ఈ ‘బనాన గర్ల్‌’  డైటేమిటంటే....

7 Oct, 2020 16:11 IST|Sakshi

ఆమె అసలు పేరు లియాన్నె ర్యాట్‌క్లిఫ్‌. పాతికేళ్ల వయస్సులో అందరిలాగే ఆమె బొద్దుగా ఉండేది. ఇప్పుడు 40 ఏళ్ల వయస్సులో సన్నని నడుముపైన చెంచాడు కొవ్వు కూడా లేకుండా ముద్దుగా తయారయింది. అప్పుడు ఇష్టంగా మూడు పూటలు మాంసాహారం తినేది. ఇప్పుడు అంతకంటే ఇష్టంగా శాఖాహారమే తింటోంది. అది కూడా వండి వడ్డించిన ఆహారం కాకుండా పండ్లు, పచ్చి కాయగూరలనే తింటోంది. దాదాపు 14 ఏళ్లుగా ఆమె తీసుకుంటున్న డైట్‌ ఇదే! అందుకే ఆమె అప్పటికి, ఇప్పటికి 18 కిలోలు తగ్గారట.

ర్యాట్‌క్లిప్‌ ప్రతిరోజు ఉదయం అల్పాహారం కింద సగం పుచ్చకాయ తింటుంది. మధ్యాహ్నం లంచ్‌ కింద నాలుగు అరటి పండ్ల ముక్కలు, ఓ బొప్పాయి కాయ, రెండు అంజిరా పండ్లను పోలిన టర్కీ పండ్ల ముక్కలను పాలులేకుండా ఇంట్లో తయారు చేసుకున్న ఐస్‌ క్రీమ్‌తో కలిపి తింటుంది. అప్పుడప్పుడు పీనట్‌ బటర్‌తో ఈ పండ్ల ముక్కలను కలుపుకొంటుంది. ఇక రాత్రి పూట వివిధ రకాల కూరగాయ ముక్కలను కొబ్బరి చట్నీలో అద్దుకొని తింటుంది. ఆమె రోజు తినే ఆహారం మొత్తం కలసి 2,700 కాలరీలు మాత్రమే.

 

అరటి పండులా పై నుంచి కింది వరకు ఒకే తీరుగా ఉంటుందనో లేక రోజూ అరటి పండ్లు తింటుందనో సోషల్‌ మీడియాలో ఆమె ఫాలోవర్లు ఆమెను ‘బనాన గర్ల్‌’ అని పిలుస్తున్నారు. ర్యాట్‌క్లిప్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 30 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో జన్మించిన బనాన గర్ల్‌ సెప్టెంబర్‌ 19వ తేదీన తన 40వ పుట్టిన రోజు జరుపుకొని ఆ సందర్భంగా తన ఆహార అలవాట్లకు సంబంధించి తీసిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా నేటి వరకు దాదాపు 40 లక్షల మంది వీక్షించారు. 

మాంసహారిగా బతికిన తాను శాకాహారిగా ఎలా మారిందో కూడా బనాన గర్ల్‌ వివరించారు. ‘చచ్చిన జంతువులను తినడమంటే వాటిని పాతి పెట్టడమే గదా! అంటే మన కడుపును శ్మశానంగా మార్చడమే గదా! అందుకని శాకాహారిగా మారాను. మాంసాహారంలో లభించే ప్రోటీన్లు శాకాహారంలో కూడా ఉంటాయని ఆమె చెప్పారు. ‘అదంతా సరేగానీ, మీరు తీసుకుంటున్న ఆహారంలో ఎక్కువగా సుగరే ఉంటుంది. సుగర్‌ ఎక్కువగా తింటూ శరీరాన్ని ఇలా ఎండ పెట్టుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ ఆమెకు చురకలంటిస్తోన్న వారు లేకపోలేదు. 

మరిన్ని వార్తలు