Divorce Rate In Karimnagar: కరీంనగర్‌ సిటీలో పెరుగుతున్న విడాకులు

21 Sep, 2023 09:21 IST|Sakshi

‘కరీంనగర్‌ సిటీకి చెందిన ఓ జంటకు ఇటీవల వివాహం జరిగింది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. బెంగళూర్‌లో జాబ్‌ చేస్తున్నారు. మూడు నెలలపాటు వీరి కాపురం సాఫీగా సాగింది. కొద్దిరోజులకు ఒక చిన్న విషయంలో గొడవ జరిగింది. మాటామాటా పెరిగింది. భర్త ‘వెళ్లిపో’ అనడంతో బ్యాగు సర్దుకుని కరీంనగర్‌ వచ్చేసింది. తనకు భర్త వద్దని పుట్టింటివాళ్లతో కలిసి ఠాణామెట్లు ఎక్కింది. పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా వినకపోగా.. విడాకులకు పట్టుపట్టింది.’ ‘సిటీకి చెందిన ఓ జంటకు పెళ్లయిన రెండునెలలకే ఆర్థికపరంగా గొడవలు ప్రారంభం అయ్యాయి. ఇందుకు ఆధిపత్య పోరు తోడైంది. మనస్పర్థలు పెంచుకుని పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. తాము కలిసి ఉండమని పోలీసులకు చెప్పేశారు. కౌన్సెలింగ్‌ చేసినా వినకపోవడంతో చట్టప్రకారం కోర్టును ఆశ్రయించాలని సూచించారు.’

కరీంనగర్‌క్రైం: నిండు నూరేళ్లు అన్యోన్యంగా కలిసి జీవించాల్సిన కొన్నిజంటలు చిన్నచిన్న కారణాలతో మూడుముళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారు. కలిసి బతికేందుకు ససేమిరా అంటున్నారు. టెక్నాలజీ అత్యంత వేగంగా పెరుగుతుండటంతో ఉద్యోగాల పేరిట దూరదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అహం.. అపార్థం, అనుమానాలు.. ఒకరిపై ఒకరికి అపనమ్మకాలతో విభేదాలు వస్తున్నాయి. నాలుగు గోడల మధ్య సర్దుకుపోవాల్సిన బంధాలు చాలావరకు రోడ్డున పడుతున్నాయి. చిన్న సమస్య కూడా చివరికి పెద్ద గాలివానలా మారుతోంది. దంపతుల మధ్య అగాధం పెరిగి చివరికి విడిపోయేందుకు సిద్ధమై పోలీసుస్టేషన్‌ మెట్లు ఎక్కుతున్నారు.

పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే కాదు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి పరిస్థితి కూడా మూన్నాళ్ల్ల ముచ్చటగా తయారవుతోంది. దంపతుల మధ్య విభేదాలు వారి పిల్లలపై కూడా ప్రభావం చూపుతోంది. భార్యాభర్తల మధ్య విబేధాలు వచ్చినప్పుడు వారివారి తల్లిదండ్రులు రెండు వైపులా నచ్చచెప్పి సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంది. అలా కాకుండా ఎక్కువ శాతం తల్లిదండ్రులు తమ పిల్ల లనే రెచ్చగొడుతుండడంతో అనేక మంది తమ సంసారాన్ని చేజేతులా నాశనం చేసుకుని విడిపోతున్నారు. కేవలం కరీంనగర్‌ సిటీ పరిధిలోనే ఈ ఏడాదిలో పోలీసులకు 779 ఫిర్యాదులు, సఖీ సెంటర్‌లో 323 కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ప్రేమ వివాహాల పరిస్థితీ అంతే
ఏళ్ల తరబడి ప్రేమించుకోవడం, తరువాత పెద్దలు ఒప్పుకోలేదంటూ కొందరు పారిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత తగినంత సంపాదన లేకపోవడం, రాజీపడి జీవించలేకపోవడంతో దంపతుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.

మైనర్లు సైతం
కొంతమంది తల్లిదండ్రుల మధ్య తలెత్తుతున్న మనస్పర్థాలతో పిల్లల విషయంలో పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో మైనర్లు సైతం ప్రేమ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తెలిసీ తెలియని వయసులో చేస్తున్న తప్పుల కారణంగా కొంతమంది తల్లిదండ్రులు విడిపోతుంటే.. మరికొందరు పిల్లలను వదులుకోలేక వారిని ఒక్కటి చేసేందుకు సరైన వయసు లేక ఆ కుటుంబం మానసిక వేదనకు గురవుతూ ‘నీకారణంగానే చెడిపోయారు’ అంటూ తల్లీతండ్రీ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కుటుంబ బంధాలు బీటలు వారేలా చేసుకుంటున్నారు.

తొందరపాటు నిర్ణయాలు వద్దు
దంపతుల మధ్య గొడవలు వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులు సర్దిచెప్పాలి. పోలీసుల వద్దకు వచ్చినా కౌన్సెలింగ్‌ ఇచ్చి కలుపుతాము. ఆవేశపడి చక్కటి దాంపత్య జీవితాలు నాశనం చేసుకోకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.  
– జి.నరేందర్, కరీంనగర్‌ టౌన్‌ ఏసీపీ

కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం
దంపతుల మధ్య గొడవతో చాలా కేసులు వస్తున్నాయి. కౌన్సెలింగ్‌ ఇచ్చి కలిసి ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో దంపతుల బంధాన్ని చిన్నచిన్న కారణాలతో తెంచుకోవడం బాధాకరం. వారికి దాంపత్య విలువను తెలియజేస్తున్నాం.                        
– దామోర లక్ష్మి, సఖి కో ఆరి్డనేటర్‌

కల్చర్‌ మారుతోంది
మేం పరిశీలించిన కొన్నికేసుల్లో దాంపత్యబంధానికి కనీస విలువలేకుండా పోతోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే ప్రయత్నంలో కాపురాలు కూల్చేసుకుంటున్నారు. దాంపత్య బంధం నిలవాలంటే సర్దుకుపోవాలి.
– బి.రఘునందన్‌రావు, కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు