బేనీసా తోటలే ఎక్కువ | Sakshi
Sakshi News home page

బేనీసా తోటలే ఎక్కువ

Published Fri, Nov 17 2023 1:50 AM

- - Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): బంగినపల్లి మామిడి మధుర ఫలంగా పేరొందింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ పంటను విస్తారంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 15 వేల ఎకరాల్లో తోటలు ఉన్నాయి. ఇప్పటికే చెట్లపై పూమొగ్గలు విచ్చుకుంటున్నాయి. డిసెంబరు చివరి నాటికి 30 శాతం పూత రావాల్సి ఉంది. ఉద్యాన శాఖ అధికారులు మామిడి తోటలకు వెళ్లి ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూత నిలబడి ఎకరాకు 7 నుంచి 8 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది.

బేనీసా తోటలే ఎక్కువ

గత ఏడాది మామిడిలో దిగుబడులు అంతంతమాత్రమే వచ్చాయి. ముందుగా పూత ఆశాజనకంగా వచ్చినప్పటికీ తర్వాత చోటు చేసుకున్న వాతావరణ మార్పులు రైతులను దెబ్బతీశాయి. దిగుబడులు పడిపోయినప్పటికీ ధరలు మెరుగ్గా ఉండటం రైతులకు ఊరటనిచ్చింది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులో ఖరీఫ్‌, రబీ కలసి రాలేదు. దీంతో మామిడిపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలో బంగినపల్లి మామిడి (బేనీసా) తోటలు 80 శాతం వరకు ఉన్నాయి. హిమాం పసుందు, దీల్‌పసందు, నీలం, తోతాపురి తదితర రకాలు 20 శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో 5 వేల ఎకరాలు, నంద్యాల జిల్లాలో 10 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. ఇప్పటికే వ్యాపారులు మామిడి తోటలు కొనుగోలు చేసి పూత బాగా వచ్చేందుకు అడ్డుగోలుగా అధిక గాఢత కలిగిన మందులు పిచికారీ చేస్తున్నారు. ఇలా చేయడం తోటలకు మేలు జరగకపోగా నష్టం ఎక్కువగా జరుగుతోంది.

తేలికగా దున్నటం ఎంతో మేలు

వర్షాలు ఆగిన తర్వాత నవంబరు, డిసెంబర్‌ నెలల్లో మామిడి తోటల్లో తేలికగా దున్నాల్సిన అవసరం ఉంది. దీని వల్ల భూమిలోని తేమ ఆవిరై బెట్ట పరిస్థితులు ఏర్పడి పూత ఆలస్యం కాకుండా యథాతథంగా వచ్చే అవకాశం ఉంది. భూమిలో తేమ ఎక్కువగా ఉంటే కొత్త చిగుళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇందువల్ల పూత రావడం ఆలస్యం అవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ సమయంలో చెట్ల మొదళ్ల దగ్గర దున్నడం వల్ల మామిడిని ఆశించే పురుగుల ప్యూపాలు, తెగుళ్ల అవశేషాలు బయటపడి నశిస్తాయి.

శుభ్రత ప్రధానం

మామిడిని ఆశించి తీవ్రంగా నష్టపరిచే పురుగులు, తెగుళ్లు చాలా వరకు తోటలోని కలుపు మొక్కలు, చెత్తాచెదారంలో ఆశ్రయం పొందుతాయి. మామిడితోటల్లో కలుపు మొక్కలు, చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దీంతో పూత సమయంలో చీడపీడలను చాలా వరకు నియత్రించుకోవచ్చు. మామిడి పూత రాకుండా ఉంటే ఉదయం పూట చెట్ల కింద మంట లేకుండా పొగ పెట్టాలి. ఇలా మూడు నాలుగు రోజులు చేస్తే పూత వస్తుంది.

