నాన్న ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారు: ఎస్పీ చరణ్‌

18 Aug, 2020 16:36 IST|Sakshi

సాక్షి, చెన్నై: కరోనా వైరస్ బారినపడి  చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌ను తొలగించామని, మిగిలిన వైద్య సేవలు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు మంగళవారం ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయనను ఐసీయూ నుంచి రూమ్‌కు మార్చామని తెలిపారు. మరోవైపు తన అన్నయ్య ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని బాలు సోదరి, గాయని ఎస్పీ శైలజ చెప్పారు. వైద్యులు అందిస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ ఆడియోను విడుదల చేశారు.
(చదవండి : బాలు వార్డులో ఆయన పాటల ప్రసారం)

‘బాలు అన్నయ్య రోజు రోజుకీ బెటర్ అవుతున్నారు. డాక్టర్స్ ఆయన హెల్త్ డెవలప్‌మెంట్ విష‌యంలో చాలా హ్యాపీగా ఉన్నారు. వెంటిలేష‌న్ తీసేశారు. ఎకో సిస్ట‌మ్ మాత్రం అలాగే ఉంచారు. నెమ్మ‌దిగా స్పృహ‌లోకి వ‌స్తున్నారు. ప్ర‌పంచ‌మంతా అన‌య్య ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నార‌ని నాకు తెలుసు. త‌ప్ప‌కుండా అన్న‌య్య హ్యాపీగా బ‌య‌ట‌కు వ‌స్తారు’ అని తెలిపారు. ఆగస్టు 5న ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా సోకిన సంగతి తెలిసిందే.

నాన్న ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారు
ఎస్పీ బాలును వెంటిలేటర్‌ తొలగించి రూమ్‌కు తరలించారనేది అవాస్తవమని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ అన్నారు. ఈమేరకు మంగళవారం ఆయన ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ఎస్పీ బాలు నిన్న ఎలాంటి స్థితిలో ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని ఆయన చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. త్వరలోనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటారని ఆశిస్తున్నామని చరణ్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు