చైతన్య భారతి: జె.ఆర్‌.డి.టాటా / 1904–1993

18 Jun, 2022 16:20 IST|Sakshi

గగనస్థాయి నాయకత్వం

1992 మార్చిలో జరిగిన ఓ సన్మాన సభలో జె.ఆర్‌.డి టాటా మాట్లాడుతూ.. ‘‘వచ్చే శతాబ్దంలో భారతదేశం ఆర్థిక అగ్రరాజ్యం అవుతుందని ఓ అమెరికన్‌ ఆర్థిక శాస్త్రవేత్త అన్నారు. దేశం ఆర్థికంగా అగ్రరాజ్యం అవాలని నేను కోరుకోవడం లేదు. ఇది ఆనందమయ దేశం కావాలని కోరుకుంటున్నా..’’ అని అన్నారు. ఆయన జీవితం దాదాపు 20వ శతాబ్దం మొత్తానికీ విస్తరించింది. రైట్‌ సోదరులు తొలిసారిగా విమానం కనిపెట్టిన తర్వాత కొద్ది రోజులకే ఆయన జన్మించారు. 1991లో మన్మోహన్‌ సింగ్‌ సరళీకరణను ప్రవేశపెట్టడాన్ని కూడా టాటా వీక్షించారు. గగన విహారమనేది ధనికులకే పరిమితమైన రోజుల్లో 1932లో ఆయన టాటా ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు.

ప్రపంచంపై నాజీలు దౌర్జన్యాలు సాగిస్తున్న రోజుల్లో యుద్ధం తర్వాత దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆలోచించారు. జె.డి . బిర్లా, కస్తూర్‌భాయ్‌ లాల్‌భాయ్‌ లాంటి అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలను సమావేశపరిచి మాట్లాడారు. ఫలితంగా ‘బాంబే ప్లాన్‌’ సిద్ధమైంది. 1945లో ఆయన ‘టెల్కో’ను ప్రారంభించారు. దేశం కోసం ఓ ప్రతిష్ఠాత్మకమైన ఇంజనీరింగ్‌ సంస్థను ప్రారంభించాలని ఆయన ఆలోచన. జె.ఆర్‌.డి. 1948లో ఎయిర్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ను ప్రారంభించారు. పాశ్చాత్య దేశాలకు వెళ్లిన తొలి ఏషియన్‌ ఎయిర్‌ లైన్‌ అదే!

టాటా సంస్థతో భాగస్వామ్యం వహించాల్సిందిగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. ప్రభుత్వం అందుకు సమ్మతించింది. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్‌ సంస్థలు బండికి రెండు చక్రాల లాగా వ్యవహరించాలని ఆయన భావన. ‘‘మీరు ఎవరికైనా నాయకత్వం వహించాలీ అంటే వారి పట్ల ప్రేమతో ఆ పని చేయాలి’’ అని ఆయన అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో, హోమీ భాభా భారతదేశంలో చిక్కుబడిపోయారు.

దాంతో కేంబ్రిడ్జిలో చేస్తున్న పనిని భారత్‌లోనే భాభా కొనసాగించుకునేందుకు వీలుగా బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో ‘కాస్మిక్‌ ఎనర్జీ’ పేరిట ఒక ప్రత్యేక విభాగాన్ని టాటా ప్రారంభించిన సంగతి చాలామందికి తెలియదు. నాలుగేళ్ల తరువాత ‘టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌’ అనే భాభా ప్రణాళికకు ఆయన ఊతమిచ్చారు. చనిపోడానికి 20 నెలల ముందు టాటాకు భారత రత్న పురస్కారం లభించింది. 
– స్వర్గీయ ఆర్‌.ఎం.లాలా, టాటా వారసత్వ చరిత్రకారుడైన జర్నలిస్టు

మరిన్ని వార్తలు