నానుతున్న గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం! | Sakshi
Sakshi News home page

నానుతున్న గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం!

Published Tue, Nov 14 2023 1:02 AM

- - Sakshi

ఎన్నికల బరిలో ఆరుగురు గల్ఫ్‌ జేఏసీ నాయకులు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: స్థానికంగా ఉపాధి అవకాశాలు కరువవడంతో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల నుంచి చాలామంది గల్ఫ్‌ దేశాలకు వలస వెళుతున్నారు. ఇలా వలస వెళ్లిన కార్మికులు తమ కుటుంబాల సంక్షేమం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలస కార్మికుల కోసం ప్రవాసీ విధానం(ఎన్‌ఆర్‌ఐ పాలసీ) అమలు లేదా గల్ఫ్‌ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చే స్తున్నారు. గల్ఫ్‌ జేఏసీ ఆధ్వర్యంలో వలస కార్మికు ల కుటుంబాల ఓట్ల ప్రభావం పార్టీలకు తెలిసేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. జేఏసీ నాయకులు గల్ఫ్‌ దేశాల్లో పర్యటిస్తూ వలస కార్మికులతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రతి వలస కార్మికుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి రాజకీయ పార్టీలకు చెమటలు పట్టించేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఈ ఎన్నికల ద్వారా అమీతుమీ తేల్చుకునేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్‌లోని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), సౌదీ అరేబియా, ఖతర్‌, ఒమన్‌, బహ్రెయిన్‌, కువైట్‌ దేశాలకు వలస వెళ్లారు. గల్ఫ్‌ వలస కార్మికులు ఏటా రూ.కోట్లాది విదేశీ మారక నిల్వలను ఇక్కడికి పంపుతున్నారు. వలస కార్మికుల్లో 5 శాతం మాత్రమే మంచి హోదాల్లో ఉన్నారు. మిగిలిన 95 శాతం మంది కూలీలే. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో తమ వాదన వినిపించే లక్ష్యంతో జేఏసీ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపారు.

గల్ఫ్‌ వలస కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగించడానికి గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి ఆరుగురు ఎన్నికల బరిలో నిలిచారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరపున జేఏసీ కీలక నాయకుడు చెన్నమనేని శ్రీనివాస్‌ రావు( కోరుట్ల ), జేఏసీ చైర్మన్‌ గుగ్గిల్ల రవిగౌడ్‌ (వేములవాడ), ప్రవాసిమిత్ర కార్మిక సంఘం అధ్యక్షుడు స్వదేశ్‌ పరికిపండ్ల (నిర్మల్‌), గల్ఫ్‌ జేఏసీ కార్యదర్శి బూత్కూరి కాంత(ధర్మపురి), బూస రాకేష్‌ యాదవ్‌ (ఆర్మూర్‌), జేఏసీ నాయకుడు కృష్ణ దొనికెన ( సిరిసిల్ల ) నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక బతుకు దెరువు కోసం గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్తే.. తమ కుటుంబాల సంక్షేమం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రవాసీ విధానం, గల్ఫ్‌ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.తమ వాదన వినిపించే ఉద్దేశంతో పలువురు ఎన్నికల బరిలో నిలిచారు.

తెలంగాణ ఏర్పడితే బొగ్గుబాయి,

బొంబాయి, గల్ఫ్‌ వలసలుండవని ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ప్రకటన

ప్రత్యేక రాష్ట్రంలో మరింత పెరిగిన

గల్ఫ్‌ వలసలు

తమ కుటుంబాల సంక్షేమం

ఏమైందంటున్న గల్ఫ్‌ కార్మికులు

1/1

Advertisement
Advertisement