శీతాకాలంలో.. సస్యరక్షణతోనే దిగుబడి | Sakshi
Sakshi News home page

శీతాకాలంలో.. సస్యరక్షణతోనే దిగుబడి

Published Mon, Dec 18 2023 12:34 AM

- - Sakshi

అలంపూర్‌: పంటల్లో సస్యరక్షణతోనే అధిక దిగుబడులు సాధించవచ్చని ఏడీఏ సక్రియనాయక్‌ రైతులకు సూచిస్తున్నారు. సాగు చేసిన పంటకు శీతాకాలంలో వచ్చే వివిధ రకాల చీడ పీడలు, తెగుళ్ల గురించి ఏడీఏ ఈ విధంగా వివరిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

కంది

కందిలో మారుకా మచ్చల పురుగు ఆశిస్తుంది. దీన్నె బియ్యపు పురుగు అని కూడా అంటారు. ఈ పురుగు లేత ఆకులను, మొగ్గలను, పూతలను చుట్టలుగా చేసి లోపల నుంచి వాటిని తినేస్తుంది. దీని వల్ల పంట దిగుబడి ఘణనీయంగా తగ్గుతుంది. కాయ అడుగు భాగాన్ని చిన్న రంద్రాన్ని చేసుకుని గింజలను తింటాయి. కాయ లోపల కూడా చుట్టలతో ఉండటం వలన పురుగు మందు ప్రభావం నుంచి తప్పించుకుంటుంది.

నివారణ

పంట మొగ్గ దశలో ఉన్నప్పుడు వేప నూనె 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. దీని వలన తల్లి పురుగు గుడ్లు పెట్టకుండా ఉంటుంది. ఒక వేళ ఏవైన గుడ్డు పెట్టినా అవి పొదగవు. పురుగు నివారణకు అసిఫెట్‌ 1.5 గ్రాములు లేదా ధయోడికార్బ్‌ 1.5 గ్రాములు లేదా నువాలురాన్‌ ఒక మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. వీటితోపాటు నువాన్‌ ఒక మి.లీ. లీటరు నీటికి కలిపి తప్పకుండా పిచికారి చేసుకోవాలి. నువాన్‌ మందుకు ఆవిరయ్యే గుణం ఉంది కాబట్టి అది లోనికి చొచ్చుకెళ్లి పురుగును చంపుతుంది.

పచ్చ పురుగు

పచ్చ పురుగు తల్లి రెక్కల పురుగు లేత మొగ్గలపై పూతపై బంగారం రంగులో ఒక్కొక్కటిగా గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల నుంచి పొదిగిన పురుగులు ఆకులను, పూతను, మొగ్గను, కాయలను తిని పంటను పూర్తిగా నాశనం చేస్తాయి.

నివారణ

ఈ పురుగు నివారణకు నువాలురాన్‌ ఒక మి.లీ. లేదా ఇమామెడ్డిన్‌ బెండోమేట్‌ ఒక గ్రాము లేదా ప్లూ బెండమయిడ్‌ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

కంది పంట

ఎండు తెగులు

ఈ తెగులు భూమిలో ఉండే శిలీంధ్రం వలన వ్యాపిస్తుంది. పుజేరియం శీలింధ్రం ఎండు తెగులును కలగజేస్తుంది. ఈ శీలింధ్రము యొక్క మొక్క వేరును ఆశించి లోనికి వెళ్లి నీటి లవణాలను సరఫరా చేసే కణజాలాన్ని మూసి వేస్తుంది. దీని వలన వేరు అక్కడక్కడ లావుగా మారుతుంది. ఈ తెగులు సోకిన మొక్కలు మొదట ఆకులు వడలపోయి తర్వాత పూర్తిగా ఎండిపోతాయి.

నివారణ

ఈ తెగులు నివారణకు ట్రైకోడర్మా విరిడి అనే శీలింధ్ర నాశిని 8 గ్రాములు ఒక కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా బానిస్టిన్‌ ఒక గ్రాము లేదా సాఫ్‌ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్క మొదలల్లో పది రోజుల వ్యవధిలో రెండు సార్లు వేసుకోవాలి.

Advertisement
Advertisement