సట్లెజ్‌-యమున లింక్‌ కెనాల్‌పై ఫైర్‌

18 Aug, 2020 19:25 IST|Sakshi

పంజాబ్‌-హరియాణ జల జగడం

సాక్షి, న్యూఢిల్లీ : సట్లెజ్‌-యుమునా లింక్‌ కెనాల్‌ పూర్తయితే పంజాబ్‌ అగ్నిగుండమవుతుందని, హరియాణాతో నీటి పంపక వివాదం జాతీయ భద్రతకు సమస్యగా పరిణమిస్తుందని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ అన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌లు కూడా హాజరైన ఈ భేటీలో సట్లెజ్‌-యమునా లింక్‌ కెనాల్‌పై ముందుకెళితే జాతీయ భద్రతకు పెను సవాల్‌ ఎదురవుతుందని అమరీందర్‌ సింగ్‌ కేంద్రాన్ని హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పంజాబ్‌ అగ్నిగుండమవుతుందని, హరియాణా, రాజస్తాన్‌లపై కూడా ఇది ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. పంజాబ్‌, హరియాణ రాష్ట్రాల ఏర్పాటు అనంతరం 1966లో ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకంపై వివాదం నెలకొంది.

నదీ జలాల్లో హరియాణా అధిక వాటా కోరుతుండగా, మిగులు జలాలు లేవని వాదిస్తూ పంజాబ్‌ ఇందుకు నిరాకరిస్తోంది. 1975లో ఇందిరా గాంధీ ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు చేస్తూ దీనికోసం కాలువను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దశాబ్ధాలుగా కొనసాగుతున్న ఈ కాలువ పనులను పూర్తిచేసేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు చొరవ చూపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన మీదట ఈ భేటీ జరిగింది. మిగులు జలాలు ఉంటే పొరుగు రాష్ట్రానికి నీరు ఇచ్చేందుకు తమకు ఎలాంటి సమస్య లేదని సమావేశం అనంతరం సింగ్‌ పేర్కొన్నారు. నీటి లభ్యతపై అంచనా కోసం తాజా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. హరియాణా సీఎంతో ఈ అంశంపై మాట్లాడేందుకు తాను సిద్ధమని చెప్పారు. జల వివాదాన్ని పరిష్కరించేందుకు చర్చలు కొనసాగిస్తూనే కాలువ నిర్మాణం పూర్తిచేయాలని కేంద్ర మంత్రి షెకావత్‌ పేర్కొన్నారు. కాగా, ఈ అంశంపై తదుపరి చర్చల కోసం​ రెండు రాష్ట్రాలు చండీగఢ్‌లో సంప్రదింపులు జరుపుతాయని హరియాణ ముఖ్యమంత్రి ఎంఎల్‌ ఖట్టర్‌ తెలిపారు. చదవండి : విద్యార్థుల‌కు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు

మరిన్ని వార్తలు