలో ఇక్కడ విలాసవంతమైన జీవితం గడపవచ్చు. ఇక్కడి పరిసరాలు అత్యద్భుతం. ముఖ్యంగా ఎల్జీబీటీ కమ్యూనిటీ ఇక్కడ హాయిగా జీవించవచ్చు’’ అని క్రిస్టినా పేర్కొంది. అంతేగాకుండా.. కోవిడ్‌ సమయంలో అక్రమ పద్ధతుల్లో బాలికి ఎలా రావాలో తమ వీసా ఏజెంట్ల ద్వారా చెబుతామంటూ ఓ లింక్‌ను ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ విషయంపై స్పందించిన న్యాయ శాఖ అధికారులు.. క్రిస్టిన్‌, ఆమె సహచరి ఉద్దేశపూర్వకంగానే తమకు సమాచారం ఇవ్వకుండా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. బాలి సంస్కృతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదే విధంగా.. వారిని అమెరికా తిరిగి పంపివేస్తామని, ఇందుకు సంబంధించిన న్యాయ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక స్థానిక ఎల్జీబీటీ కమ్యూనిటీ సైతం క్రిస్టిన్‌ తీరును తప్పుబట్టింది. ఇండోనేషియాలో స్వలింగ సంపర్కం నేరం కానప్పటికీ, తమ పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేదని, దుష్ప్రచారాలు మానేయాలని హితవు పలుకుతున్నారు. అయితే క్రిస్టిన్‌ మాత్రం తానేమీ నేరం చేయలేదని, తాను గే అయినందు వల్లే దేశం నుంచి పంపేస్తున్నారంటూ గగ్గోలు పెట్టడం గమనార్హం.

మరిన్ని వార్తలు