కొల్లాపూర్‌.. ప్రగతి జోరు | Sakshi
Sakshi News home page

కొల్లాపూర్‌.. ప్రగతి జోరు

Published Tue, Nov 28 2023 2:04 AM

పాన్‌గల్‌ మండలం రాయినిపల్లి సమీపంలో వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం  - Sakshi

కొల్లాపూర్‌: ఒకప్పుడు వెనుకబాటుతనానికి కేరాఫ్‌గా చెబుకునే కొల్లాపూర్‌ నియోజకవర్గం.. ఇప్పుడు అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. తాగు, సాగు నీటి ప్రాజెక్టులకు కేంద్ర బింధువుగా మారింది. లక్షన్నర ఎకరాల మేరకు వ్యవసాయ భూములకు సాగునీరు సమృద్ధిగా అందుతోంది. మారుమూల ప్రాంతంగా పేరుపడ్డ కొల్లాపూర్‌కు 167కే జాతీయ రహదారి నిర్మాణంతో ఆ పేరు చెరిగిపోనుంది. సోమశిల సమీపంలోని కృష్ణానదిపై ఐకానిక్‌ సస్పెన్సివ్‌ బ్రిడ్జి నిర్మాణం జరిగితే కొల్లాపూర్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కనుంది. జాతీయ రహదారి, బ్రిడ్జి నిర్మాణాలు పూర్తయితే పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా మారనుంది.

కొల్లాపూర్‌ మున్సిపాలిటీలో..

కొల్లాపూర్‌కు హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరు కాగా.. తరగతులు ప్రారంభమయ్యాయి. కొత్తగా మరో పాల్‌టెక్నిక్‌ కళాశాల మంజూరైంది. మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలతో దళితవాడల అభివృద్ధి. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ నిధులతో వార్డుల్లో రహదారులు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టారు. 4వ వార్డు లో నిర్మించిన అర్బన్‌ పార్కు అందరినీ ఆకర్షిస్తోంది. మిషన్‌ భగీరధ ద్వారా 90శాతం నివాసగృహాలకు స్వచ్చమైన తాగునీరు అందుతోంది. ప్రధాన కూడళ్లలో ఆర్‌అండ్‌బీ సబ్‌డివిజన్‌ కార్యాలయం ఏర్పాటు, ఈదమ్మ గుడి, ఖాదర్‌పాషా ధర్గా అభివృద్ధి వంటి పనులు చేపట్టారు. బీసీ, ఎస్సీల శ్మశానవాటిక కోసం 3 ఎకరాల స్థలం కేటాయించారు. చుక్కాయిపల్లిలో రూ.5.25కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌ పనులు పూర్తి చేశారు.

పెంట్లవెల్లిలో..

రూ.9.65కోట్లతో మల్లేశ్వరం–పెంట్లవెల్లి మధ్యనున్న వాగుపై బ్రిడ్జి నిర్మించి వినియోగంలోకి తెచ్చారు. పెంట్లవెల్లిలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మా ణం, చౌటచెరువుపై నమాజ్‌కట్ట విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. రూ.9కోట్లతో గ్రామాల్లో సీసీరోడ్లతో పాటు రూ.1.50కోట్లతో పంచాయతీ భవనాలు, రూ.3.50కోట్లతో పాఠశాలల్లో మౌలికల సదుపాయాల కల్పించారు. గోప్లాపూర్‌, కొండూరు గ్రామాల్లో రూ.6.60కోట్లతో చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టారు. మల్లేశ్వరం, వేంకల్‌ ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం రూ.33కోట్లు మంజూరు చేసింది.

పాన్‌గల్‌లో...

పాన్‌గల్‌లో ప్రధాన రహదారి విస్తరించడంతో పాటు తెల్లరాళ్లపల్లి, రాయినిపల్లి గ్రామాల సమీపంలోని వాగులపై చెక్‌డ్యాంలు నిర్మించారు. కొత్తపేట, పాన్‌గల్‌లో గోదాంల నిర్మాణాలు పూర్తయ్యాయి. కేతేపల్లి సమీపంలో మినీ బ్రిడ్జి నిర్మాణం తుది దశలో ఉంది. కిష్టాపూర్‌ సమీపంలో రామన్నగట్టు రిజర్వాయర్‌ నిర్మాణానికి నిధులను కేటాయించారు. పాన్‌గల్‌లో ఏడీఏ కార్యాలయం ఏర్పాటుతో పాటు మండల కాంప్లెక్స్‌ నిర్మించారు.

చిన్నంబావిలో..

రూ.6,50కోట్లతో చేపట్టిన చిన్నమారూరు లిఫ్టు ఇరిగేషన్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. శ్రీశైలం నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం జీఓ జారీ చేయగా.. కలెక్టరేట్‌లో పెండింగ్‌లో ఉంది. మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాల ఏర్పాటు చేశారు. చిన్నదగడ, బెక్కెం గ్రామాల్లో విద్యుత్‌ సబ్‌స్టేషన్లు నిర్మించారు.

