పచ్చిరొట్ట ఎరువులతో సాగు సుభిక్షం | Sakshi
Sakshi News home page

పచ్చిరొట్ట ఎరువులతో సాగు సుభిక్షం

Published Wed, Dec 20 2023 1:26 AM

పెద్దవూరలో సాగవుతున్న పచ్చిరొట్ట పైరు - Sakshi

పెద్దవూర: ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ పంటల సాగులో విచక్షణా రహితంగా వినియోగించే రసాయనాల ద్వారా అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. నేల భౌతిక లక్షణాలు దెబ్బతిని నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతున్నాయి. సూక్ష్మ పోషక లోపాలు తరుచుగా కనపడుతున్నాయి. ఉత్పాదక తగ్గి, ఖర్చు పెరిగిపోతోంది. ప్రస్తుతం రైతులు బోర్లు, బావులు, చెరువుల కింద యాసంగికి వరినార్లు పోస్తున్నారు. ఈ నేపథ్యంలో నేల సహజత్వాన్ని కాపాడుతూ అధిక దిగుబడులు పైర్లు ఎంతగానో సహకరిస్తాయని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి కె.సందీప్‌ తెలిపారు.

పచ్చిరొట్ట ఎరువులు

తేలికగా చివికి పోయే స్వభావం కలిగి, నేలకు సత్తువను చేకూర్చే పంటలు , అటువంటి లక్షణాలు గల పంటల ఆకులను గానీ పచ్చిరొట్ట ఎరువులు అంటారు.

పచ్చిరొట్ట పంటల సాగు

u పచ్చిరొట్ట పైర్లను పొలంలో చల్లి అవి పెరిగాక అదే పొలంలో కలియదున్ని పంట వేసుకోవడం. ఉదా: జీలుగ, జనుము, పిల్లిపెసర, అలసంద, ఉలువ, పెసర

u పచ్చిరొట్ట ఆకులను బయట నుంచి సేకరించి పొలంలో కలియదున్ని కుళ్లనిచ్చి తర్వాత పంట వేసుకోవడం. ఉదా: గైలరిసీజియా, జిల్లేడి, గానుగ, నేల తంగేడు.

u పొలం గట్ల వెంట, బావుల దగ్గర గైలరిసీడియా చెట్ల నాటితే ఒక్కో చెట్టు ఏటా రెండుసార్లు (జూలై, డిసెంబర్‌ నెలల్లో) 100–125 కిలోల పచ్చిరొట్టను ఇస్తుంది.

u ఎకరానికి జీలుగ 12 కిలోలు, జనుము 16 కిలోలు, పిల్లిపెసర 8 కిలోలు, అలసంద ఎకరానికి 10 కిలోల విత్తనాలు వేసుకోవాలి.

పచ్చిరొట్ట పంటలు–లక్షణాలు

u త్వరగా ఎదిగి ఎక్కువ ఆకులు, పచ్చికాండం ఇవ్వగలిగే సామర్థ్యం, మొక్క భాగాలు మృదువుగా, పెళుసుగా, రసపూరితంగా ఉండి త్వరగా కుళ్లిపోయే స్వభావం కలిగి ఉండాలి. అన్ని రకాల నేలలు, వాతావరణ పరిస్థితులు, నీటి ఎద్దడిని తట్టుకునే సామర్థ్యం కలిగి, పప్పు జాతికి చెందిన మొక్కలై ఉండాలి.

పచ్చిరొట్ట పైర్లు–ప్రయోజనాలు

u పచ్చిరొట్ట పైర్లు నేలలో కుళ్లేటప్పుడు జరిగే రసాయన ప్రక్రియల వలన భూమిలోని పోషక పదార్థాలు మొక్కలకు సులభంగా లభ్యమవుతాయి.

u వీని సాగువలన నేల భౌతిక లక్షణాలు వృద్ధి చెందటమే కాకుండా నత్రజని ఎరువుల వాడకాన్ని 25–30 శాతం తగ్గించవచ్చు.

u నేల నీటి సామర్థ్యం వృద్ది చెందటంతో పాటు నేల కోతను అరికడుతుంది.

u పచ్చిరొట్ట ఎరువులు సేంద్రియ ఎరువులు. నీటి ద్వారా నేలలో మేలు చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెంది మొక్కలకు రోగనిరోధక శక్తిని పెంచటంతో నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను అరికడుతుంది.

u భూమి గుల్లబారి పంట మొక్కల వేర్లకు అవసరమయ్యే గాలి, నీరు పుష్కలంగా అందుతాయి.

u దీర్ఘకాలిక పంటల్లో, పండ్లతోటల్లో పచ్చిరొట్ట పంటను సాగు చేసి పూత దశలో కలిదున్నడం వలన నేల సారవంతం అవుతుంది.

u చౌడు సమస్యను తొలగించటంతో పాటు భూసార పరిరక్షణకు తోడ్పడతాయి.

u ముఖ్యంగా వరిసాగు చేసే ప్రాంతాల్లో వరి పంట ముందు పచ్చిరొట్ట పైర్లను సాగు చేయడం వలన బియ్యంలో విటమిన్లు, మాంసకృత్తుల శాతం పెరిగినట్లు పరిశోధనా ఫలితాల్లో వెల్లడైంది. దిగుబడి కూడా 15–20 శాతం పెరుగుతుందని రుజువైంది.

పచ్చిరొట్ట పంటలు – విత్తే సమయం, జాగ్రత్తలు

పచ్చిరొట్ట పైర్లను తొలకరి వర్షాలు మొదలైనప్పుడు నాటుకోవచ్చు. పచ్చిరొట్ట దిగుబడి, నత్రజని స్థిరీకరణ, పైరు దశ మీద ఆధారపడి ఉంటుంది. సాధారణ దిగుబడి రావడానికి 45 రోజుల సమయం పడుతుంది. పూత దశలో రోటావేటర్‌ లేదా పవర్‌ టిల్లర్‌ సహాయంతో కలియదున్నడం వలన భూమికి అత్యధిక సత్తువను చేకూర్చుతుంది. నత్రజని వృథాగా పోకుండా ఉండటానికి కనీసం 15 నుంచి 22 సెం.మీ. లోతులో కలియదున్నాలి. మురుగునీరు పోయే సౌకర్యం లేని వరి పొలాల్లో పచ్చిరొట్ట కుళ్లుతున్నప్పుడు మధ్యలో తయారయ్యే కొన్ని వాయువులు అప్పుడే నాటిన వరి మొక్కలకు హాని కలిగిస్తాయి. కాబట్టి కలియదున్నిన రెండు వారాల తర్వాత మాత్రమే నాట్లు వేసుకోవాలి.

పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్‌

1/1

Advertisement
Advertisement