ఉక్రెయిన్​ సంక్షోభంపై మారిన బైడెన్​ స్వరం! వెనక్కి వచ్చేయాలంటూ..

11 Feb, 2022 07:29 IST|Sakshi

ఉక్రెయిన్​ సరిహద్దుల వెంబడి గత కొద్దిరోజులుగా యుద్ధమేఘాలు అలుముకున్న సంగతి తెలిసిందే. ఒకవైపు రష్యా.. మరోవైపు అమెరికా,నాటో సంయుక్త దళాల పోటాపోటీ మోహరింపుతో యుద్ధవాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఉక్రెయిన్​లో ఉంటున్న ఇతర దేశ పౌరులకు హెచ్చరికలు, అప్రమత్తంగా ఉండాలనే సూచనలు జారీ అవుతున్నాయి. ఇక..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్​ సరిహద్దు పరిస్థితులపై ‘తగ్గేదేలే..’ అంటూనే ఒక్కసారిగా స్వరం మార్చారు. రష్యా దాడుల్ని సమర్థవంతంగా వెనక్కి తిప్పికొడతామని, అవసరమైతే అనుబంధ ప్రాజెక్టులను నిలిపివేస్తామని ప్రకటించిన 24 గంటలు గడవక ముందే.. వెనక్కి తగ్గారు.​ గురువారం ఉక్రెయిన్​లో ఉంటున్న అమెరికా పౌరులను వెనక్కి వచ్చేయాలంటూ పిలుపు ఇచ్చారు. ఉక్రెయిన్​ను తక్షణమే వీడాలని ఆయన ఓ ఇంటర్వ్యూలో అమెరికన్లను కోరారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాలలో ఒకటైన(రష్యాను ఉద్దేశిస్తూ..) దానితో మేం డీల్​ చేయబోతున్నాం. ఇది చాలా భిన్నమైన పరిస్థితి. ఏ క్షణమైనా పరిస్థితులు క్రేజీగా మారవచ్చు. వెంటనే వెనక్కి వచ్చేయండి’’ అంటూ ఓ ఇంటర్వ్యూలో అమెరికా పౌరులను ఉద్దేశించి బైడెన్​ వ్యాఖ్యానించారు.   

మరోవైపు భారత్​ సహా పలు దేశాలు ఉక్రెయిన్​లో ఉంటున్న తమ తమ పౌరుల కోసం జాగ్రత్తలు చెప్తున్నాయి. ముఖ్యంగా సరిహద్దులో చదువుకుంటున్న విద్యార్థులను అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాయి. పరిస్థితులను చల్లార్చేందుకు అంతర్జాతీయ సమాజం ప్రయత్నించినప్పటికీ.. అమెరికా, రష్యా బలగాలు పోటాపోటీ మోహరింపుతో యుద్ధం దిశగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు అమెరికా, నాటో దళాలపై నమ్మకం లేని ఉక్రెయిన్​.. పౌరులకు యుద్ధ శిక్షణ ద్వారా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది.

సంబంధిత వార్త: యుద్ధాన్ని మేం ఆరంభించం! అలాగని.. చూస్తూ ఊరుకోం

మరిన్ని వార్తలు