బైక్‌పై శివ-పార్వతుల వేష ధారణలో నిరసన.. అరెస్ట్‌!

10 Jul, 2022 14:42 IST|Sakshi

డిస్పూర్‌: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌లతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయి. పెరిగిపోతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ధరల పెరుగుదలపై తమకు తోచిన విధంగా నిరసన తెలుపుతున్నారు ప్రజలు. అలా.. పెట్రోల్‌ ధరలపై వినూత్న రీతిలో నిరసన తెలిపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శివుడు, పార్వతి వేషధారణలో ధరలపై చిన్న నాటకం ప్రదర్శించి హిందూ సంఘాల ఆగ్రహానికి గురయ్యారు. 

అసోంలోని నగావ్‌ జిల్లాకు చెందిన బిరించి బోరా అనే వ్యక్తి తనకు వచ్చిన విద్యతో పెట్రోల్‌ ధరల పెరుగుదలపై నిరసన తెలిపారు. బోరా.. శివుడిగా చిన్న నాటకం ప్రదర్శించారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌ వంటి హిందూ సంస్థలకు ఆగ్రహాన్ని తెప్పించింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాయి. రాజకీయాల కోసం మతాలను వాడుకుంటున్నారని ఆరోపించాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. బిరించి బోరాను అరెస్ట్‌ చేసి నగావ్ సదర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

శివపార్వతుల నాటకంలో ఏముంది?
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హయాంలో ధరల పెరుగుదలపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన బిరించి బోరా.. వీధి నాటకం వేశారు. బోరా శివుడిగా.. కోయాక్టర్‌ పరిశిమిత పార్వతిగా బైక్‌పై వెళ్తుంటారు. కొద్ది దూరం వెళ్లగానే పెట్రోల్‌ అయిపోయి.. బండి ఆగిపోతుంది. ఈ విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదం నడుస్తుంది. దీంతో పెట్రోల్‌ ధరల పెంపు సహా ఇతర అంశాలను లేవనెత్తుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై శివుడు ఆరోపణలు చేస్తారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని పిలుపునిస్తారు.

ఇదీ చదవండి: జైలు నుంచే అక్రమాలు.. 81 మంది అధికారులకు లక్షల్లో ముడుపులు

మరిన్ని వార్తలు