గ్రెటా‌ టూల్‌కిట్‌: బెంగళూరు యువతి అరెస్ట్‌

14 Feb, 2021 10:57 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన రిపబ్లిక్‌ డే హింసాత్మక ఘటనలో పోలీసులు మరో ముందడుగు వేశారు. గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో చెలరేగిన హింసకు సంబంధించి బెంగుళూరుకు చెందిన ఓ యువతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఢిల్లీలో హింస చెలరేగే విధంగా సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో 21 ఏళ్ల దిశరవి అనే పర్యవరణ ఉద్యమకారినిని ఆదివారం అరెస్ట్‌ చేశారు. స్వీడన్‌కు చెందిన పర్యవరణ యాక్టివిస్ట్‌ గ్రెటా థన్‌బర్గ్‌ కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న దీక్షలకు గ్రేటా మద్దతు తెలపడం, ఆమె సోషల్‌ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌ దేశంలో పెను ప్రకంపనలు రేపింది.

దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు గ్రేటా షేర్‌ చేసిన టూల్‌కిట్‌ ఖలికిస్తాన్‌ ఉగ్రవాద సంస్థలు తయారు చేసినట్లు ఉందంటూ ఢిల్లీ పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా రైతు దీక్షలకు మద్దతు తెలుపుతూ.. దేశ అంతరిక వ్యవహారాల్లో తలదూర్చారని ఆరోపిస్తూ పలువురు అంతర్జాతీయ ప్రముఖులపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగానే గ్రెటా టూల్‌కిట్‌తో సంబంధముందని భావిస్తున్న బెంగళూరు యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పర్యవరణ పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా ‘ఫ్రైడే ఫర్‌ ఫ్యూచర్‌’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 4న ఆమెపై ఢిల్లీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు