డయాలసిస్‌ సెంటర్‌లో ఎల్‌ఈడీ టీవీ

23 Mar, 2023 02:12 IST|Sakshi

ఏటూరునాగారం: ఏటూరునాగారం సామాజిక వైద్యశాల డయాలసిస్‌ సెంటర్లో ఎల్‌ఈడీ టీవీని ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్‌ బుధవారం ప్రారంభించారు. మంగపేటకు చెందిన శ్రీధర్‌వర్మ టీవీని బహుకరించగా ఏఎస్పీ ప్రారంభించారు. అనంతరం డయాలసిస్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న రోగులతో ఏఎస్పీ మాట్లాడారు. సేవలు, వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పడిన ఏటూరునాగారం బ్లడ్‌ డోనర్స్‌ ఆపదలో ఉన్న ప్రతీ ఒక్కరికి రక్తం అందిస్తున్నారని డోనర్స్‌, నిర్వాహకులను ఏఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో బ్లడ్‌ డోనర్స్‌ అధ్యక్షుడు వహిద్‌, గౌరవ సలహాదారుడు ఖాజాపాషా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పేకాట శిబిరంపై

పోలీసుల దాడి

ఏటూరునాగారం: మండల పరిధిలోని రాంనగర్‌ ముత్యాలమ్మగుడి వెనుకాల పేకాట ఆడుతున్న శిబిరంపై బుధవారం దాడి చేసి పలువురిని అరెస్టు చేసినట్లు ఎస్సై రమేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అరెస్టు వివరాలను వెల్లడించారు. కొంతమంది పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడి చేసి 8 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శిబిరం వద్ద రూ.12, 530నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఏటూరునాగారానికి చెందిన గార గణపతి, రాంనగర్‌కు చెందిన గార గాంధీలను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ఆరుగురు రాంనగర్‌కు చెందిన గార నగేష్‌, బొల్లె వెంకటేష్‌, బొల్లె రాజబాబు, నర్సింగరావు, తోట శ్రీకాంత్‌, అల్లి లక్ష్మయ్య పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

కాళేశ్వరం అర్చకుడికి

ఉగాది పురస్కారం

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వరముక్తీశ్వరస్వామి దేవస్థానంలో రుగ్వేద వేద పండితుడు బైకుంఠపాండాకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉగాది పురస్కారాన్ని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. బుధవారం ఉగాది పర్వదినం సందర్భంగా ప్రభుత్వం దేవాలయాల్లోని అర్చకులకు పురస్కారంతో పాటు శాలువాలతో సన్మానించారు. కాళేశ్వరాలయం వేదపండితుడికి అవకాశం దక్కడంతో ఈఓ మహేష్‌, అర్చక, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

‘చలో హైదరాబాద్‌’ను విజయవంతం చేయండి

కాళేశ్వరం: స్టాండింగ్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా గతంలో ఎన్పీడీసీఎల్‌ విద్యుత్‌ భవనం ముట్టడి జరిగిందని, ఈనెల 24న చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలని ఎన్పీడీసీఎల్‌ కంపెనీ నిర్వహణ అధ్యక్షుడు నాగుల తిరుపతిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలతో తెలిపారు. ఎన్పీడీసీఎల్‌ కంపెనీ నుంచి భారీగా విద్యుత్‌ ఉద్యోగులు, ఆర్టీజన్‌ ఉద్యోగులు, ట్రాన్స్‌కో, జెన్‌కో, అన్ని విభాగాల కార్మికులు, తెలంగాణ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (హెచ్‌ 82) ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

సంఘీభావ పాదయాత్ర

మొగుళ్లపల్లి: తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల రాజ్య స్థాపనకై డాక్టర్‌ విశారదన్‌ మహరాజ్‌ చేస్తున్న స్వరాజ్య పాదయాత్రకు సంఘీభావంగా డీఎస్పీ ఆధ్వర్యంలో బుధవారం మొట్లపల్లి నుంచి ఎల్లారెడ్డిపల్లి వరకు ఐదు కిలోమీటర్ల సంఘీభావ యాత్ర చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ జిల్లా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 90 శాతం ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు తమ సొంత రాజ్యాన్ని నిర్మించుకున్నప్పుడే సకల సమస్యలకు పరిష్కారం ఉంటుందన్నారు. అణగారిన వర్గాల ప్రజలు తమ సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసమే డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఓటు అనే ఆయుధాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘీభావ పాదయాత్ర జిల్లా ఇన్‌చార్జ్‌ దూడపాక రాజు మహరాజ్‌, డీఎస్పీ రాష్ట్ర కమిటీ సభ్యులు మంద రమేష్‌ మహరాజ్‌, మండల అధ్యక్షుడు జన్నె లక్ష్మణ్‌, వార్డు సభ్యురాలు జ న్నె రజిత, జన్నె రాకేష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు