Arvind Kejriwal On Delhi Demolitions: స్వతంత్ర భారతంలో అది అతి పెద్ద విధ్వంసం

16 May, 2022 15:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుల్డోజర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాల పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) అధికారులు ఉన్నఫలంగా ఇళ్లను కూల్చివేశారు. బుల్డోజర్ల అంశంపై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. కోర్టును సైతం ఆశ్రయించారు. 

ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. సోమవారం ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీలో ప్రజల షాపులు, ఇళ్లను బీజేపీ.. బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని తప్పుబట్టారు. ఢిల్లీలో 80 శాతం ఇండ్లు ఆక్రమణలోనే ఉన్నాయి. వాటన్నింటినీ కూల్చివేస్తే..  స్వతంత్ర భారత దేశంలో అది అతిపెద్ధ విధ్వంసమని అభివర్ణించారు. ఈ క్రమంలో 63 లక్షల మంది ప్రజల ఇళ్లు, షాపులు కూల్చివేతకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఢిల్లీలో దాదాపు 50 లక్షల మంది అనధికార కాలనీల్లో, 10 లక్షల మంది 'జుగ్గీల్లో' నివాసం ఉంటున్నారని తెలిపారు. వారి ఇళ్లను కూల్చివేస్తారా..? అని బీజేపీపై మండిపడ్డారు.

ఢిల్లీలో శాంతి కాలనీలు, మురికివాడలను తొలగించాలన్నది వారి(బీజేపీ) ఆలోచన అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మురికివాడల్లో ఉన్నవారికి ఇళ్లు సమకూరుస్తామని చెప్పిన బీజేపీ దానికి బదులు ఇళ్లను కూల్చేస్తోందని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ నేతృత్వంలోని మున్సిపల్ కార్పొరేషన్లు చేపడుతున్న ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్‌ను వ్యతిరేకించినందుకు జైలుకు వెళ్లేందుకు ఆప్‌ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలని కేజ్రీవాల్ వారికి సూచించారు. 

ఇది కూడా చదవండి:  ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే 

మరిన్ని వార్తలు