Youtuber Pankaj Sharma: ఎక్కడికెళ్లినా నిరాదరణే.. కట్‌ చేస్తే.. కోట్లు సంపాదిస్తున్నాడు..!

26 Oct, 2021 19:01 IST|Sakshi

ఎందరికో స్ఫూర్తినిస్తోన్న యూట్యూబర్‌ పంకజ్‌ శర్మ

న్యూఢిల్లీ: ప్రతి మనిషి జీవితంలో తాను కోరుకున్న రంగంలో మంచి స్థాయిలో స్థిరపడాలని ఆశిస్తాడు. అందుకు తగ్గట్టే ప్రయత్నాలు చేస్తాడు. కొందరికి వెంటనే అవకాశాలు లభిస్తాయి.. ఇక కొందరికేమో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఫలితం లభించదు. నిరాశవాదులైతే.. మాకింతే ప్రాప్తం అనుకుని వదిలేస్తారు. మరికొందరు ఉంటారు.. అపజయాలు ఎదురైన కొద్ది.. వారిలో కసి పెరుగుతుంది. తమకు ఎదురైన అడ్డంకులునే సోపానాలుగా మార్చుకుని విజయం సాధిస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తే యూట్యూబర్‌ పంకజ్‌ శర్మ. పేరు గుర్తుపట్టడం కాస్త కష్టమే కానీ ‘బక్లోల్‌ వీడియో’ అని యూట్యూబ్‌ చానెల్‌ పేరు చెప్తే టక్కున గుర్తుపడతారు చాలా మంది. అతడి సక్సెస్‌ స్టోరీ ఎందరికో ప్రేరణగా నిలుస్తోంది. ఆవివరాలు..

ఢిల్లీకి చెందిన పంకజ్‌ శర్మ గురుగోబింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్శిటీ నుంచి బీసీఏ, ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత 15 వేల రూపాయల జీతానికి గురగావ్‌లో ఉద్యోగంలో చేరాడు. కానీ ఉద్యోగం అతడికి సంతృప్తినివ్వలేదు. సినిమాల్లోకి వెళ్లాలనేది పంకజ్‌ కోరిక. 
(చదవండి: నెలకు రూ.95 లక్షలు సంపాదిస్తున్న యూట్యూబర్‌)

ఆ ఆలోచన మార్చింది...
ఈ క్రమంలో ఉద్యోగం వదిలిపెట్టి.. అవకాశాల కోసం సినీ కార్యాలయాల చుట్టూ తిరగడం ప్రారంభించాడు. కానీ వెళ్లిన ప్రతి చోటా నిరాదరణే. ఇవేవీ పంకజ్‌ని కుంగదీయలేదు. మరింత పట్టుదలగా ప్రయత్ం చేశాడు. ఈ క్రమంలో అతడికి ఓ ఆలోచన వచ్చింది. అవకాశాల కోసం తిరిగేబదులు.. తనకు తానే అవకాశాలు సృష్టించుకోవడం మంచిది అనుకున్నాడు. 

యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభం...
దానిలో భాగంగా బక్లోల్‌ వీడియో అనే యూట్యూబ్‌ చానెల్‌ని ప్రారంభించాడు. మొదటి సంపాదన 9800 రూపాయలు. రెండేళ్లు పట్టు వదలకుండా ప్రయత్నించడంతో చానెల్‌కి సబ్‌స్ర్కైబర్లు పెరిగారు. వ్యూస్‌ కూడా పెరిగాయి. ఈ క్రమంలో పంకజ్‌ తీసిన దేశీ బచ్చే వర్సెస్‌ ఆంగ్రేజ్‌ మీడియం వీడియో ఏకంగా 78 మిలియన్ల వ్యూస్‌ సంపాదించింది. 
(చదవండి: యూట్యూబ్‌ను దున్నేస్తున్నారు, రోజూ 1,500 కోట్ల షార్ట్‌ వీడియోస్‌)

డైమండ్‌ బటన్‌...
10 మిలియన్ల సబ్‌స్క్రైబర్స్‌ దాటితే.. ఆ చానెల్‌కి డైమండ్‌ బటన్‌ ఇస్తారు. పంకజ్‌ యూట్యూబ్‌ చానెల్‌ కూడా డైమండ్‌ బటన్‌ పొందింది. ప్రసుత్తం పంకజ్‌ చానెల్‌కి 10.2మిలియన్ల సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇతడి చానెల్‌కి 305కే, ఫేస్‌బుక్‌లో 4.1మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఒకప్పుడు నిరాదరణను ఎదుర్కొన్న పంకజ్‌ ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. 

చదవండి: జాబ్‌ వదిలేసి పాత ‍డ్రమ్ములతో వ్యాపారం.. అతని జీవితాన్నే మార్చేసింది

మరిన్ని వార్తలు