Ukraine War: ఏం ప్లాన్‌ చేశావయ్యా పుతిన్‌.. జెలెన్‌ స్కీని చంపడమే టార్గెట్‌

29 Mar, 2022 07:12 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ పౌరులను టార్గెట్‌ చేస్తూ మిస్సైల్‌ అటాక్స్‌ చేస్తోంది. రష్యా బలగాల దాడుల్లో ఇప్పటికే వేల సంఖ్యలో పౌరులు, సైనికులు మృతి చెందినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. కాగా, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌ స్కీని అంతమొందించేందుకు రష్యా పన్నాగాలు పన్నుతోంది.

ఓ వైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు జెలెన్‌ స్కీని చంపేందుకు రష్యా సైన్యం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి జెలెన్‌ స్కీపై హత్యాయత్నం విఫలమైందని కీవ్ ​పోస్ట్ ట్విట్టర్​లో పేర్కొంది.
అయితే, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీపై రష్యా హత్యాయత్నంలో భాగంగా.. రష్యన్ ప్రత్యేక సేనల నేతృత్వంలోని 25 మంది సైనిక బృందం స్లోవేకియా-హంగేరి సరిహద్దు సమీపంలో పట్టుబడినట్టు కీవ్‌ పోస్టు పేర్కొంది.

ఇదిలా ఉండగా.. రష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్‌ అధ్యక్షుడిపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగినట్లు ఇప్పటికే పలు వార్తా సంస్థలు కథనాల్లో తెలిపాయి. వారం రోజుల్లోనే మూడుసార్లు జెలెన్‌ స్కీని రష్యన్‌ బలగాలు టార్గెట్‌ చేశాయి. కానీ, ఆయన హత్యాయత్నం నుంచి తప్పించుకున్నట్లు 'ది టైమ్స్‌' వార్తా సంస్థ కొద్దిరోజుల క్రితం వెల్లడించింది. మరోవైపు.. పుతిన్‌ టార్గెట్‌ తనేనని సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి జెలెన్‌స్కీ చెబుతూనే ఉన్నారు. తన కోసం, తన కుటుంబం కోసం రష్యా ప్రత్యేక దళాలు వెతుకుతున్నాయని పలుమార్లు ఆరోపించారు.

మరిన్ని వార్తలు