గెలవలేకే విషం చిమ్ముతున్నారు..

15 Nov, 2023 00:20 IST|Sakshi
● మంత్రి పదవి ఇచ్చిన ఎన్టీఆర్‌, కేసీఆర్‌నే తుమ్మల మోసం చేశారు ● రోడ్‌ షోలో ఖమ్మం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మంమయూరిసెంటర్‌: కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు జీవితమంతా అధర్మ పోరాటమేనని ఖమ్మం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పలు డివిజన్లలో మంగళవారం ఆయన రోడ్‌ షో నిర్వహించారు. ఈసందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ ఖమ్మం వాసులకు ఏ మాత్రం మేలు చేయని వ్యక్తి ఇప్పుడు పోటీకి వచ్చాడని, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఎవరినీ ఎదగనివ్వకపోగా మంత్రి పదవి ఇచ్చిన ఎన్టీఆర్‌, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడని తెలిపారు. ఇక ఇప్పుడు తనపై గెలిచే సత్తా లేక నామినేషన్‌ విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో రూ.వేల కోట్లు నిధులు తీసుకొచ్చి ఒకప్పుడు కనీస సదుపాయాలు లేని ఖమ్మంను ఆదర్శవంతంగా తీర్చిదిద్దానని తెలిపారు. ఈ అభివృద్ధి ఇలానే సాగాలంటే మరోమారు తనకు అవకాశం కల్పించాలని పువ్వాడ కోరారు. ఇక ఖమ్మం 25వ డివిజన్‌లో పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇంటింటికీ వెళ్లి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. మూడోసారి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం, ఇంటింటికీ బీమా, రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తామని తెలిపారు. కాగా, మామిళ్లగూడెంలో వెండి, బంగారం నగల సంఘం మాజీ అధ్యక్షుడు వెగ్గలం శ్రీనివాసరావు ఆధ్వర్యాన త్మీయ సమ్మేళనంలో పువ్వాడ అజయ్‌ మాట్లాడారు. మేయర్‌ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, నాయకులు గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, బానోతు చంద్రావతి, బుడిగం శ్రీనివాస్‌, పసుమర్తి రామోహన్‌రావు, శీలంశెట్టి రమ, జక్కుల లక్ష్మయ్య, విజయ్‌, గుమ్మడివెల్లి శ్రీను, గౌరోజు వసంత్‌, సుంకర నర్సింహారావు, నర్సింహాచార్యులు, దేశరాజు వెంకటేశ్వరరావు, సదానందాచారి, ఇనుగుర్తి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు