ఉక్రెయిన్‌పై రష్యా దాడి: ప్రపంచదేశాలు ఏమంటున్నాయంటే..?

25 Feb, 2022 10:31 IST|Sakshi

రష్యాపై కఠిన ఆంక్షలకు ప్రయత్నాలు

బ్రస్సెల్స్‌: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. మరింత తీవ్రమైన ఆంక్షలతో రష్యాను దారికి తీసుకువస్తామని ప్రతినబూనాయి. ఉక్రెయిన్‌ను సైనికపరంగా రక్షించలేని పరిస్థితుల్లో యూరప్‌లో యుద్ధమేఘాలు కమ్ముకోకుండా చూడటమే వారి ఉద్దేశంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. నాటో ఇప్పటికే రష్యా వైపు తన పశ్చిమ విభాగం సైనికదళాలను సిద్ధం చేసింది. 

తన వ్యవహారంలో ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే చరిత్రలో ఎన్నడూ చూడని పరిస్థితులను చవిచూస్తారంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేసిన హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం నాటో నేతల వర్చువల్‌ సమావేశం జరగనుంది. 

యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ), నాటో సభ్యదేశం లిథువేనియా దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రష్యాలోని కలినిన్‌గ్రాడ్‌కు, రష్యా మిత్రదేశం బెలారస్‌కు అతి సమీపంలో ఈదేశం ఉంది. 

నాటో దేశాలు తమకున్న 100 జెట్‌ విమానాలు, 120 యుద్ధ నౌకలను యుద్ధసన్నద్ధం చేశాయి. నాటో సభ్య దేశాలపై ఎలాంటి దాడి జరిగినా, అంగుళం భూమిని ఆక్రమించినా కాపాడుకుని తీరుతామని నాటో చీఫ్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌ నాటో సభ్యదేశం కాదు. 

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ఒక స్వతంత్ర దేశంపై రాక్షసత్వంగా యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా పేర్కొన్నారు. రష్యా చర్యలతో యూరప్‌ మాత్రమే కాదు, ప్రపంచదేశాల భద్రతకు ముప్పువాటిల్లిందన్నారు. ఈ పరిస్థితుల్లో ఈయూ దేశాలు బ్రస్సెల్స్‌లో అత్యవసర భేటీ అయి, రష్యాలోని కీలక రంగాలపై కఠిన ఆంక్షల ప్రతిపాదనలపై చర్చించనున్నాయి.  

యుద్ధ జ్వాలలు యూరప్‌లో వ్యాపించడం ఎవరికీ ఇష్టం లేకపోవడంతో ఏ దేశం కూడా ఉక్రెయిన్‌కు సైన్యాన్ని పంపి ఆదుకుంటామని హామీ ఇవ్వకపోవడం గమనార్హం. ఉక్రెయిన్‌కు సాయంగా ఇప్పట్లో తమ సైన్యాన్ని పంపిస్తామంటూ అమెరికా సహా పశ్చిమదేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.

‘ఆర్థికంగా, దౌత్యపరంగా, రాజకీయంగా కఠిన ఆంక్షలు విధించి రష్యాను మా దారికి తెచ్చు కుంటాం. చివరికి పుతిన్‌ విఫలం కాకతప్పదు’ అని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హెచ్చ రించారు. ప్రస్తుత పరిణామాలను అంచనా వేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ జాతీయ భద్రతా మండలిని సమావేశపరిచారు.

చదవండి: (గ్యాసో లక్ష్మణా!.. యుద్ధంతో యూరప్‌ ఉక్కిరిబిక్కిరి)

చైనా ఏం చేసింది?
చైనా మినహా దాదాపు అన్ని దేశాలు కూడా రష్యా చర్యను ఖండించాయి. రష్యాపై చర్యల విషయంలో అగ్రదేశాల మధ్య ఏకాభిప్రాయం కొరవడింది. రష్యా దురాక్రమణను చైనా ఖండించకపోగా అమెరికా, దాని మిత్ర దేశాలే ఈ పరిస్థితులకు కారణమంటూ నిందించింది. ప్రపంచంలోనే అతిపెద్ద గోధుమల ఎగుమతిదారైన రష్యాపై పశ్చిమదేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీనికి విరుగుడుగా, ఆ దేశం నుంచి గోధుమలను దిగుమతి చేసుకుంటామంటూ చైనా ప్రకటించింది. ఫలితంగా, ఆంక్షల ప్రభావం చాలా వరకు తగ్గి, రష్యాకు ఆర్థిక వెసులుబాటు లభించనుంది.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: (30 ఏళ్ల వివాదం: ఉప్పునిప్పుగా ఉక్రెయిన్‌–రష్యా బంధం)

మరిన్ని వార్తలు