సామాన్యుడికి ‘నగదు’ కష్టాలు!

21 Oct, 2023 13:53 IST|Sakshi
కామారెడ్డిలో ప్రధాన రహదారిపై బ్యాంకుల వద్ద తనిఖీ చేస్తున్న పోలీసులు

సాక్షి, కామారెడ్డి: కూతురు పెళ్లి కోసం బంగారం కొనడానికి వెళ్లాలంటే నాన్నకు భయం.. పండుగ పూట కుటుంబం అంతా షాపింగ్‌కు వెళ్లాలంటే జంకు.. దసరా సీజన్‌లో వచ్చిన డబ్బులను ఇంటికి తీసుకెళ్లడానికి ఆలోచిస్తున్న ఓ వ్యాపారి.. వెంట తీసుకెళ్లిన డబ్బులను ఎన్నికల తనిఖీల్లో భాగంగా పోలీసులు పట్టుకుంటారని ఇలా సామన్యులు భయపడుతున్నారు. ఎన్నికల్లో నగదు పంపిణీని కట్టడి చేయడానికి ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నిర్వహించే వాహనాల తనిఖీలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.

కొన్ని చోట్ల తనిఖీ బృందాలు అతిగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారం కొనుగోలు చేయడానికి, షాపింగ్‌ కోసం డబ్బులు తీసుకుని వెళ్లడానికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వ్యాపారులు కూడా షాపు కట్టేసిన తరువాత డబ్బులను ఇంటికి తీసుకు వెళుతుంటారు. వెళ్లేటపుడు పోలీసులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకుంటుండడంతో ఆందోళన చెందుతున్నారు.

కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్‌ నుంచి నిజాంసాగర్‌ చౌరస్తా వరకు ఐదారు బ్యాంకులు ఉన్నాయి. డబ్బులు బ్యాంకుల్లో జమ చేయడానికి వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో బ్యాంకుల ఎదుటే తనిఖీలు చేపడుతుండడంతో డబ్బులను జమ చేయడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లిళ్ల సీజన్‌తో..
శుభముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లు, ఫంక్షన్లు నిశ్చయం చేసుకున్న వారు అవసరమైన ఆభరణాలు చేయించడానికి బంగారం కొనుగోలు కోసం వెళ్లేందుకు వెంట డబ్బులు తీసుకెళ్లడం ఇబ్బందికరంగా మారింది. తులం బంగారం కొనాలంటే రూ.62 వేలు అవసరం. పెళ్లిళ్లలో తక్కువలో తక్కువ ఐదు తులాల నుంచి ఇరవై తులాల వరకు బంగారం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రూ.లక్షలు వెంట తీసుకువెళితే పోలీసులు ఎక్కడ ఆపి ఇబ్బంది పెడతారోనని ఆందోళన చెందుతున్నారు. పెళ్లి దుస్తులు కొనడానికి కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది.

అంత డబ్బు వెంట తీసుకు వెళితే తనిఖీలతో ఇబ్బంది పెడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. నవంబర్‌లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ముందుగా బంగారం, దుస్తులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఫంక్షన్‌ హాళ్లకు అడ్వాన్సులు చెల్లించాల్సిన పరిస్థితుల్లో రూ.50వేల కన్నా ఎక్కువ తీసుకువెళితే ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.

వ్యాపారుల అవస్థలు
తమ వ్యాపారాలకు సంబంధించి దుకా ణంలో జమ అయిన డబ్బులను చాలా మంది రాత్రి పూట ఇంటికి తీసుకెళ్తారు. కామారెడ్డి పట్టణంలో మెడికల్‌ ఏజెన్సీలు, సూపర్‌ మా ర్కెట్లు, బంగారం, బట్టల దుకాణాలు... ఇలా వ్యాపారులంతా రాత్రి షాప్‌ క్లోజ్‌ చేసి అప్పటి వరకు జమ అయిన డబ్బులను వెంట తీసుకు వెళ్తారు. భారీ మొత్తంలో డబ్బులు ఉన్నపుడు పోలీసులు ఆపితే లెక్క చూపని సందర్భంలో స్వాధీనం చేసుకుంటారని వ్యాపారులు ఆందో ళన చెందుతున్నారు. రాజకీయ పార్టీల వాళ్లు డబ్బులు అక్రమంగా తరలిస్తే పట్టుకోవాలని, వ్యాపారాలు చేసుకునే వారిని ఇబ్బంది పెట్టడం సరికాదని వారు అంటున్నారు.

మరిన్ని వార్తలు