విద్యుదాఘాతంతో యువకుడు మృతి

18 Dec, 2023 09:13 IST|Sakshi
యుగేందర్‌ (ఫైల్‌)

అయిజ: ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు తగిలి యువకుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిమ్మప్ప, గోవిందమ్మ దంపతులు పట్టణంలోని రజక వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. వారు ఇళ్లు నిర్మించుకుంటున్నారు.

పెద్ద కుమారుడు యుగేంధర్‌ (32) ఆదివారం నిర్మాణ దశలో ఉన్న గోడలకు నీళ్లు చల్లేందుకు వెళ్లాడు. అక్కడ వి ద్యుత్‌ తీగలు ప్రమాదవశాత్తు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నీటి సంపులో పడి చిన్నారి..
జడ్చర్ల:
ఇంటి ఆవరణలోని నీటి సంపులో చిన్నారి పడి మృతి చెందిన ఘటన ఆదివారం స్థానిక కావేరమ్మపేటలో చోటు చేసుకుంది. కావేరమ్మపేటకు చెందిన గండు వినోద్‌, పుష్పమాల కూతురు రియాన్సిక(2) ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడింది.

కొద్దిసేపటి తర్వాత తమ కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోయింది. చివరకు నీటి సంపులోకి తొంగి చూడగా చిన్నారి కనిపించడంతో బయటకు తీసి చూడ గా అప్పటికే మృతి చెందింది. ఒక్కగానొక్క కూతురు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

చికిత్స పొందుతూ వ్యక్తి..
అచ్చంపేట రూరల్‌: అమ్రాబాద్‌ మండలం ఈదులబావికి చెందిన మోటమోని రాజు (55) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఎస్‌ఐ గోవర్ధన్‌ వివరాల మేరకు.. ఈనెల 10న అచ్చంపేటలోని ఎన్టీఆర్‌ స్టేడియం సమీపంలో ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడ్డాడు.

ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు వినోద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ
నాగర్‌కర్నూల్‌ క్రైం:
ఆర్టీసీ బస్సులో మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బంగారుగొలుసు చోరీకి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా.. బిజినేపల్లి మండలం పోలేపల్లికి చెందిన అలివేలమ్మ ఆర్టీసీ బస్సులో నాగర్‌కర్నూల్‌కు వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలో నుంచి 3తులాల బంగారు గొలుసును లాక్కెల్లారు.

అలివేలమ్మ జిల్లా కేంద్రానికి చేరుకున్న తర్వాత గొలుసును చూసుకోగా లేకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు.

కారు డ్రైవర్‌పై కేసు నమోదు
వెల్దండ: వెల్దండ మండలం కొట్రగేట్‌ వద్ద శని వారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతికి కారణమైన కారు డ్రైవర్‌ రుక్మాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆదివారం తెలిపారు.

హైదరాబాద్‌కు చెందిన కొరివి రాకేష్‌ బైక్‌పై వస్తుండగా.. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో రాకేష్‌ మృతి చెందాడు. మృతుడి తండ్రి రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

అసభ్యంగా ప్రవర్తించాడని యువకుడిపై దాడి
మహమ్మదాబాద్‌:
యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న నెపంతో యువకుడిని చితకబాధిన వారిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే మండలంలోని కప్లాపూర్‌ చెందిన మీర్జాపురం శేఖర్‌ కుటుంబీకులు అందరూ మహారాష్ట్రలో పూణెలో నివాసం ఉంటున్నారు. శేఖర్‌ గ్రామంలో ఇల్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నాడు.

కొంతకాలంగా దయాదులతో ఇంటి స్థలం విషయంలో అప్పుడప్పుడు గొడవలు అవుతున్నాయి. ఇదే క్రమంలో పథకం ప్రకారం యువతిపై అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ తిరుపతయ్య, ఆయన కుమారులు మురళీ, గణేష్‌, అంజిలయ్య, కృష్ణ, విగ్నేష్‌ కలిసి శేఖర్‌ను చితకబాదారు. దీంతో బాధితుడి తండ్రి హనుమంతు ఫిర్యాదు మేరకు ఆదివారం ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

బావపై బామ్మర్దుల దాడి
ఉండవెల్లి:
సొంత బావను బామ్మర్దులు దాడి చేసిన ఘటనలో ఆదివారం ముగ్గురిపై కేసు నమోదైంది. హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బొంకూరుకు చెందిన బోయ తిరుమలేష్‌, స్రవంతి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల వారిద్దరికి మనస్పార్థాలు రావడంతో స్రవంతి పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో పెద్దమనుషుల వదద పంచాయితీ చేశారు.

కాగా తిరుమలేష్‌ పొలానికి వెళ్లే క్రమంలో స్రవంతి తమ్ముడు నరేష్‌ దూషించి తిరుమలేష్‌పై దాడి చేశాడు. తిరుమలేష్‌ విషయం తండ్రి పెద్ద అయ్యన్నకు చెప్పగా, వారిద్దరు కలిసి పోలీస్‌స్టేషన్‌ వెళ్తుండగా బామ్మర్దులు దేవేందర్‌, నరేష్‌, అత్త గోపాలమ్మ వారిపై దాడి చేశారు. కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.

>
మరిన్ని వార్తలు