కమలా హ్యారిస్‌కు ప్రాధాన్యత తగ్గిస్తున్నారా? కారణాలు ఇవేనా?

5 Dec, 2021 07:57 IST|Sakshi

కీలకపోస్టుల నుంచి వైదొలుగుతున్న ఉపాధ్యక్షురాలి సహాయకులు

బైడెన్‌ బృందంతో హ్యారిస్‌కు పొసగడం లేదని వార్తలు

అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షరాలిగా చరిత్రకెక్కిన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌కు ‘వైట్‌హౌస్‌’లో ప్రాధాన్యత తగ్గుతోందా? బాధ్యతల నిర్వహణలో ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి ప్రముఖ మీడియా సంస్థలు. కమలా హ్యారిస్‌తో అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక బృందంలోని  సభ్యులకు పొసగడం లేదని, ఫలితంగా పాలనా వ్యవహారాల్లో ఆమె పాత్ర క్రమేపీ తగ్గుతోందని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది. కమల కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ ఆష్లే ఇటైనీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని తొలుత వార్తలు వెలువడ్డాయి.

ఉపాధ్యక్షురాలికి ముఖ్య అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న సైమోన్‌ సాండర్స్‌ ఈ ఏడాది చివర్లో పదవి నుంచి వైదొలగనున్నారు. హ్యారిస్‌ జట్టులో వీరిద్దరూ అత్యంత ముఖ్యులు. ఎన్నికల ప్రచారంలో కమలా హ్యారిస్‌ ఇమేజ్‌ను పెంచడంలో, ఆమె ప్రతిభను, నాయకత్వ పటిమను విజయవంతంగా అమెరికా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకభూమిక పోషించారు. అత్యంత ముఖ్యులు, సీనియర్లు ఇద్దరూ ఒకే సమయంలో కమలా హ్యారిస్‌కు దూరమవ్వడం... యాదృచ్చికంగా కాదని ‘సీఎన్‌ఎన్‌’ వార్తా సంస్థ అభిప్రాయపడింది. వైట్‌హౌస్‌లో అంతా సవ్యవంగా లేదని, ఏదో తేడా కొడుతోందని పేర్కొంది.  

‘ముద్ర’పడిపోతుందనే భయమా?
కమలా హ్యారిస్‌కు అత్యంత సన్నిహితురాలైన సైమోన్‌ సాండర్స్‌ వైదొలుగుతున్న విషయాన్ని ధృవీకరిస్తూ వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి జెన్‌ సాకీ ‘ఆమె ఎప్పటికీ బైడెన్‌– హ్యారిస్‌ కుటుంబం (సన్నిహిత బృందం)లో సభ్యురాలే. రెండు మూడేళ్లు ఒక పదవిలో పనిచేశాక కొత్త బాధ్యతలు సిద్ధం కావడం సహజమే. తొలి ఏడాది వైట్‌హౌస్‌లో పనిచేయడం ఉత్సాహాన్ని, సంతృప్తిని ఇస్తుంది. అదే సమయంలో కఠోరమైన శ్రమకు, తీవ్ర అలసటకు గురిచేస్తుంది’ అని అన్నారు.

‘సైమోన్‌ను నేనెంతో అభిమానిస్తాను. తదుపరి ఆమె ఏం చేస్తారనేది తెలుసుకోవడానికి ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను. బాధ్యతల నిర్వహణలో భాగంగా దాదాపు మూడేళ్లుగా విరామం ఎరుగకుండా దేశాన్ని చుట్టేసింది’ అని హ్యారిస్‌ స్పందించారు. కమలకు అత్యంత సన్నిహితులుగా శాశ్వత ముద్రపడితే... బైడెన్‌ హయాంతో పాటు భవిష్యత్తులోనూ తమకు మంచి అవకాశాలు లభించకపోవచ్చనే భయమూ ఆష్లే, సాండర్స్‌లకు ఉండి ఉండొచ్చని మరికొన్ని మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి.

పరిమిత పాత్రపై అసంతృప్తి!
జెన్‌ సాకీ వివరణ ఆమోదయోగ్యంగా లేదని... ఆష్లే, సాండర్స్‌ ఇద్దరూ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే (జవనరి 20) బాధ్యతల నుంచి తప్పుకోవడం అసాధారణమైన పరిణామమేనని సీఎన్‌ఎన్‌ పేర్కొంది. విధి నిర్వహణకు ఉపాధ్యక్షురాలు సరైన రీతిలో సన్నద్ధం కాలేదని, పైగా ఆమెకు అంతగా ప్రాధాన్యం కూడా దక్కడం లేదని కమలా హ్యారిస్‌ కార్యాలయంలో, జట్టులో పనిచేస్తున్న సన్నిహితుల్లో అసంతృప్తి పెరుగుతోంది. రాజకీయంగా చేతులు కట్టేసినట్లుగా భావిస్తున్నానని హ్యారిస్‌ సన్నిహితుల వద్ద బాధపడినట్లు సీఎన్‌ఎన్‌ తెలిపింది.

ఆమె టీంలోని దాదాపు 30 మందితో మాట్లాడాక సీఎన్‌ఎన్‌ ఈ అభిప్రాయానికి వచ్చింది. లీగల్‌ రెసిడెంట్లు, ఇతర మైనారిటీలకు ఓటు హక్కు విషయంలో గట్టిగా కృషి చేసే బాధ్యతను బైడెన్‌ జనవరిలోనే హ్యారిస్‌కు అప్పగించారు. చట్టసభల్లో ఈ అంశంలో బిల్లు పాసయ్యే అవకాశాలు బహుస్వల్పం. అలాగే మెక్సికో గుండా అక్రమ వలసలను నిరోధించి, దీనికో పరిష్కారం కనుగొనే బాధ్యతనూ ఉపాధ్యక్షురాలికి అప్పగించారు. డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో అక్రమ వలసలు, శరణార్థుల విషయంలో కఠిన వైఖరిని అవలంభించారు. అప్పుడు ఎన్నో వేల మంది పిల్లలను తల్లిదండ్రులకు అమెరికా యంత్రాంగం దూరం చేసిందనే అపవాదు ఉంది. అక్రమవలసలను అడ్డుకొనే విషయంలో బైడెన్‌కు ముందు పనిచేసిన చాలామంది అధ్యక్షులూ విఫలమయ్యారు.

ఇలాంటి కఠినతరమైన, సున్నిత అంశాలను కమలా హ్యారిస్‌కు అప్పగించారు. వయసు, ఆరోగ్యరీత్యా బైడెన్‌ (79 ఏళ్లు) రెండోసారి అధ్యక్ష పదవికి పోటీపడకపోవచ్చని, భవిష్యత్తులో డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థి కావొచ్చని, అగ్రరాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంటుందనే అంచనాల మధ్యన బాధ్యతలు చేపట్టిన కమలా హ్యారిస్‌ (57 ఏళ్లు) ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమనేది మెజారిటీ మీడియా అంటోంది.

రుణ పరిమితిని పెంచుకోవడం, మౌలిక సదుపాయాలు, పర్యావరణం, సంక్షేమ పథకాలపై భారీ ఎత్తున ఖర్చు చేయడానికి సంబంధించిన ప్రతినిధుల సభ, సెనేట్‌ల ఆమోదం పొందడానికి జో బైడన్‌ ఆహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఉపాధ్యక్షురాలితో ఏర్పడిన గ్యాప్‌ను తగ్గించుకునే ప్రయత్నాలపై సత్వరం దృష్టి సారించేంత సమయం ఇప్పుడు ఆయనకు లేదని అంటున్నారు.
– నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు