No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, Dec 18 2023 12:38 AM

- - Sakshi

అలంపూర్‌: కృష్ణా, తుంగభద్ర నదుల వరద ప్రకోపానికి నదీతీర ప్రాంతాల్లోని 32 గ్రామాలు నీటమునిగాయి.. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ నాలుగు ప్రభుత్వాలు.. నలుగురు సీఎంలు మారారు. అయినా వరద బాధితుల సమస్యలు తీరకపోగా.. పునరావాసం సైతం కలగానే మారింది. తమ గోడు వినండని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా అసెంబ్లీలో అలంపూర్‌ వరదల ప్రస్తావన, పునరావాసంపై చర్చతో వరద బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నా యి. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయం ప్రస్తావించడంతో పునరావాసం కల నెరవేరుతుందని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో చర్చ

ఈ నెల 15న అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన చర్చలో ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయగా సీఎం రేవంత్‌రెడ్డి అలంపూర్‌ వరద బాధితుల అంశాన్ని ప్రస్తావించారు. గత పదేళ్లలో అలంపూర్‌ వరద బాధితులకు నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదని అందుకే మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించారని ఘాటు విమర్శలు చేశారు. దీంతో 14 ఏళ్ల చేదు జ్ఞాపకం మరోసారి అసెంబ్లీ సాక్షిగా నెమరు వేసుకున్నట్లుగా స్థానికంగా చర్చ జరుగుతోంది.

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..

అలంపూర్‌ నియోజకవర్గ కేంద్రంతోపాటు రాజోలి, తుమ్మలపల్లి, పడమటి గార్లపాడు, తూర్పుగార్లపాడు, తుమ్మిళ్ల, నసనూరు, ఆర్‌.గార్లపాడు, కుట్కనూరు, మద్దూరు గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ గ్రామాలకు పునరావాసం కల్పించాలని అప్పట్లో నిర్ణయించారు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాలను పునఃనిర్మిస్తామని హామీ ఇచ్చింది. కానీ, నిర్వాసితుల గోడును ఎవరూ పట్టించుకోలేదు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందించిన సహకారంతో ఇటిక్యాల మండలంలోని ఆర్‌.గార్లపాడు, అయిజ మండలంలోని కుట్కనూరు, రాజోలిలో కొంత మేరకు పునరావసం కల్పించారు. మిగిలిన చోట ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నచందనంగా తయారైంది.

● వరదల్లో నిరాశ్రయులైన రాజోలిలో కొత్త రాజోలి నిర్మాణంలో భాగంగా దాదాపు 212 ఎకరాలను సేకరించారు. అందులో 3,125 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణాల కోసం ప్లాట్లుగా మార్చారు. వీటిలో 2,175 ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా.. 450 అసంపూర్తిగానే ఉన్నాయి.

● తూర్పుగార్లపాడులో 169 ఇళ్లు, తుమ్మిళ్లలో 499, నసనూరులో 290 ఇళ్ల నిర్మాణాలు కొలిక్కి రాలేదు. చేనేత కార్మికులకు ఇళ్లతోపాటుగా మగ్గాల కోసం అదనంగా 750 షెడ్లను నిర్మిస్తామని భరోసా కల్పించారు. ఇప్పటికీ షెడ్ల నిర్మాణాలు చేపట్టలేదు.

మారని తలరాతలు

2009 అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగి అలంపూర్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాలను వరదలు ముంచెత్తాయి. అప్పటి సీఎం రోశయ్య అలంపూర్‌ను సందర్శించి.. అన్నిరకాలుగా ఆదుకుంటామని, కొత్త అలంపూర్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత రాజకీయ పరిస్థితుల్లో సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఆర్‌.గార్లపాడులో నిర్మించిన ఒక్క పురావస గృహాలను ప్రారంభించారు. మిగిలిన గ్రామాలను పట్టించుకోలేదు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం, సీఎంగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చింది. అందులోనైనా అర్హులకు న్యాయం జరుగుతుందని ఆశించారు. కానీ, పదేళ్లలో వరద బాధితులకు ఎలాంటి మేలు చేకూర్చలేదు.

‘అలంపూర్‌ వరదలపై’

అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం

2009లో కృష్ణా, తుంగభద్ర

నదులకు వరద ప్రళయం

నీట మునిగిన 32 గ్రామాలు..

సర్వం కోల్పోయిన నిరాశ్రయులు

14 ఏళ్ల గడిచినా ఇప్పటికీ

నెరవేరని హామీలు

తమను ఆదుకోవాలని

బాధితుల వేడుకోలు

Advertisement
Advertisement