పోషకాలు తప్పనిసరి

ఈశాన్య రుతుపవనాలు ఆగిపోయిన తర్వాత చలి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మామిడిలో పూత రావడం ఆలస్యం అవుతుంది. తోటల్లో దున్నడం పూర్తి అయిన తర్వాత పోషకాలు పిచికారీ చేసి చెట్లలో పూమొగ్గలను ఉత్తేజ పరుచవచ్చు. ఇందుకోసం మల్టీ–కే( పొటాషియం నైట్రేటు లేదా 13–0–45)ఎరువును లీటరు నీటికి 10 గ్రాములు, యూరియా లీటరు నీటికి 5–10 గ్రాములు, అర్క మ్యాంగో స్పెషల్‌ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అర్క మ్యాంగో స్పెషల్‌ అందుబాటులో లేనపుడు ఫార్ములా–4 సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని లీటరు నీటికి 3 గ్రాములు కలపవచ్చు. ఈ మిశ్రమం మార్కెట్‌లో ఎఫ్‌–4, ఆగోమిన్‌ మ్యాక్స్‌అనే పేర్లతో లభిస్తుంది. సూక్ష్మ పోషకాలు పిచికారీ చేయడం వల్ల పూత బాగా రావడమే కాకుండా, ద్విలింగ పుష్పాలు అధికంగా వచ్చి.. ఎక్కువ పిందెలు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది.

‘తేనెమంచు’ను తరిమేద్దాం

మామిడిలో తేనెమంచు పురుగుల బెడద ఉంది. తల్లి పురుగులు, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు, పూత కాడలు, పూలు, లేత పిందెల నుంచి విపరీతంగా రసాన్ని పీలుస్తాయి. లేత ఆకులను ఆశించినప్పుడు పూత మాడిపోతుంది. పిందెలు ఏర్పడవు. పురుగులు విసర్జించిన తేనెలాంటి తియ్యని పదార్థం వల్ల ఆకులపైన, పూత కాడలపైన నల్లటి మసిపొర ఏర్పడుతుంది. దీనివల్ల ఆకుల్లో కిరణజన్య సంయోగ క్రియ జరగక కాయలు చిన్నగా ఉండి రాలిపోతాయి. నివారణకు మొదటి సారి లీటరు నీటికి 5 ఎంఎల్‌ వేపనూనె, రెండు గ్రాముల అసిపేట్‌ కలిపి పిచికారీ చేయాలి. రెండోసారి 0.4 ఎంఎల్‌ కాన్సిడార్‌, మూడు గ్రాముల బావిస్టన్‌, 5 ఎంఎల్‌ వేప నూనె కలిపి పిచికారీ చేయాలి.

మండలాల వారీగా మామిడి తోటల విస్తీర్ణం వివరాలు..

మండలం విస్తీర్ణం( ఎకరాల్లో)

డోన్‌ 3,587

ప్యాపిలి 1,856

వెల్దుర్తి 1,275

ఓర్వకల్లు 948

బేతంచెర్ల 850

ఎమ్మిగనూరు 836

కృష్ణగిరి 813

గోనెగండ్ల 526

కర్నూలు రూరల్‌ 505

రుద్రవరం 335

చాగలమర్రి 246

దేవనకొండ 183

కోడుమూరు 169

బనగానపల్లె 156

మామిడి తోటల్లో

విచ్చుకుంటున్న మొగ్గలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో

15 వేల ఎకరాల్లో తోటలు

పూత నిలబడాలంటే

జాగ్రత్తలు పాటించాల్సిందే

రైతులకు అవగాహన కల్పిస్తున్న

ఉద్యాన అధికారులు

అవగాహన అవసరం

మామిడి రెతులకు సాగు పద్ధతులపై అవగాహన ఉండాలి. ఎక్కువ మంది రైతులు మామిడిలో సేద్య పద్ధతులు పాటించకుండా పూత దశలో చీడపీడల నివారణకు మందుల పిచికారీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పెట్టుబడి వ్యయం పెరుగుతుంది. వాతావరణ పరిస్థితులననుసరించి చీడపీడల తీవ్రతను అంచనా వేయవచ్చు. పూతను చీడపీడలు ఆశించిన తర్వాత నష్ట నివారణకు ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం అంతంతమాత్రంగానే ఉంటుంది. దీనిని రైతులు దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ఆధారంగా మామిడిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

1/1

Advertisement
Advertisement