‘ఈనాడు’ తప్పుడు రాతలపై నిరసన జ్వాలలు | Sakshi
Sakshi News home page

‘ఈనాడు’ తప్పుడు రాతలపై నిరసన జ్వాలలు

Published Mon, Feb 27 2023 10:37 AM

Protest In AP Against Eenadu False News - Sakshi

సాక్షి, అమరావతి: లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లుగా చూపి జర్నలిజం విలువలను మంటగలుపుతోన్న ‘ఈనాడు’ తీరును అందరూ వ్యతిరేకించాలని ప్రజాస్వామ్యవాదులు పిలుపు­నిచ్చారు. టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టకపోయినా, కొట్టారని పాత ఫొటోలతో ప్రజలను మోసం చేసిన ఈనాడు దిగజారుడు పాత్రికేయ విలువలకు వ్యతిరేకంగా గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి.

ఆదివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, వివిధ సంఘాల నేతలు, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈనాడు తీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్ర­మాలు చేపట్టారు. ఈనాడు దినపత్రిక విషపు, అబద్ధపు వార్తల నుంచి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈనాడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నేత పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. రోజూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విషం కక్కుతూ తప్పుడురాతలు ప్రచురిస్తూ రామోజీరావు దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేద ప్రజల అభివృద్ధి కోసం సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వ్యతిరేక వార్తలు రాయడం రామోజీ దిగజారు­డుతనానికి పరాకాష్ట అన్నారు. ఇలాంటి అబద్ధపు వార్తలు ప్రచురిస్తున్న రామోజీరావు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పా­లని డిమాండ్‌ చేశారు. తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న ఈనాడు పత్రికను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

రామోజీ క్షమాపణ చెప్పాలి
కర్నూలు పాతబస్టాండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆదివారం ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల నేతల అధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొండారెడ్డి బురుజు వద్ద ఈనాడుకు వ్యతిరే­కంగా నినాదాలు చేసి, అక్కడి నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈనాడు పత్రిక ప్రతు­లను దహనం చేశారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లా పరిషత్‌ కార్యాలయం ఎదుట, కడప సెవన్‌ రోడ్స్‌æ సెంటర్‌లో, సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈనాడు పత్రిక ప్రతులను తగులబెట్టారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఈనాడు దిగజారుడు రాతల పట్ల నిరసన తెలిపారు.

ఒంగోలులో నిరసన కార్యక్రమంలో నేతలు మాట్లా­డు­తూ.. నాడు ఎన్‌టీఆర్‌ను గద్దె దించి చంద్రబాబుకు పట్టం కట్టడంలో సక్సెస్‌ అయిన రామోజీ ఆటలు.. ప్రస్తుత సోషల్‌ మీడియా యుగంలో సాగవని.. ఇప్పుడు ఆయన పప్పులు ఉడకవని ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద, గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ఈనాడు తీరు­ను నిరసిస్తూ నినాదాలు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఈనాడు ప్రతులను దహనం చేశారు. ఏలూరు పట్టణంలోని ప్రధాన సెంటర్‌లో, తూర్పు­గోదావరి జిల్లా నిడదవోలులో ఈనాడు వైఖరిని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. విశాఖ­పట్నం జిల్లా ఆంధ్ర విశ్వవిద్యాలయం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఈనాడుకు వ్యతిరేకంగా నినా­దాలు చేశారు. విజయనగరంలో రామోజీ­రావుకు వ్యతి­రేకంగా నినాదాలు చేశారు. అన్ని ఊళ్లలోనూ ఈనా­డు చేసిన తప్పునకు రామోజీ క్షమాపణ చెప్పాలని ప్రజలు, విద్యార్థి సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement