ఆరోగ్యమస్తు..! | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమస్తు..!

Published Mon, Dec 18 2023 12:38 AM

- - Sakshi

ఏయే విభాగాల్లో..

పీహెచ్‌సీల్లో జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, అబ్‌స్ట్రెట్రిక్‌ సర్జరీ, నెఫ్రాలజీ, అర్థోపెడిక్‌ సర్జరీ, ప్రొసీడ్యూర్స్‌, పిడియాట్రిక్స్‌, జనరల్‌ మెడిసిన్‌ తదితర విభాగాల్లో ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీలో వైద్యంతో వచ్చే నిధుల్లో 30 శాతం ఆస్పత్రి అభివృద్ధికి మిగతా మొత్తాన్ని వైద్యం చేసిన వైద్యులు, సిబ్బందికి ఇతర ఖర్చులకు వాడుతున్నారు.

పేదలకు ఉపయోగం..

రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స పరిమితిని పెంచడం పేదలకు మేలు చేస్తుంది. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడం పేదలకు ఎంతో ఉపయోగకరం. అన్ని రకాల మెడికల్‌, సర్జికల్‌లలో చికిత్స పొందే వారికి మేలు జరుగుతుంది. అర్హులైన వారు ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందే అవకాశం ఉంది. ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.

– కృష్ణ, డీఎంహెచ్‌ఓ

కొండంత ఆసరా..

రాజీవ్‌ ఆరోగశ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచడం మాలాంటి వారికి కొండంత అండ. ఇది వరకు గతంలో నా భర్తకు ప్రమాదం జరిగినప్పుడు పూర్తిస్థాయిలో ఆర్థిక సహాయం అందకపోగా రూ.లక్ష వరకు అప్పు చేసి ఆస్పత్రి బిల్లు చెల్లించా. ఇప్పుడు ఏ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లినా రూ.లక్షల్లో బిల్లు వేస్తుంది. ప్రభుత్వం పెంచిన ఆర్థిక సహాయం ద్వారా పేద కుటుంబాలకు మేలు జరుగుతుంది.

– లక్ష్మి, వెన్నాచేడ్‌, మహమ్మదాబాద్‌ మండలం

ఆస్తులు అమ్ముకోవాలి..

ఇప్పుడు చిన్నపాటి ఆపరేషన్లకే రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. నిరుపేదలు ఆ బిల్లులు చెల్లించాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోగశ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచడం పేదలకు వరం. కొన్ని ఆస్పత్రుల్లో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఒక్కోసారి అనుమతించడం లేదు. అలా కాకుండా ఏ వైద్యం అయినా తక్షణమే చేసేలా చర్యలు తీసుకోవాలి. – హన్మంతురెడ్డి, వెంకట్‌రెడ్డిపల్లి,

మహమ్మదాబాద్‌ మండలం

పాలమూరు: పేద, మధ్య తరగతి ప్రజలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేవారు. దీనికి ఆర్థిక పరిస్థితులే కారణం. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చారు. 2006లో పైలెట్‌ ప్రాజెక్టు కింద మొదటి ఆరోగ్యశ్రీ శిబిరం మహబూబ్‌నగర్‌లోని జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా ప్రజలు ఉచితంగా చికిత్స పొందే అవకాశం కల్పించారు. రేషన్‌కార్డులో పేరున్న ప్రతిఒక్కరూ రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 9 లక్షల కుటుంబాలు ఉండగా 31 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికి రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందే అవకాశం ఉంది. ఉమ్మడి పాలమూరులో ఐదు జిల్లాలు ఉండగా రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిధిలో 44 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. వీటన్నింటిలో 1,672 వ్యాధులకు రూ.10 లక్షల వరకు చికిత్స అందించనున్నారు.

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించినప్పుడు రూ.2 లక్షల వరకు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందేవారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆరోగ్యశ్రీ తరహాలోనే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ రెండు పథకాలను కలిపి రూ.5 లక్షల వరకు వైద్య సేవలు పొందేలా చర్యలు తీసుకున్నారు. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజీవ్‌ ఆరోగ్యశ్రీగా మార్చుతూ ఖర్చు పరిధిని రూ.10 లక్షలకు పెంచి ఈ నెల 9 నుంచి అమలు చేస్తు ంది. మొత్తం 1,672 రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తుండగా.. ఇందులో మెడికల్‌ విభాగంలో 289, సర్జికల్‌లో 1,383 వ్యాధులకు రూ.10 లక్షల వరకు చికిత్స పొందవచ్చు. 126 రకాల వ్యాధిగ్రస్తులకు చికిత్స అనంతరం ఏడాదిపాటు ఉచితంగా మందులు అందిస్తారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఆరోగ్యశ్రీ చికిత్స వివరాలు

జిల్లా కేసులు నగదు

(రూ.కోట్లలో)

మహబూబ్‌నగర్‌ 15,008 28.15

నాగర్‌కర్నూల్‌ 3,059 5.08

నారాయణపేట 1,918 4.99

గద్వాల 1,654 2.58

వనపర్తి 470 0.58

ఉమ్మడి జిల్లాలోని 44 ఆస్పత్రుల్లో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సేవలు

మెడికల్‌, సర్జికల్‌ విభాగాల్లో 1,672 రకాల వ్యాధులకు ఉచిత చికిత్స

126 రకాల వాధిగ్రస్తులకు

చికిత్స అనంతరం మందుల పంపిణీ

వైద్య ఖర్చులు రూ.5 లక్షల నుంచి

రూ.10 లక్షలకు పెంపు

నిరుపేదలకు మేలు చేకూర్చనున్న పథకం

సేవలు ప్రారంభం..

ఉమ్మడి జిల్లాలోని 71 పీహెచ్‌సీలతోపాటు 8 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభమయ్యాయి. అలాగే అర్బన్‌ హెల్త్‌సెంటర్లతోపాటు పీహెచ్‌సీల్లో ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన– ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ చికిత్సకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు విడుదల చేస్తోంది. ఈ పథకంలో ప్రతిరోజు రూ.2,100 చొప్పున ప్రతి కేసుకు రూ.10,500 మంజూరవుతాయి. వీటిలో 65 శాతం నిధులు ఆస్పత్రి అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, 35 శాతం నిధులు సిబ్బందికి ప్రోత్సాహకంగా అందిస్తారు. పీహెచ్‌సీల్లో మొత్తం 53 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకంలో అందించడానికి జాబితా రూపొందించారు. ఈ పథకం కింద బాధితులకు రూ.5 లక్షల వరకు చికిత్స అందించడానికి వీలవుతుంది. వీటిలో కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షలు భరిస్తోంది.

రూ.10 లక్షలకు పెంపు

1/4

2/4

3/4

4/4

Advertisement
Advertisement