ఆగ్రహం పట్టలేక.. రూ.25 కోట్ల కారు నాశనం

24 Nov, 2020 14:34 IST|Sakshi

వాషింగ్టన్‌/డల్లాస్‌: ‘పేద వాడి కోపం పెదవికి చేటు’ అని ఓ సామెత. అంటే పేదవారు కొప్పడితే వారికే నష్టం అని అర్థం. సాధారణంగా మనకు కోపం వచ్చింది అనుకోండి... ఏం చేస్తాం ఎవరో ఒకరి మీద పడి గట్టిగా అరవడం లాంటివి చేస్తాం. కొద్ది మంది మాత్రమే చేతికి దొరికిన దాన్ని విసిరేసి కోపాన్ని చల్లార్చుకుంటారు. ఆ తర్వాత పగిలిపోయిన, విరిగిపోయిన వస్తువుల ఖరీదు తలచుకుని బాధపడతారు. ఇది సాధారణంగా కనిపించే పరిస్థితి. అదే ధనవంతుల ఇళ్లలో అయితే ఏం చేస్తారు.. ఇదిగో ఈ కుర్రాడిలాగా కోట్ల రూపాయల విలువ చేసే వస్తువులను నాశనం చేస్తారు. వారి కోపం విలువ.. కొన్ని వందల కుటుంబాల ఆర్థిక సమస్యలని తీర్చుతుంది. అమెరికాకు చెందిన ఓ యూట్యూబర్‌ ఆగ్రహంతో 25 కోట్ల రూపాయలు విలువ చేసే కారును తీసుకెళ్లి చెట్టుకు గుద్ది బీభత్సం సృష్టించాడు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆ వివరాలు వెల్లడించాడు.

గేజ్‌ గిలియన్‌ అనే యువకుడు యూట్యూబర్‌గా పని చేస్తున్నాడు. జీజీ ఎక్సోటిక్స్‌ అనే చానెల్‌ రన్‌ చేస్తున్నాడు. గేజ్‌ తండ్రి టిమ్‌ గిలియన్‌ ఓ బిలియనీర్‌. డల్లాస్‌లో అతడికి ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ‘క్రాస్ ఈక్విటీస్’ అనే కంపెనీ ఉంది. అతడి మిలియన్లు ఖరీదు చేసే హై ఎండ్‌ కార్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఓ రోజు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన గేజ్‌, తోటి యూట్యూబర్‌, స్నేహితుడు జాక్‌ వాకర్‌తో కలిసి డ్రైవర్‌ దగ్గర నుంచి కారు తీసుకుని బయటకు వెళ్లాడు. అప్పటికే కోపంతో కంట్రోల్‌ కోల్పోయిన గేజ్‌ కారును తీసుకుని వెళ్లి ఓ చెట్టుకు గుద్దాడు. ఇక యాక్సిడెంట్‌కు గురయింది మామూలు కారు కాదు. 3.4మిలియన్‌ డాలర్లు(25.16 కోట్ల రూపాయలు) విలువ చేసే పగని హుయెరా రోడ్‌స్టర్. పర్పుల్‌ కలర్‌లో ఉంది. ఈ ప్రమాదంలో అది కాస్త నుజ్జు నుజ్జయ్యింది. (వైరల్‌ వీడియో: అసలు నిజం ఇదే..)

ఇక ప్రమాదం గురించి గేజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేశాడు. దానిలో అతడు మాట్లాడుతూ.. ‘ఆగ్రహంతో నియంత్రణ కోల్పోయాను. దాంతో ప్రమాదం జరిగింది. తొలుత కారు రోడ్డును గుద్దుకుని.. గాలిలోకి లేచి భూమిని తాకింది. ఈ క్రమంలో చెట్టుకు గుద్దుకుంది. ఆ సమయంలో తలుపులు ఎగిరిపోయాయి. నిజం చెప్పాలంటే నా జీవితంలో అత్యంత భయంకరమైన సంఘటన ఇదే’ అని చెప్పుకొచ్చాడు. ఇక కుడి చేతికి కట్టుకట్టి ఉన్న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు గేజ్‌. ‘ఇది జరిగింది. నాకు మరో అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు. ఈ ప్రమాదంలో మేము తీవ్రంగా గాయపడి ఉండవచ్చు.. లేదా చనిపోయి ఉండవచ్చు. అయితే అదృష్టం కొద్ది అలాంటిది ఏం జరగలేదు. కారును రీప్లేస్‌ చేయవచ్చు.. కానీ నన్ను రీప్లేస్‌ చేయడం అసంభవం కదా’ అంటూ  ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఇక ప్రమాదం గురించి తెలిసి తన తండ్రి చాలా అప్‌సెట్‌ అయ్యాడని.. కాకపోతే తాను బతికి బయటపడ్డందుకు చాలా సంతోషించాడని.. దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడన్నాడు. నాన్నను అసలు చూస్తాననుకోలేదు అన్నాడు గేజ్‌. ఇక ప్రమాదానికి సంబంధించి ఫోటోలు ప్రస్తుతు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కారుని ఈ ఏడాది జూన్‌లోనే తీసుకున్నట్లు పగాని కంపెనీ తెలిపింది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా