Vince McMahon: WWE చైర్మన్‌ పదవి నుంచి తప్పుకున్న విన్స్‌ మెక్‌మ్యాన్‌

17 Jun, 2022 20:21 IST|Sakshi

ప్రపంచంలోనే అత్యధిక బుల్లితెర వీక్షణ ఉన్న రియాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ రెజ్లింగ్‌ షో డబ్ల్యూడబ్ల్యూఈ. ఈ షో నుంచి ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. డబ్ల్యూడబ్ల్యూఈ చైర్మన్‌, సీఈవో విన్స్‌ మెక్‌మ్యాన్‌(76) తన పదవుల నుంచి వైదొలిగారు. రాసలీలల స్కాం ఆరోపణల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

మాజీ ఉద్యోగితో ఎఫైర్‌ నడిపిన విన్స్‌.. ఆ విషయం బయటకు పొక్కుండా ఉండేందుకు సదరు ఉద్యోగిణితో 3 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.23.4 కోట్లు) మేర ఒప్పందం చేసుకున్నట్లు  ఈమధ్య ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలో కంపెనీ బోర్డు ఆయనపై విచారణకు ఆదేశించింది. ఈ దరిమిలా తన సీఈవో, చైర్మన్‌ పదవులకు స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్లు విన్స్‌ మెక్‌మ్యాన్‌ ప్రకటించారు. 

మాజీ ఉద్యోగిణితో ఎఫైర్‌ గురించి బయటకు చెప్పకుండా ఉండేందుకు ఆమెకు విన్స్‌ మెక్‌మ్యాన్‌ డబ్బు ఇచ్చాడని, ఈ మేరకు ఒప్పందం కూడా జరిగిందంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన కథనం ప్రచురించింది. అయితే ఈ వ్యవహారంపై డబ్ల్యూడబ్ల్యూఈ బోర్డు దర్యాప్తు ఏప్రిల్‌లోనే మొదలైందని, దర్యాప్తులో ఎన్నో సంచలన విషయాలు వెలుగు చూశాయని ఆ కథనం సారాంశం. మెక్‌మ్యాన్‌తోపాటు డబ్ల్యూడబ్ల్యూఈ టాలెంట్‌ రిలేషన్స్‌ హెడ్‌గా ఉన్న జాన్‌ లారినైటిస్‌ మీద కూడా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 

ఈ ఇద్దరి మీద ప్రత్యేక కమిటీ దర్యాప్తు కొనసాగిస్తోందని డబ్ల్యూడబ్ల్యూఈ ఒక ప్రకటనలో తెలిపింది. అప్పటివరకు చైర్మన్‌, సీఈవో బాధ్యతలకు దూరంగా ఉన్నప్పటికీ.. క్రియేటివ్‌ కంటెంట్‌(డబ్ల్యూడబ్ల్యూఈ స్క్రిప్ట్‌)లో మాత్రం విన్స్‌ మెక్‌మ్యాన్‌ జోక్యం ఉంటుందని డబ్ల్యూడబ్ల్యూఈ బోర్డు స్పష్టం చేసింది. మెక్‌మ్యాన్‌ వైదొలగడంతో ఆయన కూతురు స్టెఫనీ మెక్‌మ్యాన్‌కు తాత్కాలిక సీఈవో బాధ్యతలు అప్పజెప్పింది దర్యాప్తు కమిటీ. 

76 ఏళ్ల వయసున్న విన్సెంట్‌ కెనెడీ మెక్‌మ్యాన్‌.. తండ్రి అడుగు జాడల్లోనే రెజ్లింగ్‌ ఫీల్డ్‌లోనే అడుగుపెట్టాడు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ (ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అయ్యింది)లో రింగ్‌ అనౌన్సర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి.. కామెంటేటర్‌గా పని చేశాడు. ఆపై భార్య లిండాతో కలిసి సొంత కంపెనీ పెట్టి.. అటుపై డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌, డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌వర్క్‌లతో ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో రారాజుగా ఎదిగాడు.

విన్స్‌మెక్‌మ్యాన్‌ భార్య లిండా, గతంలో ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కీలక బాధత్యలు నిర్వహించారు. ఇక మెక్‌మ్యాన్‌ కొడుకు షేన్‌ మెక్‌మ్యాన్‌, కూతురు స్టెఫనీ మెక్‌మ్యాన్‌, అల్లుడు ట్రిపుల్‌ హెచ్‌(పాల్‌ మైకేల్‌ లెవెస్క్యూ) కూడా డబ్ల్యూడబ్ల్యూఈలో రెజర్లుగానే కాకుండా.. కంపెనీ బోర్డు వ్యవహారాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూడబ్ల్యూఈలో విన్స్‌ మెక్‌మ్యాన్‌పై ఈ తరహా ఆరోపణలు గతంలోనూ వచ్చినా.. ఇప్పుడు వృత్తిపరమైన నియమావళికి సంబంధించినవి కావడంతో విన్స్‌ మెక్‌మ్యాన్‌ తప్పనిసరిగా వైదొలగాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు