బీఆర్‌ఎస్‌ చేసిందేమిటి.. | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ చేసిందేమిటి..

Published Fri, Nov 17 2023 1:24 AM

మొగ్దుంపూర్‌లో ప్రచారం చేస్తున్న బండి సంజయ్‌ - Sakshi

కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్రంతో మాట్లాడి స్మార్ట్‌ సిటీ కింద నిధులు తీసుకొస్తే ఎవడబ్బ సొమ్మని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దారి మళ్లించిందని బీజేపీ కరీంనగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ ప్రశ్నించారు. కేంద్ర నిధులతో జరిగే అభివృద్ధి పనులకు కరీంనగర్‌లో కొబ్బరికాయలు కొట్టడం తప్ప గంగుల కమలాకర్‌ సాధించిందేమిటని నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 9, 33 డివిజన్లలో ప్రచారం నిర్వహించి కోతిరాంపూర్‌ చౌరస్తాలో మాట్లాడారు. నేను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయాను.. ఎంపీగా గెలిపించారు.. మీకోసం కేంద్రం నుంచి పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చిన.. అంతేగాకుండా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన.. ఏరోజు ఇంట్లో పడుకోలేదు.. కరీంనగర్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రంతో మాట్లాడి రూ.194 కోట్ల నిధులు నేను తీసుకొస్తే.. వాటిని ఖర్చు పెట్టకుండా దారి మళ్లించారు.. మేం నిధులిస్తే ఎవడబ్బ సొమ్మనుకుని దారి మళ్లించారో చెప్పాలని ప్రశ్నించారు. వీళ్లు కొబ్బరికాయలు కొట్టడానికి తప్ప దేనికి పనికిరారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మాదిరిగా నాపై భూకబ్జా కేసుల్లేవు.. లంగ దందా కేసుల్లేవ్‌.. అవినీతి కేసుల్లేవ్‌.. ఎంపీగా గెలిపించాక 24 గంటలు మీకోసమే పని చేసిన.. భారతదేశంలో ఏ ఎంపీపైనా ప్రజా సమస్యలపై పోరాడితే 74 కేసులు పెట్టిన దాఖలాల్లేవన్నారు. కోతిరాంపూర్‌ ప్రజలు డంపింగ్‌ యార్డుతో అల్లాడుతున్నరు.. మంత్రిగా ఉన్న గంగుల ఎందుకు తరలించలేదు? ప్రజలు చస్తున్నా పట్టించుకోని వ్యక్తికి ఓటెలా వేస్తారు? దయచేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చకండి.. ప్రతి ఒక్కరూ పువ్వు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇంటింటా ప్రచారం

కరీంనగర్‌ బీజేపీ పార్లమెంట్‌ కన్వీనర్‌ బోయినపల్లి ప్రవీణ్‌రావు ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్లోని 39వ డివిజన్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి బండి సంజయ్‌కుమార్‌కు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. కరీంనగర్‌ పట్టణం 18వ డివిజన్‌ శక్తి కేంద్రం ఇన్‌చార్జి జాడి బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్లోని కాళోజినగర్‌, గ్రీన్‌ హోమ్స్‌, అక్షయ హోమ్స్‌ కాలనీ తెలుగువాడ, ద్వారకనగర్‌, జగిత్యాల మెయిన్‌ రోడ్డు, గౌడ్స్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కరపత్రాలను పంపిణీ చేశారు. బాస సత్యనారాయణరావు, చంద్రకళ, విక్రమ్‌రాజు, వివేక్‌, ప్రతాపరెడ్డి, ప్రసాదరావు, విష్ణు పాల్గొన్నారు. 59వ డివిజన్‌లో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు శక్తి కేంద్రం అధ్యక్షుడు శ్రీనివాస్‌, బీజేపీ పశ్చిమ జోన్‌ అధ్యక్షుడు నరహరి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పేదల కోసం కొట్లాడేవారుండరు..

కొత్తపల్లి(కరీంనగర్‌): కరీంనగర్‌ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే పేద ప్రజల కోసం కొట్లాడతానని, నేను తప్ప మరెవ్వరూ కొట్లాడేవారు ఉండరని కరీంనగర్‌ ఎంపీ, బీజెపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్‌ పంచాయతీ పరిధి లక్ష్మీపూర్‌ చౌరస్తాలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఇక్కడి ప్రజల గౌరవం పెరిగేలా కేసీఆర్‌తో కొట్లాడానన్నారు. మోడీ పేద ప్రజల కోసం ఇళ్లు మంజూరు చేస్తే కట్టివ్వని సీఎం కేసీఆర్‌.. ఆయన కోసం మన పైసలతో 100 గదుల ప్రగతిభవన్‌ను కట్టుకున్నాడని మండిపడ్డారు. అవినీతి, అహంకార పాలన పోవాలంటే కేసీఆర్‌ను గద్దె దించాలని కోరారు. రాష్ట్రంలోని 50 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన పోరాడి జైలుకు పోయానని, 317 జీవో సవరణ కోసం ఉద్యోగుల పక్షాన జైలుకు వెళ్లానని, రైతులు, మహిళలు, అన్ని వర్గాల కోసం పోరాడితే నాపై 74 కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. ఎంపీగా గెలిపించాక 24 గంటలు మీకోసమే పని చేశానని, పేద ప్రజల కోసం పోరాడే నాయకుడుండాలంటే బీజేపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఎవడబ్బ సొమ్మని స్మార్ట్‌ సిటీ

నిధులను దారి మళ్లించారు

పేదల ఇళ్లకు కేంద్రం

నిధులిస్తే ఎందుకు కట్టివ్వడం లేదు

కొబ్బరికాయలు కొట్టడం తప్పా గంగుల కమలాకర్‌ సాధించిందేం లేదు

బీజేపీ కరీంనగర్‌ అభ్యర్థి

బండి సంజయ్‌కుమార్‌

సంజయ్‌కుమార్‌కు స్వాగతం పలుకుతున్న మహిళలు
1/1

సంజయ్‌కుమార్‌కు స్వాగతం పలుకుతున్న మహిళలు

Advertisement
Advertisement