Delhi Liquor Policy: ఎల్‌జీ దెబ్బకు వెనక్కి తగ్గిన కేజ్రీవాల్‌.. మరో 6 నెలలు..!

30 Jul, 2022 11:30 IST|Sakshi

న్యూఢిల్లీ:  లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్ కుమార్‌ సక్సేనా దెబ్బకు ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొత్త ఎక్సైజ్‌ పాలసీ అమలుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. కొత్త మద్యం పాలసీని పక్కన పెట్టి పాత విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. 2022-23 కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వం ఇంకా చర్చలు కొనసాగిస్తున్న నేపథ్యంలో మరో ఆరు నెలల పాటు పాత విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

2022-23 ముసాయిదా ఎక్సైజ్‌ పాలసీని ఇంకా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా ఆమోదానికి పంపించలేదు. అయితే.. ఇప్పటికే 2021-22 ఎక్సైజ్‌ పాలసీని మార్చి 31 తర్వాత రెండు సార్లు పొడిగించింది ఢిల్లీ ప్రభుత్వం. అది జులై 31తో ముగియనుంది. తాజాగా తీసుకొచ్చే కొత్త పాలసీలో లిక్కర్‌ హోమ్‌ డెలివరీ వంటీ కీలక మార్పులను ప్రతిపాదించింది ఆబ్కారీ శాఖ. ఈ విషయంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా శనివారం మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు.. కొత్త పాలసీ అమలులోకి వచ్చే వరకు మరో ఆరు నెలల పాటు పాత విధానాన్ని అమలులో ఉంచాలని గత గురువారమే సిసోడియా ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు.. 2021, నవంబర్‌ 17న అమలులోకి వచ్చిన ఎక్సైజ్‌ పాలసీకి ముందు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాలుగు కార్పొరేషన్లు నిర్వహించిన లిక్కర్‌ లావాదేవీల వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ ఆదేశించినట్లు తెలిసింది. ఈ నాలుగు కార్పొరేషన్లు నగరంలో మొత్తం 475 లిక్కర్‌ దుకాణాలను నడుపుతున్నాయి.

ఇదీ చదవండి: కొత్త మద్యం పాలసీలో ప్రస్తుతం జోక్యం చేసుకోలేం

మరిన్ని వార్తలు