DDLJ: 26 ఏళ్ల తర్వాత.. మళ్లీ ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’

24 Oct, 2021 08:34 IST|Sakshi

షారుక్‌ ఖాన్, కాజోల్‌ జంటగా ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’(డీడీఎల్‌జే) చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 1995లో విడుదలైన ఈ క్లాసిక్‌ను మళ్లీ డైరెక్ట్‌ చేయనున్నారు ఆదిత్య చోప్రా. కానీ ఇది రీమేక్‌ కాదు.. సీక్వెలూ కాదు. ఇంగ్లిష్‌ ప్రేక్షకుల కోసం ఆదిత్య చోప్రా బ్రాడ్‌ వే (రంగస్థలం కోసం) విభాగంలో ఈ చిత్రాన్ని వీక్షకులకు అందించనున్నారు. ఈ షోకు ‘కమ్‌ ఫాల్‌ ఇన్‌ లవ్‌: ది డీడీఎల్‌జే మ్యూజికల్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. సొంత నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలింస్‌ పైనే ఆదిత్య చోప్రా నిర్మించనున్నారు.

ఈ సందర్భంగా ఆదిత్య చోప్రా మాట్లాడుతూ – ‘‘డీడీఎల్‌జే’ను నా 23ఏళ్ల వయసులో తెరకెక్కించాను. నిజానికి ఈ సినిమాను మొదట్లో హిందీలో తీయాలనుకోలేదు. ఒకటి.. రెండు ఇండియన్‌ సినిమాలను తీశాక హాలీవుడ్‌లో టామ్‌క్రూజ్‌తో తీయాలనుకున్నాను.. కుదర్లేదు. ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత థియేటర్‌ ఆర్టిస్ట్‌లతో తీయనున్నాను. అయితే ఈసారి సినిమాగా కాదు.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ బ్రాడ్‌ వే మ్యూజికల్‌గా రానుంది. అమెరికన్‌ అబ్బాయి, ఇండియన్‌ అమ్మాయి మధ్య ఈ కథనం ఉంటుంది. మళ్లీ నా వయసు నాకు 23 ఏళ్లలా అనిపిస్తోంది. 2022లో ‘డీడీఎల్‌జే’ వీక్షకుల ముందుకు వస్తుంది’’ అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు