ఎన్నికల విధులకు 6,560మంది

15 Nov, 2023 00:20 IST|Sakshi
ఉద్యోగుల ర్యాండమైజేషన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌, ఎన్నికల పరిశీలకులు
● ఉద్యోగుల రెండో విడత ర్యాండమైజేషన్‌ పూర్తి ● పర్యవేక్షించిన పరిశీలకులు, కలెక్టర్‌ గౌతమ్‌

ఖమ్మం సహకారనగర్‌: ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో అధికారులు ఏర్పాట్లలో వేగం పెంచారు. ఇందులో భాగంగా కలెక్టరేట్‌లో మంగళవారం ఎన్నికల పరిశీలకులు తుషార్‌కాంత మహంతి, సతేంద్రసింగ్‌, కానారామ్‌ సమక్షాన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌ ఉద్యోగుల రెండో విడత ర్యాండమైజేషన్‌ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 1,456 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, 6,560 మంది ఉద్యోగులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి ఐదు మహిళా బృందాలు, యువకులు, దివ్యాంగుల కేంద్రాలకు సంబంధించి ప్రత్యేక బృందాలను గుర్తించినట్లు చెప్పారు. అక్కడ ఏర్పాటుచేసే మోడల్‌ కేంద్రాల్లో వీరు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. అనంతరం మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్‌ పూర్తిచేశారు. జిల్లాలో అవసరమైన 256 మంది మైక్రో అబ్జర్వర్లతో పాటు రిజర్వ్‌డ్‌గా కొందరిని ఎంపిక చేశారు.

మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల(సూక్ష్మ పరిశీలకులు) పాత్ర కీలకమైనదని, పోలింగ్‌ సజావుగా జరిగేలా విధులు సమర్ధవంతంగా నిర్వర్తించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు సత్యేంద్రసింగ్‌, తుషార్‌ కాంత మహంతి, కానారాం సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం మైక్రో అబ్జర్వర్లకు ఏర్పాటుచేసిన శిక్షణలో కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌తో కలిసి వారు మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరి శీలించాలని, ప్రతీఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని తెలిపారు. కాగా, మైక్రో అబ్జర్వర్లకు పనిచేసే చోట, ఓటు కలిగిన నియోజకవర్గంలో కాకుండా ఇతర చోట్ల విధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.

ప్రతీఒక్కరికి ఓటర్‌ స్లిప్‌లు

జిల్లాలోని ప్రతీఒక్కరికి ఓటర్‌ స్లిప్పు అందేలా పర్యవేక్షించాలని రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ సూచించారు. హైదరాబాద్‌ నుంచి ఆయన వెబ్‌ క్యాస్టింగ్‌ నిర్వహణ, ఓటరు స్లిప్పుల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సూచనలు చేశారు. స్థానికంగా కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగిన యువతను వెబ్‌ క్యాస్టింగ్‌ కోసం ఉపయోగించుకోవాలని, ముందస్తుగా ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాలని తెలిపారు. వివిధ పార్టీల నాయకులు, బీఎల్‌ఓలను సైతం ఓటర్‌స్లిప్పుల పంపిణీలో భాగస్వామ్యం చేయాలన్నారు. ఈసమావేశాల్లో అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌నాయక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్‌ విక్రమ్‌సింగ్‌, డీఈఓ సోమశేఖరశర్మ, జిల్లా పరిశ్రమల అధికారి అజయ్‌కుమార్‌, నోడల్‌ అధికారులు విజయనిర్మల, రాంప్రసాద్‌తో పాటు అధికారులు, ఉద్యోగులు శ్రీనివాసరెడ్డి, కె.శ్రీరామ్‌, మదన్‌గోపాల్‌, ఏ.శ్రీనివాస్‌, అరుణ, రాంబాబు, సత్యనారాయణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు