ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి

Published Tue, Nov 28 2023 2:04 AM

వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవినాయక్‌, ఇతర అధికారులు  - Sakshi

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: పోలింగ్‌ రోజున, ముందు చేయాల్సిన పనులపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ సూచించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్‌ అధికారులతో వీసీ నిర్వహించారు. పోలింగ్‌ రోజు, ముందు నిర్వహించే విధులలో సెక్టోరల్‌ అధికారులు చాలా ముఖ్యమైన వారని, వారి ఫోన్‌ నంబర్లు రిటర్నింగ్‌ అధికారులు తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సెక్టోరల్‌ అధికారులతో ముందే ప్రత్యక్షంగా మాట్లాడడమే కాకుండా వారికి తెలిసి ఉండాలన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఇచ్చే పోలింగ్‌ శాతం విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితులలో తేడాలు రావద్దని, చివరగా ఇచ్చే పోలింగ్‌ శాతంపై పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలతోపాటు, డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాలలో సౌకర్యాలపై జిల్లా ఎన్నికల అధికారులు దృష్టి పెట్టాలని, కమ్యూనికేషన్‌ ప్లాన్‌, ఓటర్లకు సౌకర్యాలు, చేయాల్సినవి, చేయకూడని పనులు తదితర అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌ రోజున, ముందు రోజు ఏదైనా ఎన్నికలకు సంబంధించి తప్పు సమాచారం వచ్చినట్లయితే వెంటనే సరైన సమాచారం ఇచ్చే విధంగా ఫిర్యాదుల పరిష్కారం, సోషల్‌ మీడియా విభాగాలు పనిచేయాలని ఆయన సూచించారు. ఈ వీసీలో డిప్యూటీ సీఈఓ సర్ఫరాజ్‌ అహ్మద్‌, లోకేష్‌ మాట్లాడుతూ ఈవీఎంల థర్డ్‌ ర్యాండమైజేషన్‌, మాక్‌ పోలింగ్‌, మరిన్ని ఎన్నికల ప్రవర్తన నియమావళి బృందాలను ఏర్పాటు చేయడం, ఫిర్యాదులు జాప్యం లేకుండా తక్షణమే పరిష్కరించడం, పోస్టల్‌ బ్యాలెట్‌ తయారీ, డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాలు, పోలింగ్‌ పార్టీల ఏర్పాటు తదితర అంశాలపై వివిధ సూచనలు ఇచ్చారు. కలెక్టర్‌ రవినాయక్‌, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, దేవరకద్ర రిటర్నింగ్‌ అధికారులు అనిల్‌ కుమార్‌, మోహన్‌ రావు, నటరాజ్‌ హాజరయ్యారు.

పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలను సరిచూసుకోండి

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: పోలింగ్‌ కేంద్రాలలో మరోసారి ఫర్నీచర్‌, వెబ్‌ కాస్టింగ్‌, ఇతర సౌకర్యాలు సరిచూసుకోవాలని కలెక్టర్‌ రవినాయక్‌ రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలింగ్‌ ఏర్పాట్లపై రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర అధికారులతో వీసీ నిర్వహించారు. అన్ని కేంద్రాల లోపల, బయట శానిటేషన్‌ చేయించాలని, శుభ్రంగా ఉంచాలని, మరోసారి ర్యాంపులు, వీల్‌ చైర్లు తనిఖీ చేసుకోవాలని, తప్పనిసరిగా టాయిలెట్లు, తాగునీటిని ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల లోపు ఎలాంటి రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు ఉండకూడదన్నారు. అన్నిచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌ఓకు ఆదేశించారు. రిటర్నింగ్‌ అధికారులు అనిల్‌ కుమార్‌, మోహన్‌రావు, నటరాజ్‌తో పాటు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, డీఆర్‌డీఓ యాదయ్య, డీపీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

Advertisement
Advertisement