మర్కజ్‌లో ప్రార్థనలకు అనుమతి

16 Apr, 2021 15:27 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ మసీదులో రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని 50 మంది ప్రజలు రోజుకు 5 సార్లు ప్రార్థనలు చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. అయితే, కరోనా నేపథ్యంలో ప్రార్థనా స్థలాలను మూసివేయాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(డీడీఎంఏ) జారీ చేసిన నోటిఫికేషన్‌లో లేదని వివరించింది. చాలా వరకు ప్రార్థనాస్థలాలు తెరిచే ఉంటున్నాయని పేర్కొంది. ఈ విషయంలో కేంద్రం కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలిపింది. డీడీఎంఏ ఈనెల 10వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్, ఇతర ప్రామాణిక కార్యాచరణ నిబంధనలకు లోబడి తమ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు.

ఈ రంజాన్‌ నెలలో నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రాంగణంలోని బంగ్లేవాలీ మసీదులోని బేస్‌మెంట్‌ పైనున్న మొదటి అంతస్తులో 50 మందికి రోజుకు 5 పర్యాయాలు నమాజ్‌ చేసుకునేందుకు అనుమతించాలని జస్టిస్‌ ముక్తా గుప్తా నిజాముద్దీన్‌ పోలీసులను ఆదేశించారు. డీడీఎంఏ ఉత్తర్వులతోపాటు, సామాజిక, మత, రాజకీయ, ఉత్సవ సంబంధ సమావేశాలను, ప్రజలు గుమికూడటాన్ని అనుమతించే విషయంలో అఫిడవిట్‌ సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. అయితే, మరింత మందిని అనుమతించాలనీ, మసీదులోని ఇతర అంతస్తుల్లో కూడా ప్రార్థనలు చేసుకునేందుకు వీలు కల్పించాలంటూ ఢిల్లీ వక్ఫ్‌ బోర్డు తరఫున న్యాయవాది రమేశ్‌గుప్తా కోరగా కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా కోర్టు నిరాకరించింది. ఈ మేరకు నిజాముద్దీన్‌ ఎస్‌హెచ్‌వోకు దరఖాస్తు చేసుకోవచ్చనీ, దీనిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. ఇలా ఉండగా, కరోనా లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా వేలాదిమందితో తబ్లిగీ జమాత్‌ నిర్వహించిన ఆరోపణలపై గత ఏడాది మార్చి 31వ తేదీ నుంచి మూతబడి ఉన్న నిజాముద్దీన్‌ మర్కజ్‌ను తిరిగి తెరిచేందుకు అనుమతివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై జూలై 15వ తేదీన విచారణ జరపనున్నట్లు హైకోర్టు తెలిపింది.

చదవండి: 

‘కుంభమేళా’పై విమర్శల వెల్లువ

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు