పోలీసులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి | Sakshi
Sakshi News home page

పోలీసులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి

Published Fri, Nov 17 2023 1:50 AM

పోలీసుల వాహనాలు, హెల్మెట్లను పరిశీలిస్తున్న ఎస్పీ కృష్ణకాంత్‌ 
 - Sakshi

ఎస్పీ కృష్ణకాంత్‌

కర్నూలు: వాహనాలు నడిపే పోలీసులు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని ఎస్పీ కృష్ణకాంత్‌ అన్నారు. అలాగే వాహనాలకు ఇన్సూరెన్స్‌ చేయించుకోవాలని, ధ్రువపత్రాలు కూడా దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలన్నారు. కర్నూలు శివారులోని బి.తాండ్రపాడు సమీపంలో ఉన్న కర్నూలు అర్బన్‌ తాలూకా పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. సర్కిల్‌ పరిధిలోని గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై ఆరా తీశారు. రౌడీషీటర్లు, చెడు ప్రవర్తన గల వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని సూచించారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని, క్రైం రేట్‌ను తగ్గించేందుకు బాగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ఎకై ్సజ్‌ కేసులలో సీజ్‌ చేసిన వాహనాలను త్వరగా డిస్పోజ్‌ చేయాలని సూచించారు. సీఐలు గుణశేఖర్‌ బాబు, శ్రీరాం, ఎస్‌ఐలు సమీర్‌ బాషా, రామయ్య తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు.

నేడు వ్యవసాయ సలహా మండలి సమావేశం

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం ఈ నెల 17న సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో చైర్మన్‌ బెల్లం మహేశ్వరరెడ్డి అధ్యక్షతన జరుగనుంది. సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్‌ సృజన, జేసీ నారపురెడ్డి మౌర్య, ప్రజా ప్రతినిధులు హాజరవుతారని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో జరిగిన వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో వచ్చిన సమస్యలతో పాటు తాజా పరిస్థితులను కూడా చర్చిస్తారన్నారు.

సీపీఓగా హిమ ప్రభాకరరాజు బాధ్యతల స్వీకరణ

కర్నూలు(సెంట్రల్‌): చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌(సీపీఓ)గా నియమితులైన హిమ ప్రభాకరరాజు గురువారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన సిబ్బందితో సమావేశమయ్యారు. ఈయన గుంటూరులో ఏడీగా పనిచేస్తూ పదోన్నతిపై కర్నూలు సీపీఓగా నియమితులయ్యారు. ఇక్కడ సీపీఓగా ఉన్న ఎల్‌.అప్పలకొండను ప్లానింగ్‌ రాష్ట్ర శాఖ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఆయన స్థానంలో హిమ ప్రభాకరరాజును నియమించారు.

ట్రాన్స్‌ఫార్మర్ల ఫెయిల్యూర్స్‌ తగ్గించాలి

కర్నూలు(రాజ్‌విహార్‌): ట్రాన్స్‌ఫార్మర్ల ఫెయిల్యూర్స్‌ తగ్గించాలని విద్యుత్‌ సిబ్బందికి దక్షిణ ప్రాంత పంపిణీ సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజరు గురువయ్య సూచించారు. కర్నూలులోని పవర్‌ హౌస్‌ సబ్‌స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న పురోగతి పనుల వివరాలు కర్నూలు ఎస్‌ఈ (ఆపరేషన్స్‌) ఎం. ఉమాపతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సబ్‌ స్టేషన్ల నిర్వహణపై దృష్టి సారించాలని, నెలవారి విద్యుత్‌ బిల్లుల వసూలో 100 శాతం లక్ష్యం సాధించాలన్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు పాత బకాయిలు రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు

కర్నూలు సిటీ: విధులను నిర్లక్ష్యం చేసిన ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్లు డీఈఓ రంగారెడ్డి తెలిపారు. గురువారం కర్నూలు రూరల్‌ మండల పరిధిలోని మునగాల పాడు, నిడ్జూరు గ్రామాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను తాను తనిఖీ చేసినట్లు చెప్పారు. మునగాలపాడు హైస్కూల్‌లో 9వ తరగతి విద్యార్థులు, క్లాసు టీచర్‌ ట్యాబ్‌లను వినియోగించడం లేదని గుర్తించి ఉపాధ్యాయుడికి షోకాజ్‌ నోటీసు ఇచ్చామన్నారు. నిడ్జూరు హైస్కూల్లో తెలుగు, ఇంగ్లిషు టీచర్లు విద్యార్థులకు నోట్సు ఇవ్వలేదని గుర్తించి, షోకాజ్‌ నోటీసులు జారీ చేశామన్నారు.

1/1

Advertisement
Advertisement