వీపనగండ్లలో....

వీపనగండ్ల నుంచి గోవర్దనగిరి వరకు రూ.8కోట్లతో రోడ్డు విస్తరణ చేపట్టారు. రూ.5కోట్లతో తూము కుంట సమీపంలోని వాగుపై వంతెన నిర్మించారు. రూ.7కోట్లతో సంగినేనిపల్లి నుంచి పుల్గర్‌చర్ల వరకు రోడ్డు, వల్లభాపురం సమీపంలో రూ.3కోట్లతో వా గుపై చెక్‌డ్యాం నిర్మాణాలు చేపట్టా రు. మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తయ్యాయి.

పెద్దకొత్తపల్లిలో..

వేడుకరావుపల్లి తండా సమీపంలోని వాగుపై రూ.3కోట్లతో చెక్‌డ్యాం నిర్మించారు. పెద్దకొత్తపల్లిలో రూ.1.50 కోట్లతో తహసీల్దార్‌ కార్యాలయ భవన నిర్మాణంతో పాటు దేవల్‌ తిర్మలాపూర్‌ నుంచి నాయినోనిపల్లి మైసమ్మ వరకు బీటీరోడ్డు పనులు చేపట్టారు. రూ.3కోట్లతో మైసమ్మ ఆలయం నిర్మించారు. పెద్దకొత్తపల్లికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మంజూరు కాగా.. తరగతులు ప్రారంభమయ్యాయి. బాచారం హైలెవల్‌ కెనాల్‌, పసుపుల బ్రాంచ్‌ కెనాల్‌ పనులకు ప్రభుత్వం రూ.55కోట్ల మేరకు మంజూరు చేసింది.

కోడేరులో..

నర్సాయిపల్లి నుంచి తీగలపల్లి వరకు రూ.26 కోట్లతో బీటీరోడ్డు విస్తరణ చేపట్టారు. తీగలపల్లి–బావాయిపల్లి మధ్యనున్న వాగుపై రూ.80 లక్షలతో వంతెన నిర్మించారు. ఎత్తం సమీపంలోని మాలవాగుపై రూ.1.80 కోట్లతో బ్రిడ్జి నిర్మాణంతో పాటు రూ.56 కోట్లతో తీగలపల్లి నుంచి యాపట్ల వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. కోడేరులో రూ.2.80 కోట్లతో, జనుంపల్లిలో రూ.1.50 కోట్లతో సీసీరోడ్లు నిర్మించారు. రూ.36కోట్లతో చెన్నారం నుంచి సింగోటం వరకు రోడ్డు నిర్మించారు. రూ.7కోట్లతో నాగులపల్లి నుంచి చిక్కేపల్లి తండావరకు, రూ.4కోట్లతో గుండె వాల్యానాయక్‌ తండా నుంచి మొండితండా వరకు, రూ.4కోట్లతో కోడేరు నుంచి నాగులపల్లి వరకు బీటీరోడ్ల పనులు చేపడుతున్నారు. రూ.10కోట్లతో కోడేరు నుంచి పెద్దకొత్తపల్లి వరకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి.

కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు

167కే జాతీయ రహదారి,

ఐకానిక్‌ బ్రిడ్జితో ప్రత్యేక గుర్తింపు

సాగు, తాగునీటి ప్రాజెక్టులకుకేంద్ర బిందువు

బీడు భూములు సస్యశ్యామలం

అభివృద్ధి వేగవంతమైంది..

కొల్లాపూర్‌లోని దళిత వాడల్లో సీసీరోడ్లు, డ్రెయినేజీలను పూర్తిస్థాయిలో నిర్మించారు. 4వ వార్డులో నిర్మించిన అర్బన్‌ పార్కు అద్భుతంగా ఉంది. మా వార్డు అభివృద్ధికి చిరునామాగా మారింది. అక్కడక్కడ చిన్నచిన్న పనులను పూర్తి చేయాలి.

– జామ్‌ వేణు, కొల్లాపూర్‌

వాగు వద్ద ఇబ్బందులు పడేవాళ్లం

మల్లేశ్వరం–పెంట్లవెల్లి గ్రామాల మధ్య ఉండే వాగును వర్షాకాలంలో దాటేందుకు వీలయ్యేది కాదు. మల్లేశ్వరం, వేంకల్‌, ఎంగంపల్లి గ్రామాల ప్రజలు పెంట్లవెల్లికి రావాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్లు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వాగుపై బ్రిడ్జి నిర్మించడం సంతోషంగా ఉంది. మల్లేశ్వరం, వేంకల్‌ ఎత్తిపోతల పథకాలతో సాగునీటి సమస్య తీరుతుంది.

– భోగ్యం రాంచందర్‌నాయుడు, మల్లేశ్వరం

1/3

2/3

3/3

Advertisement
Advertisement