బోధన్‌లో గెలుపెవరిది..? | Sakshi
Sakshi News home page

బోధన్‌లో గెలుపెవరిది..?

Published Tue, Nov 14 2023 1:04 AM

- - Sakshi

బోధన్‌: జిల్లాలోని బోధన్‌ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో నువ్వా–నేనా అనే విధంగా ప్రచారంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ ఆమేర్‌, కాంగ్రెస్‌ నుంచి పొద్దుటూరి సుదర్శన్‌ రెడ్డి, బీజేపీ నుంచి తొలిసారిగా వడ్డి మోహన్‌రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఇందులో షకీల్‌, సుదర్శన్‌రెడ్డిలు పాత ప్రత్యర్థులే. ఇతర జాతీయ పార్టీ లు, స్వతంత్య్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ వరకు ఎంత మంది బరిలో ఉంటారనేది వేచి చూడాలి.

కాంగ్రెస్‌ పార్టీదే ఆదిపత్యం

నియోజక వర్గం ఏర్పడిన 1952 నుంచి 1983 వరకు కాంగ్రెస్‌ పార్టీదే ఆదిపత్యం కొనసాగింది. ఈ మధ్య ఎన్నికల్లో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు శ్రీనివాస్‌రావు, రాంగోపాలరెడ్డి, ఆర్‌.భూంరావు, కేవీ రెడ్డి (ఏకగ్రీవం) ఎన్నికల బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

1982–83లో స్వర్గీయ ఎన్టీఆర్‌ నేతృత్వంలో టీడీపీ ఆవిర్భావనంతరం నియోజకవర్గ రాజకీయాల్లో మార్పు చోటు చేసుకుంది. 1983, 1985, 1989, 1994, 1999 వరకు ఐదు సార్లు నిర్వహించిన ఎన్నికల్లో నాలుగు సార్లు టీడీపీ అభ్యర్థులు సాంబశివరావు చౌదరి, కొత్త రమాకాంత్‌, రెండు సార్లు బషీరుద్దీన్‌బాబుఖాన్‌ వరుసగా ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి రమాకాంత్‌పై గెలిచారు. 1994 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పోటీ జరిగింది. బీజేపీ అభ్యర్థి న్యాయవాది నర్సింహారెడ్డి ద్వితీయ స్థానంలో ఉండగా, కాంగ్రెస్‌ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.

2004 ఎన్నికల్లో

2004 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ అభ్యర్థులు సుదర్శన్‌ రెడ్డి, అబ్దుల్‌ ఖాదర్‌తో పాటు జనతా పార్టీ తరఫున కెప్టెన్‌ కరుణాకర్‌రెడ్డి బరిలో నిలువడంతో పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో సుదర్శన్‌ రెడ్డి గెలిచారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి సుదర్శన్‌ రెడ్డి, మహాకూటమి (బీఆర్‌ఎస్‌, టీడీపీ) అభ్యర్థి షకీల్‌తో పాటు ప్రజారాజ్యం పార్టీ తరఫున కెప్టెన్‌ కరుణాకర్‌రెడ్డి బరిలో నిలువడంతో త్రిముఖ పోటీ నెలకొంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, టీడీపీల అభ్యర్థులు సుదర్శన్‌ రెడ్డి, షకీల్‌, మేడపాటి ప్రకాశ్‌రెడ్డిల మధ్య పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో సుదర్శన్‌రెడ్డిపై ఆధిక్యత సాధించి షకీల్‌ గెలిచారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి షకీల్‌ గెలుపొందారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి

పాత ప్రత్యర్థులే..

తొలిసారిగా బీజేపీ నుంచి మోహన్‌రెడ్డి

Advertisement
Advertisement