రాజస్తాన్‌ హైడ్రామా: జైపూర్‌ నుంచి జైసల్మేర్‌కు

31 Jul, 2020 13:06 IST|Sakshi

ఆగస్ట్‌ 17న బలపరీక్ష!

జైపూర్‌ : రాజస్తాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. జైపూర్‌ ఫెయిర్‌మోంట్‌ హోటల్‌లో బసచేసిన ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ శిబిరానికి చెందిన ఎమ్మెల్యేలను జైసల్మేర్‌కు తరలిస్తున్నారు. జైసల్మేర్‌కు వెళ్లేందుకు జైపూర్‌ హోటల్‌ నుంచి గహ్లోత్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు ఎయిర్‌పోర్ట్‌కు బస్సుల్లో తరలివెళ్లారు. ఆగస్ట్‌ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్‌ అంగీకరించడంతో తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు గహ్లోత్‌ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పైలట్‌ శిబిరం నుంచి ఎమ్మెల్యేలను తిరిగి కాంగ్రెస్‌ గూటికి రప్పించే ప్రయత్నాలు చేస్తూనే తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని యోచిస్తున్నారు.

మరోవైపు ఆగస్ట్‌ 17న అశోక్‌ గహ్లోత్‌ బలపరీక్షను కోరే అవకాశం ఉందని భావిస్తున్నారు. చివరి ప్రయత్నంగా తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ను తిరిగి కాంగ్రెస్‌ గూటికి రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. పార్టీలోకి తిరిగి రావాలని పైలట్‌కు రాజస్తాన్‌ పీసీసీ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌ దోత్సరా విజ్ఞప్తి చేశారు. 2018లో పార్టీ టికెట్‌పై గెలిచిన వారంతా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగాలని కోరారు. ఇక ఆగస్ట్‌ 14 నుంచి రాజస్తాన్‌ అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా అంగీకరించిన వెంటనే ఎమ్మెల్యేల బేరసారాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఆరోపించారు. చదవండి : ‘అసెంబ్లీ సమావేశాలు అడ్డుకోలేదు, కానీ..’


గతంలో ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు రూ 10 కోట్ల నుంచి రూ 15 కోట్లు ఆఫర్‌ చేయగా ఇప్పుడవి ఊహించని స్ధాయికి చేరాయని గహ్లోత్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారు. పైలట్‌ వెనకుండి బీజేపీ కుట్రకు తెరలేపిందని గహ్లోత్‌ సైతం ఇటీవల కాషాయ పార్టీపై ఆరోపణలు గుప్పించారు. 

మరిన్ని వార్తలు