పోతిరెడ్డిపాడు నుంచికొనసాగుతున్న నీటి విడుదల | Sakshi
Sakshi News home page

పోతిరెడ్డిపాడు నుంచికొనసాగుతున్న నీటి విడుదల

Published Wed, Oct 4 2023 2:08 AM

- - Sakshi

జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేట ర్‌ ద్వారా ఎస్సారెమ్సీకి 1,000 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలో సాయంత్రానికి 856.00 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద 855.00 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి విడుదలవుతున్న నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు మళ్లించినట్లు ఏఈ దేవేంద్ర తెలిపారు. వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పూర్తిసామర్థ్యం 16.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.8 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జీఎన్‌ఎస్‌ఎస్‌ (ఎస్సార్బీసీ)కాల్వకు, కేసీ ఎస్కేప్‌ కాల్వకు నీటిసరఫరాను బంద్‌ చేసినట్లు తెలిపారు.

నేడు ‘దిశా’ సమావేశం

నంద్యాల: నంద్యాల పార్లమెంట్‌ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షతన ఈనెల 4వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ (దిశా) సమావేశం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌ లోని వైఎస్సార్‌ సెంటినరీ హాలులో జరిగే ఈ సమావేశానికి జిల్లా లోని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యు లు, దిశా కమిటీ సభ్యులు, మండల పరిషత్‌ అధ్యక్షులు హాజరు కావాలని కలెక్టర్‌ కోరారు.

సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన

సమావేశం..

కలెక్టరేట్‌లోని వైఎస్సార్‌ సెంటినరీ హాలులో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజన సమావేశం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని నంద్యాల, జూపాడుబంగ్లా, ఉయ్యాలవాడ, కోవెలకుంట్ల మండలాలకు సంబంధించిన మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, చార్జ్‌ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొనాలన్నారు. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరుగుతుందన్నారు.

వివరాల నమోదుకు30 వరకు గడువు

నంద్యాల(న్యూటౌన్‌): ఈ ఏడాది జరిగిన నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షలో ఎంపికైన విద్యార్థులు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో తమ వివరాలు నవంబర్‌ 30వ తేదీలోపు నమోదు చేసుకోవాలని డీఈఓ సుధాకర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. మెరిట్‌ కార్డుపై ముద్రించిన వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. నవంబర్‌ 2019, ఫిబ్రవరి 2021, మార్చి 2022 సంవత్సరంలో ఎంపికైన ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలలు, చదువుతున్న విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా రెన్యువల్‌ చేసుకోవాలని తెలిపారు. అలాగే డిసెంబర్‌ 30వ తేదీలోగా నోడల్‌ ఆఫీసర్‌ లాగిన్‌ ద్వారా దరఖాస్తు చేసుకొని ధ్రువీకరించాలన్నారు. ఈ తేదీల్లో ఎటువంటి పొడిగింపు ఉండదన్నారు.

ముమ్మరంగా వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ

కర్నూలు(అగ్రికల్చర్‌): వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద అక్టోబర్‌ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా జరుగుతోంది. ఈ నెల 1, 2వ తేదీలు సెలవు దినాలైనప్పటికీ గ్రామ, వార్డు వలంటీర్లు పంపిణీ చేపట్టారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి కర్నూలు జిల్లాలో 2,47,021 పింఛన్లు ఉండగా 2,36,691 మందికి(95.82 శాతం).. నంద్యాల జిల్లాలో 2,33,210 పింఛన్లు ఉండగా 2,15,266 మందికి(96.44 శాతం) నగదు అందించారు.

శనగ విత్తనాలకు

రిజిస్ట్రేషన్లు

కర్నూలు(అగ్రికల్చర్‌): రబీ సీజన్‌లో శనగ సాగు కోసం విత్తనాలకు డిమాండ్‌ ఏర్పడింది. రైతుభరోసా కేంద్రాల్లో శనగ విత్తనాల కోసం రైతులు ముమ్మరంగా రిజిస్ట్రేషన్‌లు చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో 15,593 మంది రైతులు 21,299 క్వింటాళ్ల శనగ విత్తనాల కోసం డీ–క్రిషి యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. నంద్యాల జిల్లాలో 3,537 రైతులు 4,781 క్వింటాళ్ల విత్తనాల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఏపీ సీడ్స్‌ ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 13,500 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాలో 3,460 క్వింటాళ్లు కేటాయించింది. కర్నూలు జిల్లాకు 67,094, నంద్యాల జిల్లాకు 28,747 క్వింటాళ్లు కేటాయించింది

Advertisement
Advertisement