సిసోడియా అరెస్ట్‌: ఢిల్లీ పోలీసులు అలర్ట్‌.. ప్లాన్‌ మార్చిన సీబీఐ!

27 Feb, 2023 10:30 IST|Sakshi

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాను సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిసోడియాను సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సుమారు ఎనిమిది గంటల పాటు ప్రశ్నలు సంధించింది. అనంతరం, సిసోడియా అరెస్ట్‌ను ప్రకటించింది. ఇక, సిసోడియా అరెస్ట్‌ నేపథ్యంలో సీబీఐ ఆఫీసు వద్ద 144 సెక్షన్‌ విధించింది. 

ఇదిలా ఉండగా.. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సిసోడియాను సీబీఐ ప్రత్యేక కోర్టుకు తీసుకువెళ్లనున్నారు. కాగా, సిసోడియా అరెస్ట్‌కు నిరసనగా ‘ఆప్‌’.. దేశవ్యాప్తంగా నిరసలను పిలుపునిచ్చింది. అలాగే, ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనలకు పిలుపునిచ్చింది. అయితే, ఆప్‌ ఆందోళనల నేపథ్యంలో సిసోడియాను వర్చువల్‌గా కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

మరోవైపు.. ఆప్‌ నేతల ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆప్ కార్యాలయం వద్ద సీఆర్‌పీఎఫ్‌ బలగాలు మోహరించడంతో ఆప్‌ నేతలు స్పందించారు. బీజేపీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. సిసోడియాను సీబీఐ అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో బీజేపీ నేత కపిల్‌ మిశ్రా స్పందించారు. కేజ్రీవాల్ కేబినెట్ నుంచి మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లను తొలగించాలని మిశ్రా డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు